Tuesday, October 25, 2011

శ్రీ నారాయణ తీర్ధులు

సంగీత ప్రపంచంలో శ్రీ నారాయణ తీర్ధులవారి పేరు విననివారు చాలా అరుదుగా ఉంటారనే చెప్పాలి. ఏ సంగీత కచేరిలో ఐనా, కనీసం ఒకటైనా ఆయన రచన పాడనివారుండరు. నృత్య కార్యక్రమాలలో ఐతే ఇంక చెప్పనక్కరనేలేదు. చాలా చిత్రాలలో కూడా ఆయన రచించిన తరంగాలు అనేకం చిత్రించారు. 
  • బాలా గోపాల మా ముగ్ధరా కృష్ణ పరమకల్యాణ గుణాకర (మోహన రాగం)

  • కృష్ణం కలయ సఖీ సుందరం బాల (ముఖారి రాగం)

  • గోవింద ఘటయ మమ ఆనంద మమృతమిహ (కాంభోజి రాగం)

  • ఆలోకయే శ్రీ బాలకృష్ణం (హుశేని)

  • పరమ పురుష మనుయామ వయం సఖి (కేదారగౌళ)

  • మా మవ మాధవ దేవా (కేదారగౌళ)

  • గోవిందమిహ గోపికానందకందం (మధ్యమావతి)

  • బ్రూహిముకుందేత్తి రసనే (కళ్యాణి)
ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన "కృష్ణలీలాతరంగిణి" లో వ్రాసిన ఒక్కొక్క కీర్తన ఒక ఆణిముత్యం అనటంలో అతిశయోక్తి లేదు. అంతటి మహాభక్తుడూ, సంగీతకారుడు, అంధ్ర, సంస్కృత సాహిత్యవేత్త గురించి క్లుప్తంగా వివరించటమే ఈ వ్యాస ముఖ్యోద్దేశం.

శ్రీ నారాయణ తీర్ధులవారు ఆంధ్రదేశంలో, కృష్ణజిల్లలోని "కాజా" గ్రామంలో జన్మించారు. ఈయన జననకాలం గురించి అనేక వాదోపవాదాలున్నా, తంజావూరులోని సరస్వతీ గ్రంథాలయంలోని పాతప్రతుల వలన ఈయన క్రీ.శ. 1650-1745 వరకు ఉండి ఉండవచ్చని పండితుల అభిప్రాయం. ఈయన కొంతకాలం గోదావరి జిల్లాలోని కూచిమంచి అగ్రహారంలో నివసించారు. తరువాత శ్రీకాకుళం, శోభనాద్రి, వెంకటాద్రి మొదలైన స్థలాలు దర్శించి, చివరగా తమిళనాడులో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. కర్నాటక సంగీతానికి ఆదిపీఠమైన తంజావూరు జిల్లాలోని సంగీత విద్వాంసుల వలనే ఈయనకి అత్యంత పేరుప్రఖ్యాతులు వచ్చాయి.

 సనాతన మార్గావలంబికుల నమ్మకం ప్రకారం, వేదవ్యాసుడు కలియుగంలో మూడు జన్మలు ఎత్తారు. అందులో మొదటి అవతారంలో శృంగార మహాకవి జయదేవునిగా 12వ శతాబ్ధంలో జన్మించి అష్టపదులను (12 సర్గలలో 24 అష్టపదులు) రచించారని, రెండవజన్మలో శృంగార మహాకవి క్షేత్రయ్య (క్షేత్రజ్ఞ)గా 15/16 శతాబ్ధంలో జన్మించి సుమారు 24000 శృంగారపదాలను శ్రీ కృష్ణునిపై రచించారనీ, మూడవ జన్మలో యోగి నారాయణ తీర్ధులుగా జన్మించి శ్రీ కృష్ణుని లీలలపై కృష్ణలీలాతరంగిణీ ని రచించారని వారి ప్రగాఢ విశ్వాసం.

నారయణ తీర్ధులవారు సంస్కృతంలో పండితుడేకాక, సంగీత నాట్య శాస్త్రాలలో నిష్ణాతుడు. శ్రీ శంకరాచారుల వారికి జరిగినటువంటి సంఘటనే శ్రీ నారాయణతీర్ధుల వారి జీవితంలో తటస్థించి వారు సన్యాసం తీసుకోవటానికి దారి తీసిందని ఒక కథనం.

ఆ కథ ప్రకారం, ఒకనాడు నారాయణ తీర్ధులవారు వరదలో చిక్కుకుని కొట్టుకుపోతూ సుడిగుండంలో చిక్కుకున్నారుట. ఆ సమయంలో భగవంతుని ప్రార్థించి, ఈ గండం నుంచి బయటపడితే ఈ ఇహలోక సౌఖ్యాలు వదిలి సన్యాసం తీసుకుంటా అని అనుకున్నారుట. విచిత్రంగా ఆ వరదపొంగు తగ్గి నారాయణ తీర్ధులవారు క్షేమంగా ఇల్లు చేరుకున్నారు. తరువాత ఆయన సన్యాసం విషయం మర్చిపోయారు. కానీ ఆయన ధర్మపత్ని ఆయనలో ఒక విధమైన మార్పు గమనించి అతనిని సన్యాసం తీసుకోవటానికి ప్రోత్సహించిందని చెప్తారు.

ఒక రోజు ఆయనకు విపరీతమైన కడుపునొప్పి మొదలయింది. ఆ బాధ నివృత్తికోసం ఆయన దక్షిణాదిగా బయలుదేరారు. అలా కొన్ని వందల మైళ్ళు నడిచాక అలసటతో మూర్చపోయే సమయంలో ఎక్కడి నుంచో ఒక వరాహం అతనిని తంజావూరులోని భూపతిరాజపురం అనే ఒక గ్రామంలోని ఒక పాటుపడ్డ గుడికి దారి చూపింది. ఆ గుడికి చేరటంతోనే నారాయణ తీర్ధులవారి అనారోగ్యం క్షణంలో తగ్గిపోయింది. ఆ గుడిని ఎంతో మహిమ గలదిగా గుర్తించిన నారాయణతీర్ధులవారు దానిని పునరుద్ధరించటానికి పూనుకున్నారు. అదే సమయంలో ఆయన "కృష్ణలీలాతరంగిణి" రచించారు. తరువాతి కాలంలో ఈ గ్రామం "వరాహపురం/వరహూరూ" అనే పేర్లతో పిలబడుతోంది.

సన్యాసాశ్రమానికి పూర్వం, ఈయన నామధేయం "మాధవ" లేక "గోవింద శాస్త్రి" అనీ, వీరి తండ్రి నామధేయం "గాంధర్వ" లేక "నీలకంఠ శాస్త్రి" అని, సన్యాసం తీసుకున్న తరువాత "నారాయణ తీర్ధులు" గా పేరు మార్చుకున్నారని వాదోపవాదాలున్నాయి. అలాగే పైన చెప్పిన కథ తంజావూరులోని పెన్నా నదిలో జరగలేదని కృష్ణనదిలో జరిగిందని కూడా కొన్ని వాదనలున్నాయి.

   కృష్ణలీలాతరంగిణి:
నారాయణతీర్ధుల వారు ఈ కావ్యాన్ని నృత్యనాటకంగా రచించారు.  వేదవ్యాస ముని రచించిన మహాభాగవతంలోని దశమ స్కందంలోని మొదటి 58 అధ్యాయాల ఆధారంగా ఈ కావ్యాన్ని రచించారు. ఇందులో మొత్తం 12 తరంగాలలో 153 కీర్తనలు, 302 శ్లోకాలు, 31 చూర్ణికలు ఉన్నాయి. కృష్ణ అవతారం నుంచి మొదలుపెట్టి రుక్మిణీ కళ్యానంతో ముగిసే ఈ కావ్యంలో నారాయణతీర్ధుల వారు కనీసం 34 లోక ప్రియమైన రాగాలను వాడారు. త్రిపుట, ఆది, రూపక, చాపు, ఝంప, మత్య విలంబ, ఏక మరియు ఆట తాళాలలో ఈ కీర్తనలు నిభధించారు. సంస్కృత పండితుడైనప్పటికీ అత్యంత క్లిష్టమైన భాషలో కాక సరళమైన సంస్కృతంలో ఉన్న ఈ రచనలలో 17 రకములైన చంధసులని ఉపయోగించారు.


ఈయన రచనలన్నీ, వీరు శిష్యులు, వారిలో ముఖ్యంగా తులజ మహారాజు వ్రాతప్రతులను చేయించి శుద్ధిపరచి జాగ్రత్త చేసి మనకందించారు.

         శ్రీ నారాయణ తీర్ధుల వారి ఇతర రచనలు:
  • సుభోదిని : శంకరాచార్య బ్రహ్మసూత్రా భాష్యానికి వివరణ (సంస్కృతంలో)
  • వివరణదీపిక: సురేశ్వరాచార్యులవారి పంచీకరణవర్తిక కి వివరణ (తెలుగులో)
  • పారిజాతాపహరణం (తెలుగు మరియు సంస్కృతంలో)
  • హరిభక్తి సుధాకరం
  • శాండిల్య భక్తి సూత్ర వ్యాఖ్యానం


Sunday, October 16, 2011

రామాయణంలో రావణుని పాత్ర


       మన భారతదేశంలో రామాయణం చదవని వారు కాని, వినని వారు కానీ ఉండరనటం లో ఆశ్చర్యమేమీలేదు. ఎందుకంటే, ఆ మహా కావ్యం మన సంస్కృతిలో మన నరనరాలలో జీర్ణించుకుని పోయింది. ఎవరైన ఒక సద్గుణవంతుడు మనకి కనపడితే శ్రీ రాముడితో పోలుస్తు ఉంటాము. శ్రీ రాముని గుణాలను వాల్మీకి అంత గొప్పగా వర్ణించారు. ఐతే ప్రతినాయకుడైన రావణాసురుడిని కూడా అదే రీతిలో పొగిడారు. రాముని గురించి గాని ఆయన గొప్పదనాన్ని గురించి గానీ వర్ణించ నవసరం లేదు. అవి అందరికీ తెలిసిన సంగతులు. రామాయణంలోని ప్రతి నాయకుడైన రావణ బ్రహ్మ గురించి కొంచము ముచ్చటిద్దాం. 


రావణ బ్రహ్మ జననం:
         భాగవత పురాణం ప్రకారం, ఒక పర్యాయం శ్రీమహావిష్ణువు దర్శనార్థం సనత్ కుమారులు వైకుంఠం చేరుకొనగా, వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు సనత్ కుమారులను చూసి చిన్న బాలురు అనుకొని అడ్డగిస్తారు. దీని వల్ల సనత్ కుమారులకు ఆగ్రహం వచ్చి జయవిజయులను భూలోకంలో జన్మించమని శపిస్తారు. ద్వారపాలకులు విషయాన్ని గ్రహించి శాపవిమోచనాన్ని అర్థించగా హరి భక్తులుగా ఏడు జన్మలు గానీ, లేదా హరి విరోధులుగా మూడు జన్మలు గానీ భూలోకంలో గడిపితే, శాపవిమోచనం కలిగి తిరిగి తనను చేరుకుంటారని విష్ణుమూర్తి సూచిస్తాడు. ఏడు జన్మల పాటు విష్ణుమూర్తికి దూరంగా జీవించలేమని భావించిన జయ విజయులు మూడు జన్మల పాటు హరికి శత్రువులుగా జన్మించడానికి సిద్ధపడతారు. ఈ విధంగా జయవిజయులు కింది జన్మలెత్తుతారు.


                 కృతయుగము: హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు

                 త్రేతాయుగము: రావణాసురుడు, కుంభకర్ణుడు

                 ద్వాపరయుగము: శిశుపాలుడు, దంతవక్ర్తుడు


         ఈ విధంగా త్రేతాయుగంలో జన్మించిన వారే రావణ, కుంభకర్ణులనే అన్నదమ్ములు. రావణాసురుడి జన్మవృత్తాంతం స్కాంద పురాణము, బ్రహ్మఖండం నందు రామేశ్వర సేతు మాహాత్మ్యం నందు చెప్పబడింది.          బ్రహ్మ మానస పుత్రుడైన పులస్త్యుని కుమారుడు విశ్రవసునికి, దైత్య రాకుమారియైన కైకసికి రావణాసురుడు జన్మిస్తాడు. కైకసికి తండ్రి సుమాలి. సుమాలి తనకు అత్యంత పరాక్రమవంతుడైన మనుమడు కావాలన్న కోరికతో అందరు రాకుమారులను అంగీకరించకుండా మహా తపస్వి అయిన విశ్రవసుకి కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాడు. కైకసి, తండ్రి ఆజ్ఞపై అసుర సంధ్యాకాలంలో విశ్రవసు మహర్షి తపస్సు చేసుకొంటుండగా ఆయన వద్దకు వెళ్లి, తపోశక్తితో తన కోరిక తెలుసుకొనమని అంటుంది. విశ్రవసు విషయం తెలుసుకొని అసుర సంధ్యాకాలం చేత క్రూరులైన పుత్రులు జన్మిస్తారని చెబుతాడు. కాని ఒక ధార్మికుడైన కుమారుడు కూడా జన్మిస్తాడని చెబుతాడు. ఆ ధార్మిక పుత్రుడే విభీషణుడు. ఈ విధంగా పుట్టినవాడు రావణాసురుడు. అందువల్ల రావణాసురుడు దైత్యుడు, బ్రాహ్మణుడు.

     రావణాసురుడి తండ్రి వైపు నుండి- తాత పులస్త్యుడు, అతని తండ్రి బ్రహ్మ. రావణాసురుని తల్లి వైపు నుండి- తాత మల్యవుడు, అమ్మమ్మ తాటకి. రావణాసురుడి మామ మారీచుడు. రావణాసురుడికి ఆరుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు. వారు 1. కుబేరుడు, 2. విభీషణుడు, 3. కుంభకర్ణుడు, 4. ఖరుడు, 5. దూషణుడు, 6. అహిరావణుడు (ఇతనినే మైరావణుడు అనికూడా అంటారు). 7. కుంభిని (సోదరి, లవణాసురిని తల్లి), 8. శూర్పణక. (సోదరి).


         రావణ బ్రహ్మ పాతాళ రాజ పుత్రిక ఐన మండోదరిని వివాహమాడాడు. వీరికి ఎడుగురు సంతానం. వారు 1. ఇంద్రజిత్తు, 2. ప్రహస్తుడు, 3. అతికాయుడు, 4. అక్షయకుమారుడు, 5. దేవాంతకుడు, 6. నరాంతకుడు, 7. త్రిశిరుడు.

రావణ బ్రహ్మ గుణగణాలు:
       
        "రావణుని కిరీటం, ఆభరణాలు, వస్త్రాలు, అనులేపనాదులు అత్యద్భుతంగా ఉన్నాయి. మహా తేజశ్శాలియు, వీరుడును ఐన రావణుడు పది శిరస్సులతో ఒప్పుచు, అనేక కౄర మృగములతో నిండిన శిఖరములు గల మందరగిరి వలె ప్రకాశిస్తున్నాడు. మణిమయాలంకృతమైన ఉన్నతాసనంపై కూర్చొని ఉన్నాడు. మంత్రాంగ నిపుణులైన నలుగురు మంత్రులచే పరివేష్టితుడై ఉన్నాడు." అప్పుడు హనుమంతుడు ఇలా అనుకొన్నాడు.
         "ఆహా! ఈ రావణుని రూపం అత్యద్భుతం. ధైర్యం నిరుపమానం. సత్వం ప్రశంసార్హం. తేజస్సు అసదృశం. నిజముగా ఈ రాక్షస రాజు సర్వ లక్షణ శోభితుడు. ఈ అధర్మానికి ఒడి గట్టకపోతే సురలోకానికి సైతం ప్రభువయ్యేవాడు. లోకాలన్నీ ఇతనికి భయపడుతున్నాయి. ఇతడు కృద్ధుడైనచో సమస్త జగత్తునూ సముద్రమున ముంచి ప్రళయం సృష్టించగల సమర్ధుడు గదా!"



     రావణాసురుని శివభక్తి అనుపమానం. అందుకు ఆయన రచించిన శివతాండవ స్తోత్రమే నిదర్శనం. కైలాసవాసుని తన భక్తితో మెప్పించిన పరమ భక్తునిగా అగ్రస్తానం లో నిలిచాడు. తమ పరాక్రమంతో, యుద్ధనీతితో ముల్లోకాలని జయించి తన ఏలుబడికి తెచ్చుకున్నాడు. రావణుని గొప్పతనాన్ని చాటే ఎన్నో కథలు ప్రచుర్యంలో ఉన్నాయి.


         ఒక కథ ప్రకారం, రామ రావణ యుధ్ధానికి ముందు ఒక క్షత్రియుడిగా రాముడు చేయదలచిన క్రతువులు నిర్వహించుటకు కిష్కింధలో బ్రాహ్మణుడు దొరకని సమయంలో రావణుడు (తను బ్రాహ్మణుడు కావటంతో) తను స్వయంగా రాముడితో ఆ క్రతువులు నిర్వహింపచేసాడని అంటారు. 

         ఇంకొక కథ ప్రకారం రామ రావణ యుద్ధకాలంలో ఒక సారి లక్ష్మణుడు తనకు యుధ్ధ నీతిని నేర్పమని రాముని కోరుతాడు. అప్పుడూ రాముడు తనకంటే రావణాసురుడె అందుకు అర్హుడని అతని వద్దకి వెళ్ళి నేర్చుకోమని చెపుతాడు. అందుకు ఆశ్చర్య పడిన లక్ష్మణుడు శత్రువు వద్దకి వెళ్ళినచో చంపివేస్తాడనే అనుమానం వ్యక్తం చేస్తాడు. అందుకు రాముడు రావణుడు అటువంటివాడు కాదు అని నచ్చ చెప్పి పంపుతాడు. లంకకు చేరిన విద్యార్ధి ఐన లక్షణుడిని సకల మర్యాదలతో ఆహ్వానించి పూర్తిగా యుధ్ధనీతిని భోదించి వెనక్కి పంపుతాడని కథ. 

         ఇటువంటి కథలు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఐతే ఇవన్ని కట్టు కథలనీ, వాల్మీకి రామాయణం మాత్రమే నిజమైన కథ అని చాలా మంది వాదిస్తారు. నిజానిజాలు మనకి తెలియవు.

సీతాపహరణం:

         ఇంత గొప్ప భక్తుడు, మంత్రవేత్త, మహావీరుడైన రావణుడు సీతని దొంగతనంగా ఎత్తుకుపోవటం మనకి కొంత ఆశ్చర్యం గానే ఉంటుంది. ఐతే ఎలా ఎత్తుకుపోయాడు అనే విషయం పైన కూడా కొన్ని కథలు మనకి వినిపిస్తాయి.

         రావణుడు భిక్ష అడిగినప్పుడు సీత లక్షణుడు గీచిన గీటు దాటి భిక్ష వేయపోతుంది. అప్పుడు బ్రాహ్మణవేషంలో వచ్చిన రావణుడు తన నిజ స్వరూపం చూపిస్తాడు. అందుకు భయపడిన సీత అక్కడే మూర్చపోతుంది. అలా క్రిందపడిన సీతని రావణుడు తన పుష్పక విమానంలో తీసుకుని వెళ్తాడు.

  ఐతే, ఆ సమయంలో సీతను అతను తాక లేదనీ, ఆమె పడిఉన్న స్థలాన్ని భూమితో సహా పెకళించి తీసుకుని వెళ్ళాడని ఒక కథ. అందుకు కారణం లేకపోలేదు. ఒకానొక సమయంలో రావణుడు రంభను మోహించి బలవంతం చేయబోతాడు. అప్పుడు రంభ తనకు కుబేరుడి కొడుకుతో వివాహం నిశ్చయమైనందున తాను రావణుడికి కుమార్తె సమానురాలనని, కామకలాపాలకు సరికాదని చెపుతుంది. కానీ, రావణుడు వినకుండా బలవంతం చేయబోతాడు. దాంతో కోపించిన కుబేరుడి కొడుకు, ఇకముందు ఏ స్త్రీనైనా బలవంతపెడితే అతని పది తలలు రాలిపోతాయని శపిస్తాడు. ఈ శాపమే రావణుడి చెరలో ఉన్న కాలంలో సీతను కాపాడిందని చెప్పబడుతుంది.

         ఇంతకు చెప్పేది ఏమంటే అన్ని తెలిసిన రావణుడు తన పూర్వజన్మ రహస్యం తెలుసుకోలేక పోయాడా? సీత తన మృత్యుకారకురాలని తెలుసుకోలేకపోయాడా? లేక తెలిసే తొందరగా విష్ణు సాయిద్యం పొందటానికి ఆ విధంగా చేసాడా?

         నేను ఇంటరులో ఉండగా ఒక మంచి పుస్తకం చదివా. పుస్తకం పేరు, రచయిత ఎవరో సరిగా గుర్తులేదు. కాని, అందులో రావణపాత్ర చిత్రీకరణ చాల అద్భుతంగా చేసారు. కథ ప్రకారం రావణునికి తన జన్మ రహస్యం తెలుసు, సీత తన మృత్యు కారకురాలని తెలుసు. ఐనా, శాపవిమోచనం కోసమే అతను సీతను అపహరించినట్లు చూపించారు.

         ఈ విధంగా రావణాసురిని కథలు చాలానే ఉన్నాయి. చాలావరకు అవి అతని గొప్పతనాన్ని, శక్తినీ, భక్తిని సూచిస్తాయి. కానీ, ఇవన్ని రాముని గుణగణాల ముందు వెలవెల పోయాయి. సీతాపహరణం అనే చర్యతో మహానాయకుడు కావలసిన రావణుడు, ప్రతినాయకుడైపోయాడు. ఆ తప్పిదమే రావణుని మిగిలిన సద్గుణాలన్నిటిని కప్పివేసింది.

         ఇక కాసేపు రామాయణం ఒక కావ్యం కాకుండా ఒక నిజ సంఘటనగా తీసుకుంటే:

         పాశ్చాత్య చరిత్ర కారుల అభిప్రాయం ప్రకారం రామాయణం ఒక యదార్ధ సంఘటన అని, రామ రావణ యుధ్ధం పూర్వకాలం ఆర్యులకి, అప్పటి భరతఖండ వాసులైన రావణుడికి మధ్య జరిగిన యుద్ధంగా వర్ణిస్తున్నారు. దైత్యులు అనే వారే నిజమైన భరతఖండ వాసులనీ, ఆర్యులు తూర్పు దిక్కుగా ప్రవేశించి, అన్ని రాజ్యాలు జయిస్తూ వచ్చారని ఒక సిధ్ధాంతం. ఇప్పటికీ దక్షిణ దేశంలో ముఖ్యంగా తమిళనాడు కొన్ని ప్రాంతాలలో రావణ పూజ జరగటం వింటుంటాం. 

Thursday, October 13, 2011

పాపం వినాయకుడు

 వినాయక చవితి వచ్చింది వెళ్ళింది. ఐతే ఇప్పుడేం రాస్తావు అని మీరడగ వచ్చు. వస్తున్నా! అదే పాయింటుకి వస్తున్నా.

         ఇదివరకు, అంటే నా చిన్నప్పటి సంగతి, వినాయక చవితి అనగానే పొదున్నే లేచి తలంటి పోసుకుని, బజారు వెళ్ళి ఒక చిన్న వినాయకుడి బొమ్మ, మట్టి వినాయకుడిని, పత్రి తెచ్చి పూజ చేసుకునే వాళ్ళం. వినాయకుడి బొమ్మలు సాధారణంగా సింహాసనం మీద కూర్చున్నట్లో, కాస్త పెద్దవి ఐతే కొంచం పక్కగా ఒరిగి పడుకున్నట్లో ఉండేవి. చక్కగా తీర్చిన కళ్ళు, తొండము మీద చక్కని డిజైను పసుపు గాని ఎరుపుగాని రంగులో బట్టల తో ఉండేవి. ఇక మట్టి వినాయకుడి విషయానికి వస్తే పండుగనాడూ, విద్యానగార్ ఫస్ట్ లకీ దగ్గరో, శంకర మఠం దగ్గరికో వెళితే అప్పటికపుడు అచ్చులో బంకమన్ను తో బొమ్మ చేసి పైన పైన బంగారు రంగో లేకపోతే వెండి రంగో అద్ది ఇచ్చే వాళ్ళు.

         సార్వజనిక గణపతి పందిళ్ళు ఎక్కువ ఉండేవి కాదు అప్పట్లో. అలాగే చందాల వసూళ్ళు ఉండేవి కాదు. ఎక్కడో పెద్ద పెద్ద కూడళ్ళ దగ్గర మాత్రం పందిళ్ళువేసి వినాయ విగ్రహాలు పెట్టేవాళ్ళు. తొమ్మిది రోజులు పొదున్న సాయంకాలం పుజా చేసి ప్రసాదం పంచటం లాంటివి చేసేవాళ్ళు. చక్కటి భక్తి గీతాలతో రోజు అందరిని ఆకర్షించేవారు.

         మరి ఇప్పుడో? కాలంతో పాటు వినాయకుడిని కూడా మార్చేసారు మన వినాయకులు. గత కొద్దిరోజులుగా టి.వీ లో చూపిస్తున్న రకరకాల వినాయక విగ్రహాలని చూస్తుంటే నిజం గానే కోపం , దుఃఖం , వెగటు , అసహ్యం ఇంక అన్నిరకాల భావాలు భక్తి భావం తప్ప కలిగాయి. 



ఉదాహరణకి ఒక పండల్ లో వినాయకుడికి సైఫ్ అలీ ఖాన్ వేషం వేశారు. వినాయకుడు సూటు వేసుకుని, గాగుల్స్ పెట్టుకొని గిటారు వాయిస్తునట్టు పెట్టారు. ఆఖరికి జుట్టుకూడా లేటెష్టు గా జూలపాలు పెట్టారు.

         ఇంకో చోట వినాయకుడికి రైతన్న వేషం వేశారు. తలకి పాగా చుట్టుకుని, ఎద్దు బండి తోలుతున్నట్టు అలంకరించారు. మోటారుతో బండి ముందుకి వెళ్తున్నట్టు, వినాయకుడీ చెయ్యి కదులుతూ బండినడుపుతున్నట్టు.

         ఇలా చెప్పుకుంటు పోతే అంతే లేదు. ఏదో బొమ్మ పెట్టాలి అని పెట్టటమే తప్పా ఎలాంటి బొమ్మ పెడుతున్నాము అని ఆలోచించటమే లేదు. పూజలు కూడా అంతే. మైకులో చదవటమే ముఖ్యం కానీ సరైన మంత్రాలు చదువుతున్నారాలేదా అని ఎవ్వరు చూడటంలేదు. సార్వజనిక గణపతి ఉత్సవాలు వ్యాపార కేంద్రాలే తప్ప ఇంకోటి కాదు.

         ఇలాంటి సంస్క్సృతి మన తరవాతి తరాలకి అందిస్తే కొన్ని ఏళ్ళలో వినాయకుని అసలు రూపమే మన మనవలకి, ముని మనవలకి తెలియక పోవచ్చు.

         వినాయకా నీవైనా వీళ్ళ కళ్ళు తెరిపించు.

Monday, October 10, 2011

రుద్రాక్షలు

 మన హిందువులలో "రుద్రాక్ష" పేరు విననివారుండరు అంటే అతిశయోక్తి కాదేమో. ఐతే ఈ రుద్రాక్షలు ఏమిటి? వాటి ప్రాముఖ్యత ఏమీటి అనే విషయాలు ఈ కాలంలో చాలా మందికి తెలియదు.

        రుద్రాక్ష వృక్షం ప్రపంచంలోని ప్రాచీన వృక్షాలలో ఒకటి. ఈ వృక్ష సాంకేతిక నామం (scientific name) Elaeocarpus Granitrus. రుద్రాక్ష వృక్షం భారతదేశంలో దిగువ హిమాలయాలలో, నేపాల్ లో మరియూ ఇండోనేషియాలో విరివిగా పెరుగుతాయి. ఈ వృక్షం పెరిగి పుష్పించి ఫలించటానికి కనీసం 15 నుండి 16 సంవత్సరాలు పడుతుంది.

        పురాణ కథ:

        "రుద్రాక్ష" అనే పదం రుద్ర + అక్ష అనే రెండు పదాల కలయిక వలన ఏర్పడింది. రుద్రాక్ష అనగా రుద్రుని అశ్రువులు (కన్నీటి బొట్లు) అని అర్ధం. రుద్రాక్షల గురించి వాటి ఉపయోగాల గురించి శివపురాణం, దేవీ పురాణం, పద్మ పురాణం, మరియు రుద్రాక్ష జబలోపనిషత్ లలో వివరంగా చర్చింపబడింది.

        శివపురాణం ప్రకారం రుద్రాక్ష పుట్టుక ఇలా ఉంది.

        రాక్షసరాజైన త్రిపురాసురుడు వరబలం వలన అత్యంత శక్తివంతుడై, దేవతలకు కంటకుడిగా మారాడు. దేవతలంతా పరమ శివుని వద్దకు వచ్చి తమ బాధలు మొరపెట్టుకున్నారు. అప్పుడు శివుడూ త్రిపురాసుర సంహారం కోసం అత్యంత శక్తిమంతమైన ' అఘోరాస్త్రం ' తయారుచేయదలచి సమాధిలోకి వెళ్ళిపోయాడు. అలా సమాధిలోకి వెళ్ళిన పరమశివుడు చాలా కాలం తరువాత కళ్ళు తెరచినప్పుడు శివుని కన్నుల నుండి కొన్ని ఆశ్రు బిందువులు భూమి మీద పడ్డాయి. ఆ అశ్రువులే విత్తనాలుగా మారి వాటి నుండి రుద్రాక్ష వృక్షాలు పుట్టాయి. రుద్రాక్ష చెట్టు నుండి వచ్చే ఫలాలలో ఉండె బీజములే మనం రుద్రాక్షలని అంటాము.

        పరమశివుని త్రినేత్రములు సూర్య, చంద్ర, అగ్ని రుఫాలు. అందులో సూర్యనేత్రం నుండి పుట్టిన రుద్రాక్షలు గోధుమరంగులో (Brown) ఉంటాయి. ఇవి పన్నెండు రకాలు. చంద్రనేత్రం నుండి పుట్టిన రుద్రాక్షలు లేత ఎరుపురంగులో ఉంటాయి. ఇవి మొత్తం 16 రకాలు. అగ్ని నేత్రం నుండి పుట్టిన రుద్రాక్షలు నల్లగా ఉంటాయి. ఇవి మొత్తం 10 రకాలు. సూర్యనేత్రం నుండిపుట్టిన గోధుమరంగు రుద్రాక్షలను లేత గోధుమరంగు రుద్రాక్షలు, ముదురు గోధుమరంగు రుద్రాక్షలు గా విభజించ వచ్చు. అన్ని రకాల రుద్రాక్షలు కలిపి మొత్తం ముప్పైఎనిమిది రకాల రుద్రాక్షలు మనకు దొరుకుతున్నాయి. 



ఎవరైతే 108 రుద్రాక్షలను ధరిస్తారో వారికి అశ్వమేధయాగం చేసిన ఫలితం వస్తుందని, వారి 21 తరాలవారు శివలోక సాయుజ్యం పొందుతారని, ఎవరైతే 1100 రుద్రాక్షలని ధరించినా, 555 రుద్రాక్షలను కిరీటంలా ధరించినా, 320 రుద్రాక్షలను జంధ్యంగా మూడు వరుసలో ధరించినా వారు పరమశివునితో సమానమని పురాణాలు చెప్తున్నాయి.

        రుద్రాక్షలు - రకాలు


        ముందుగా చెప్పినట్టు మనకు మొత్తం 38 రకాల రుద్రాక్షలు దొరుకుతున్నాయి. రుద్రాక్షల విలువ వాటీ ప్రమాణాన్ని బట్టి ఉంటుంది. మినుము గింజప్రమాణం గల రుద్రాక్షలకు చాలా రోగనిరోధక శక్తులున్నాయని, ఆధ్యాత్మిక చింతనకు శ్రేష్ఠమైనవని శాస్త్రం. భారతదేశంలో దిగువ హిమాలయాలలో లభించే రుద్రాక్షలు పరిమాణంలో చిన్నవి. నేపాల్ లో లభించే రుద్రాక్షలు పెద్దవిగా ఉంటాయి.

        "పత్రి" అనే రుద్రాక్ష చదునుగా ఉండే ఒక విషేషమైన రుద్రాక్ష. ఈ రుద్రాక్ష ప్రస్తుతం అంత విరివిగ లభించటంలేదు.

        ప్రత్యేకమైన రుద్రాక్షలలో చెప్పుకోదగినవి "గణేష రుద్రాక్ష""గౌరీ-శంకర రుద్రాక్ష".


 



వివిధ రుద్రాక్షలను వాటి ' ముఖాల ' ద్వారా గుర్తించవచ్చు. ఒక రుద్రాక్ష ఎన్ని ముఖాలదో తెలుకోవాటానికి సులభమైన మార్గం ఏమిటంటే ! ఆ రుద్రాక్షమీద ఎన్ని గీతలున్నాయో అది అన్ని ముఖాల రుద్రాక్ష.


        పురాణాలు వివిధ రుద్రాక్షలను వివిధ దేవతలతో పోల్చారు. అందరికి సులభంగా ఉండటానికి ఈ క్రింది పట్టికలో పొందుపరుస్తున్నాను.

ముఖాలు
        
దేవత
        
సంబంధిత గ్రహం
        
సంభందిత మంత్రం
ముఖిశివుడు / సూర్యుడుసూర్యుడుఓం హ్రీం నమః
ముఖిఅర్ధనారీశ్వరుడుచంద్రుడుఓం నమః
ముఖిఅగ్నికుజుడుఓం క్లీం నమః
ముఖిబ్రహ్మబుధుడుఓం హ్రీం నమః
ముఖికాలాగ్ని రుద్రగురుడుఓం హ్రీం నమః
ముఖికార్తికేయుడుశుక్రుడుఓం హ్రీం హూం నమః
ముఖిఅనంగశనిఓం హూం నమః
ముఖిగణేషరాహుఓం హూం నమః
ముఖిభైరవుడుకేతుఓం హ్రీం హూం నమః
10 ముఖివిష్ణుమూర్తిబుధుడుఓం హ్రీం నమః
11 ముఖిఏకాదశ రుద్రులుకుజుడు/గురుడుఓం హ్రీం హూం నమః
12 ముఖిఆదిత్యుడుసూర్య్డుఓం క్రీంశ్రూమ్రూం నమః
13 ముఖికార్తికేయుడుకుజుడుఓం హ్రీం నమః
14 ముఖిశివుడు / హనుమంతుడుశనిఓం నమః
21 ముఖికుబేరుడు----


 జన్మ నక్షత్రం - సరిపడే రుద్రాక్షలు


        జన్మపత్రిక ననుసరించి ఆయా జన్మ నక్షత్రకులకు సంబంధిత రుద్రాక్షలను ధరించటంవలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ దిగువన జన్మనక్షత్ర పరంగా ధరించవలసిన రుద్రాక్షలు ఇవ్వబడినాయి.


జన్మ నక్షత్రం        రాశి అధిపతి        ధరించవలసిన రుద్రాక్ష
అశ్వనికేతుముఖి
భరణికుజుడుముఖి మరియు 11 ముఖి
కృత్తికరవిముఖి మరియు 12 ముఖి
రోహిణిచంద్రుడుముఖి
మృగశిరకుజుడుముఖి మరియు 11 ముఖి
ఆరుద్రరాహుముఖి
పునర్వసుగురుడుముఖి
పుష్యమిశని14 ముఖి
ఆస్లెషబుధుడుముఖి
మఖకేతుముఖి
పూర్వ ఫాల్గుణిశుక్రుడుముఖి మరియు 9 ముఖి
ఉత్తర ఫాల్గుణిరవిముఖి మరియు 12 ముఖి
హస్తచంద్రుడుముఖి
చిత్రకుజుడుముఖి మరియు 11 ముఖి
స్వాతిరాహుముఖి
విశాఖగురుడుముఖి
అనురాధశని14 ముఖి
జ్యేష్ఠబుధుడుముఖి
మూలాకేతుముఖి
పూర్వాషాఢశుక్రుడుముఖి మరియు 9 ముఖి
ఉత్తరాషాఢరవిముఖి మరియు 12 ముఖి
శ్రావణచంద్రుడుముఖి
ధనిష్టకుజుడుముఖి మరియు 11 ముఖి
శతభిషరాహుముఖి
పూర్వాభాద్రగురుడుముఖి
ఉత్తరాభాద్రశని14 ముఖి
రేవతిబుధుడుముఖి


రుద్రాక్ష ధారణవలన కలిగే సత్ఫలితాలు


        పురాణాల ననుసరించి వివిధ ముఖాల రుద్రాక్షలు ధరించటంవలన కలిగే ఫలితాలు క్రింద ఇవ్వబడ్డాయి. గమనించవలసింది ఏమిటంటే రుద్రాక్షలు ధరించటం వలన ఎటువంటి చెడు ఫలితాలు ఉండవు.


ముఖాలు
ఫలితాలు
ముఖిసర్వతోముఖ అభివృద్ధిఅన్ని పాపాలను హరించి అన్ని కోరికలను సిద్ధింపచేస్తుంది.
ముఖిసౌభాగ్య ప్రదాయనిసర్వపాపహారిణి రుద్రాక్ష ఏకత్వాన్ని సూచిస్తుందిదుష్ట ఆలోచనలుఅదుపుచేస్తుందివైవాహిక సంబంధాలను మెరుగు పరుస్తుంది.
ముఖిసకల సౌభాగ్య దాయనితరచుగా వచ్చే జ్వరం వంటి వ్యాదులనుండి ఉపశమనం
ముఖిధర్మార్ధ కామ మోక్ష ప్రదాయనిమానవుడు హత్య ద్వారా చేసిన పాపాన్ని హరిస్తుంది.జ్ఞాపకశక్తి నితెలివితేటలను పెంపొందిస్తుందినరాలకు సంబంధించిన వ్యాధులకు మంచిది
ముఖికోపాన్ని అదుపుచేసి మనసుకు శాంతిని కలగ చేస్తుందిరక్తపోటుచెక్కెర వ్యాధిపంటినొప్పులు మూల వంటి వ్యాదులను నివారిస్తుంది.
మిఖికుడి చేతికి కట్టుకుంటే Low BP తగ్గుతుందిబ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి
ముఖిధన మరియు అభివృద్ధిని ప్రసాదిస్తుంది
ముఖిప్రమాదాల నుండిఆపదల నుండి రక్షణ
ముఖివివాహ సంబంధిత సమస్యల నుండి విముక్తిఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తుంది
10 ముఖినరాలకు సంబంధించిన వ్యాధులకుజ్ఞాపకశక్తికి సంబంధించిన వ్యాధులకు పనిచేస్తుంది
11 ముఖిసంతాన ఆరోగ్య సమస్యలకు మంచిది
12 ముఖిరక్తహృదయ సంబంధిత వ్యాధులకు మంచిదిధైర్యాన్ని పెంచి శత్రువుల నుండి రక్షణకలిగిస్తుంది
13 ముఖిఅభివృద్ధిఆత్మవిశ్వాసం పెంపొందిస్తుంది
14 ముఖిశని సంబంధిత సమస్యలకు మంచిది.

Saturday, October 8, 2011

వేదములు - కొన్ని విషయాలు




         హిందూ పవిత్ర గ్రంథాలలో వేదములు ప్రముఖమైనవి. వీటినే "శ్రుతులు", "ప్రభు సంహితలు"అనికూడా అంటారు. శ్రుతి అనగా విన్నది అని అర్థం. ఇవి భగవంతుని ద్వారా తెలియ చేయబడినవి అని హిందువుల నమ్మకం. వేదం అనే పదం సంస్కృత పదం 'విద్' (తెలుసుకొనుట) నుంచి పుట్టింది. హిందువుల నమ్మకం ప్రకారం వేదములు సృష్టి కి ముందునుండే ఉండి, కాల క్రమేణా మహర్షులకు వారి ధ్యాన, తపోబలముల వలన ప్రకటించపడ్డాయి.

         ప్రతి వేద మంత్రమునకు ఒక అధిష్టాన దేవత ఉండి, ఆ మంత్రము ఆయనకు అంకితం చేయబడి ఉంటుంది.

         వేదములను వ్యాస మహాముని నాలుగు భాగాలుగా విభజించారు. ఒక నమ్మకం ప్రకారం ప్రతి ద్వాపరయుగాంతం లో ఈ విభజన జరుగుతుంది. ఇప్పటికి ఈ విభజన 27 సార్లు జరిగి ఉండవచ్చని అంచనా.

         మనకి ఉన్న వేదములు నాలుగు. వాటిని గురించి క్లుప్తంగా చర్చిద్దాం....


1. ఋగ్వేదం :


         ఈ వేదం అన్ని వేదాలలోనికి ప్రాచీనమైనదిగా భావిస్తారు. ఈ వేదం మొట్టమొదటిసారిగా పైల మహర్షికి ప్రకటింప బడింది. అగ్ని దేవుడికి అంకితం చేయబడిన ఈ వేదానికి అధిష్టానదేవత గురువు (Jupiter). ఈ వేదం మొత్తం 10 మండలాలుగా (Books) విభజించబడి, 1028 సూక్తములతో (Hymns) 10,552 మంత్రాలతో అలరారుతూ ఉంది.


         ఈ వేదం మొదటిలో 21 శాఖలుగా విస్తరించి ఉండేది. కాని, ఇప్పుడు 5 శాఖలు మాత్రమే దొరుకుతున్నాయి. దేవతా సూక్తాలు, ఆత్మ సంబంధిత సూక్తాలు, సామాన్య జీవన విధాన సూక్తాలు ఇందులో పొందు పరచ బడ్డాయి.
         ఇందులోనే 'ఐతిరేయ' మరియు 'కౌషితక' ఉపనిషత్తులు ప్రస్తావించ బడ్డాయి.



2. యజుర్వేదం :


         వైశంపాయన మునికి మొదటి సారిగా ప్రకటించబడ్డ ఈ వేదం వాయు దేవునికి అంకితం చేయబడింది. అధిష్టాన దేవత శుక్రుడు (Venus). ఈ వేదం 40 స్కంధాలుగా (Parts) విభజించబడి, 1975 శ్లోకాలతో అలరారుతుంది.


         ఈ వేదాన్ని 'శుక్ల' యజుర్వేదం అని, 'కృష్ణ' యజుర్వేదం అని రెండు భాగాలుగా విభజించారు. వీటిలో శుక్ల యజుర్వేదం ప్రాచీనమైనది. కృష్ణ యజుర్వేదం యఙ్ఞవల్క్య మునికి ప్రకటించబడినది.


         యజుర్వేదం మొదట 102 శాఖలుగా ( 85 కృష్ణ, 17 శుక్ల) విస్తరించినప్పటికి, ప్రస్తుతానికి 4 కృష్ణ యజుర్వేద శాఖలు, రెండు శుక్ల యజుర్వేద శాఖలు మాత్రమే మనకు మిగిలాయి. ఈ వేదం ముఖ్యం గా సాంప్రదాయ పద్ధతులు, పూజా విధానాలు, బలి మొదలైన వాటిని వివరిస్తుంది.


         కృష్ణ యజుర్వేదంలో 'తైతిరీయ ', 'కథా' ఉపనిషత్తులు ఉండగా శుక్ల యజుర్వేదంలో 'ఈషా', 'బృహదారణ్యక' ఉపనిషత్తులున్నాయి.


3. సామవేదం :


         ఈ వేదం మొట్టమొదటి సారిగా జైమిని మునికి ప్రకటించ బడింది. ఈ వేదానికి అధిష్టాన దేవత అంగారకుడు (Mars). ఈ వేదం ఆదిత్యునికి (Sun) అంకితం చేయబడింది.


         ఈ వేదం రెండుభాగాలుగా విభజించబడింది.
A). పూర్వార్సిక : 4 స్కంధములలో 585 మంత్రములు కలిగి ఉంది.
B). ఉత్తరార్సిక: 21 స్కంధములలో 964 మంత్రములను కలిగి ఉంది.
         మొత్తం 1564 మంత్రాలలో 75 మంత్రాలు ఋగ్వేదం నుంచి గ్రహించ బడ్డాయి.
         మొదటిలో 1000 శాఖలుగా విస్తరించిన ప్రస్తుతానికి మూడు శాఖలు మాత్రమే నిలిచి ఉన్నాయి. దైవ ప్రార్థనలు, సంగీతం, శాంతి ప్రార్థనలు ఈ వేదంలో మనకు కనపడే విశేషాలు.



4. అధర్వ వేదం


         ఈ వేదం మొదటి సారిగా సుమంతు మహామునికి ప్రకటించదడినది. ఆదిత్యునికి అంకితమైన ఈ వేదానికి బుధుడు అధిష్టాన దేవత.


         ఈ వేదం రెండుభాగాలుగా విభజించ బడినది.
A). పూర్వార్ధ: అనేక విషయాలపై చర్చ.
B). ఉత్తరార్ధ: వివిధ ఆచారాలపై కూలంకష చర్చ.
         అధర్వ వేదం నాలుగు భాగాలుగా విభజించబడి 20 స్కంధములతో 6,077 మంత్రములతో అలరారుతున్నది.
         మొదట తొమ్మిది శాఖలలో ఉన్న ఈ వేదంలో ప్రస్తుతం 2 శాఖలు మాత్రమే లభ్యమవుతున్నాయి.
         ఈ వేదంలో దైవ ప్రార్థనలతో పాటు సృష్టి పరిణామం గురించిన కథలు, భూతపిశాచ, దుష్ట శక్తులను నివారించటానికి మంత్రాలు, మంత్రవిద్య, తంత్ర విద్య లకు సంబంధించిన విషయాలు కూడా పొందుపరిచారు.
         ఇందులో 93 ఉపనిషత్తులు పొందు పరిచి ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి 'ప్రశ్న', 'మాండూక',మరియు 'మాండుక్య' ఉపనిషత్తులు.



***        ***        ***
   ప్రతి వేదాన్ని మూడు భాగాలుగా విభజించ వచ్చు.

         1. మంత్ర సంహితలు: ఇహలోక పరలోక లభ్ధికోసం వివిధ దేవతల గురించిన ప్రార్థనలు ఉన్న భాగం.
          2. బ్రాహ్మణములు: వివిధ ఆచారాలు వాటిని పాటించేవిధాలని గురించి వివరించే భాగం.
          3. అరణ్యకాలు: ఆచారాలకు తాత్విక (Philosophical) వివరణ.
          4. ఉపనిషత్తులు: వీటినే వేదాంతాలు అనికూడా అంటారు. ఇవి వేదాలలోని సారాంశాన్ని వివరిస్తాయి.

         మొత్తం వేద విజ్ఞానాన్ని ఒక మహావృక్షంగా భావిస్తే బ్రాహ్మణాలు ఆ చెట్టు పూలుగా, అరణ్యకాలు పచ్చి కాయలుగా, ఉపనిషత్తులని పండ్లుగా వర్ణించ వచ్చు.
          ఊపవేదములు: వేదాల వెలె కాకుండా ఉపవేదములు మహామునులచే లిఖించబడినవి. వీటినే"స్మృతులు" అనికూడా అంటారు. ఇవి వేదాల వలనే మొత్తం నాలుగు.

         1. ఆయుర్వేదం: ఋగ్ వేదానికి సంబంధించిన ఇది ఆరోగ్యాంగా జీవించటానికి పాటించవలసిన విధులని తెలిపే శాస్త్రం.
                 A) చరక సంహిత: మహాముని చరకునిచే రచించబడిన గ్రంథం.
                 B) శుశ్రుత సంహిత: మహాముని శుశ్రుతుని రచన.
                 C) వాగ్భట్ట సంహిత: మహాముని వాగ్భట్టుని రచన.
  
               D) కామ సూత్రములు: మహాముని వాత్సాయనుని రచన.
          2. ధనుర్వేదం: యజుర్వేదానికి సంబంధించిన ఈ ఉపవేదం బ్రహ్మర్షి విశ్వామిత్రునిచే రచించబడినది. ఇది ముఖ్యంగా సైన్య (Military) శాస్త్రానికి సంబంధించినది. మొత్తం నాలుగు భాగాలలో ఈ శాస్త్రం యుద్దానికి సంబంధించిన అన్ని విషయాలని చర్చిస్తుంది. ఇందులోనే వివిధ మారణాయుధాలు, మంత్ర యుద్ధ పద్ధతులు యుద్ధ వ్యూహాల గురించి విపులం గా చర్చించబడింది.

       3. గంధర్వ వేదం: సామవేదానికి సంబంధించిన ఈ ఉపవేదం ముఖ్యంగా కళలకు, సంగీతానికి సంబంధించిన శాస్త్రం. భరత మహాముని రచించిన గంధర్వ శాస్త్రం ఈ కోవలోనికి వస్తుంది.
          4. అర్థశాస్త్రం: రాజకీయ మరియు అర్థశాస్త్రం. ఇందులో నీతిశాస్త్రం, శిల్పశాస్త్రం, అరవైనాలుగు కళలు, ఇంకా అనేక భౌతిక , ప్రాపంచిక విషయాలను కులంకుషంగా చర్చించారు.


వేదాంగములు:


         ఆనవాయతి ప్రకారం వేదాభ్యాసానికి ముందుగా ఈ వేదాంగములని నేర్చుకోవాలి. వేదాంగములు మొత్తం ఆరు.


         1. శిక్ష (Phonetics): పాణిని రచించిన శిక్ష.
         2. వ్యాకరణము (Grammer): పాణిని రచించిన వ్యాకరణము, పతంజలి రచించిన మహాభాష్యము. ఇది పాణిని వ్యాకరణానికి వివరణ.
         3. ఛందస్సు: పింగళాచార్యుల ఛందస్సు.
         4. నిరుక్త (EtymOlogy): యక్షుని నిరుక్త.
         5. జ్యోతీష: ఖగోళ మరియు జాతక శాస్త్రము, గార్గి ముని రచించిన జ్యోతిష గ్రంథము, ఇంకా చాలా గ్రంథములే ఉన్నాయి. భారతీయులు ఖగోళ శాస్త్రంలో వేద కాలంలోనే చాలా ప్రగతి సాధించిన విషయం జగమెరిగిన సత్యం.
         6. కల్ప: ఆచార సంప్రదాయ పద్ధతుల గురించిన శాస్త్రం. ఇందులో మూడు భాగాలున్నాయి.
                I) శుశ్రుత కల్ప: భగవంతునికి ఇచ్చే బలి, నైవేద్య పద్దతులు.
                II) శులభ కల్ప: కొలతలు మొదలైన విషయాలను తెలిపే కల్పము.
                III) ధర్మ కల్ప: నీతి , ధర్మ విషయాలకు సంబంధించినది. ధర్మ కల్పంలో మొత్తం 18 విభాగాలున్నాయి. వాటిలో ప్రముఖమైనవి మూడు.
                         1. మను స్మృతి: ఈ ధర్మసూత్రాలు త్రేతాయుగానికై నిర్దేశించబడినవి.
                         2. యాఙ్ఞవల్క్య స్మృతి: త్రేతా యుగానికై నిర్దేశించబదినది.
                         3. పరాశర స్మృతి: కలియుగానికై నిర్దేశించబడినది.




Wednesday, October 5, 2011

నౌకా చరిత్ర

   సంగీత త్రిమూర్తులలో ఒకరైన శ్రీ త్యాగరాజ భాగవతార్ రచించిన ' నౌకా చరిత్ర ' అనే గేయ ప్రభందము అత్యంత భక్తి, శృంగార, కరుణ రస పూరితము.

         గోపికలందరు శ్రీ కృష్ణునితో కలిసి నౌకా విహారనికి యమునా నది కి బయలుదేరుతారు.

         " శృంగారించుకొని వెడలిరి శ్రీ కృష్ణునితోను " అనే కీర్తనలో గోపికలు ఎలా అలంకరించుకుని బయలుదేరారో మనకు కళ్ళకి కట్టినట్టుగా వర్ణించారు.


నవ్వుచు గులుకుచు నొకతె
కొప్పున బువ్వులు ముడుచుచు నొకతె
దువ్వుచు గురులను నొకతె
కృష్ణుని రవ్వ చేయుచును నొకతె
మగడు వీడనుచును నొకతె
రవికయు బిగువున జేర్చుచు నొకతే
సొక్కుచు సోలుచు నొకతే
కృష్ణుని గ్రక్కున ముద్దిడు నొకతె
 
         ఇలా ఒక్కక్క గోపిక ఒకో రకం గా శ్రీ క్రిష్ణుడి పై తమ మమకారం అనురాగం తెలిసేట్టుగా అలంకరించుకొని బయలుదేరారు.


         యమునా నదితీరం మొనోహరం గా ఉంది. అందు మొట్టమొదట ఎఱ్ఱని పద్మములు, వాటి మీద వ్రాలే తుమ్మెదల నాదాలు, తెల్లటి ఇసుక తిన్నెలు, అనేక ఫల వృక్షములు, ఆ వృక్షములని చేరిన పక్షుల కిల కిలారవములు, ప్రక్కన మనోహరుడైన శ్రీ కృష్ణుడు. (చూడరే చెలులార యమునాదేవి, పంతువరాళి-ఆది).

         ఇక గోపికల ఆనందానికి అంతేముంటుంది? గోపకాంతలు మితి మీరిన యుత్సాహం తో ఆ యమునా తీరాన విహారాలు చేస్తూ, తమ యవ్వన గర్వమున మోహము చెంది తమ ఆనందాన్ని ఒకరితో ఒకరు వర్ణించుకున్నారు. (ఏనోము నోచితిమో చెలుల-పున్నగ వరాళి-రూపకం).

         శ్రీ కృష్ణుడి చిన్నపటినుంచి చేసిన చేష్టలన్ని ఏకరువుపెట్టారు. నువ్వు దుడుకు వాడివి, మా చీరలు దోచావు, బొట్టు పెట్టె నెపం తో దగ్గరకు పిలిచి పంటితో నొక్కవు, ఇలాంటి చేష్టలు చేసిన వాడివి నున్ను ఎలా నమ్ముతాము అని నిలదీసి అడిగారు. (ఏమని నెఱ నమ్ముకొందుము-సౌరాస్ట్రము-చాపు).

         శ్రీ కృష్ణుడు తక్కువ తిన్నాడా? వారికి తగిన సమాధానం ఇచ్చాడు. పూర్వము మందర పర్వతాన్ని ఎత్తిన విషయం, గజేంద్ర రక్షణ, వేద రక్షణ, కాళియ మర్ధన గుర్తు చేసాడు. (ఏమోమో తెలియక బలికేరు-సౌరాష్ట్రము-చాపు). వారి సౌందర్య వర్ణన కావించి, అభినందించాడు. గోపికలు శ్రీ కృష్ణుని ఇంకా ఆట పట్టించారు.

         అందరూ నౌక పైన బయలుదేరారు. ఆ దృశ్యం మనోహరం గా ఉంది.
గోపికలు కృష్ణుడి తో కలసి నౌకలో ఆనందిస్తున్నారు. కొంతమంది శ్రీ కృష్ణుని తమకు నచ్చినట్టుగా అలకరిస్తున్నారు .

         కస్తూరి తిలకం దిద్దేవాళ్ళు, చేలము కట్టె వారు, హారతులిచే వాళ్ళు, కొందరైతే పూజలు చేసేవారు మరికొందరు (గంధము పూయరుగా -పున్నాగ వరాళి).

         శ్రీ కృష్ణుడు గోపికల అందాన్ని పొగిడాడు. అభినందించాడు. వారితో సరస సల్లాపాలాడాడు. గోపికలు ఆమాటలకి కృష్ణుడి ఆట పట్టించారు. 



         " చాలు చాలు నీ యుక్తులు సారసాక్ష శ్రీకృష్ణా " (సావేరి-ఆది) 


 నీ కుటిల యుక్తులు తమ వద్ద సాగ వన్నారు. దేవతలకి కూడ అందని అందం తమది, ఆనందించమన్నారు. నౌక సాగిపోతొంది. గోపాలుడు అక్కడ ఉన్న ప్రతి గోపికకి ఆమెకి కావలన విధం గా కనిపిస్తున్నాడు. ఒకరి విషయం ఇంకొకరికి తెలియకుండ మసలుకుంటున్నాడు.

         ఈలోగా వారి నావకి రంధ్రం పడీంది. నీరు నావలోకి ప్రవహించటం మొదలయింది. గోపికలందరు భయపడి శ్రీ కృష్ణుని చేరారు. తమని ఎలా ఐనా కాపాడమని మొరపెట్టుకున్నారు. శ్రీ కృష్ణుడు వారి రవికలను తీసి రంధ్రం పూడ్చమని సలహా ఇచ్చాడు. గోపికలకు వేరే దారిలేక అలాగే చేసారు, కాని ప్రవాహ వేగం వల్ల అవికూడా కొట్టుకుపోయాయి.

         అప్పుడు శ్రీకృష్ణుడూ వారి చీరలతో రంధ్రం పూడ్చమన్నాడు. గోపికలకు ఆగ్రహం వచింది. మాగురించి ఏమనుకున్నావు? మాకు ప్రాణం కంటె మానమే ముఖ్యం అని ఎదురు తిరిగారు. తనపై నమ్మకం ఉంటె తను చెప్పిన విధంగా చెయ్యమని, లేకపోతే మరణమే అని కృష్ణుడు చెప్పటం వలన చివరకు గోపికలు తమ చీరలతో రంధ్రాన్ని మూసి తీరం చేరుతారు.

         ఇది క్లుప్తంగా నౌకా చరిత్ర. ఇందులో ఒక్కొక్క కీర్తనలో భక్తి భావం ఉట్టిపడుతుంది. ఈ ప్రభంధ అంతరార్ధం ఆలోచిస్తే బ్రతుకు అనే ఈ నౌకని కష్టాలలో, సుఖాలలో , అన్ని వేళలా దాటటానికి భగవంతుడు తోడు ఉండాలి. భగవంతుని నమ్మిన వాడు, ఈ సంసారం అనే సముద్రాన్ని జీవితం అనే నౌకతో చాలా సునాయాసం గా దాటగలడు అని అనిపిస్తుంది.