Monday, November 21, 2011

కల్యాణ ప్రదమైన కల్యాణి రాగం


కర్నాటక సంగీతంలో ప్రసిద్ధరాగాలలో కల్యాణి రాగం ఒకటి. ఈ రాగం 65వ మేళకర్త ప్రతిమధ్యమ రాగం.సంపూర్ణ రాగం. కటపయాది సూత్ర ప్రకారం 11వ చక్రమైన ఆదిత్య చక్రంలో 5వరాగం, మేచకల్యాణి గా వ్యవహరిస్తారు. శుద్ధమధ్యమ రాగాల్లో శంకరాభరణం ఈ రాగానికి సమానం. అంటే ప్రతిమధ్యం బదులు శుద్ధమధ్యమం వాడితే శంకరాభరణరాగం అవుతుంది. ఈ రాగం హిందుస్థానీ సంగీతంలో యమన్ గా ప్రసిద్ధి చెందింది.
ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు ఈ ప్రకారంగా ఉంటాయి.


సడ్జమము(స), చతుశ్రుతి రిషభము(చ.రి), అంతర గాంధారం(అం.గా), ప్రతి మధ్యమం(ప్ర.మ), పంచమం(ప),చతుశ్రుతి ధైవతం(చ.ధై), కాకలి నిషాదం(కా.ని).


దక్షిణ భారతదేశంలో పెళ్ళిళ్ళు మెదలైన శుభకార్యాలలో ఈ రాగం చాలా తరచుగా వినిపిస్తుంది.  కల్యాణప్రదమైన ఈ రాగంలో అందరు వాగ్గేయకారులు రచనలు చేసారు. వాటిలోకొన్ని:


1. వనాజాక్షీరో - అట తాళ వర్ణం - పల్లవి గోపాల అయ్యార్
2. నిధిచాలా సుఖమా - త్యాగరాజు
3. ఏ తావునరా నిలకడ నీకు -త్యాగరాజు
4. సుందరినీ దివ్య రూపమును చూడ - త్యాగరాజు
5. అమ్మ రావమ్మ తులసమ్మ - త్యాగరాజు
6. వాసుదేవయని వెడలిన - త్యాగరాజు
7. కమలాంబాం భజరే - ముత్తుస్వామి దీక్షితార్
8. హిమాద్రి సుతే పాహిమాం - శ్యామశాస్త్రి


ఇలాంటి ఎన్నో ప్రసిద్ధ రచనలు వాగ్గేయకారులచే చేయబడ్డాయి. 


కర్నాటక సంగీతంలోనే కాక చలన చిత్రసంగీతంలో కూడా ఈ రాగాం చాలా ప్రసిద్ధి కెక్కింది. ఇళయరాజా గారు ఈ రాగంలో ఎన్నో తమిళ పాటలకు సంగీతం కూర్చారు. హింది చలన చిత్రాలలో కూడా ఈ రాగలోని పాటలు అత్యంత ప్రసిద్ధి చందాయి. వాటిలో కొన్ని:


1. మన్ రే, తుకాహె న ధీర్ ధరే - చిత్రలేఖ
2. జిందగీ భర్ నహీ భూలేగి బర్సాత్ కి రాత్ - బర్సాత్ కి రాత్
3. ఆసూ భరీ హై  యే జీవన్ కి రాహే - పర్వరిష్


ఇక తెలుగులో ఈ రాగంలో అత్యంత జనరంజకమైన పాటలు ఉన్నాయి: వాటిలో కొన్ని:


1. మనసున మల్లెల మాలలూగెనే (మల్లీశ్వరి)(ఇక్కడ వినండి)
2. సావిరహే తవదీనా రాధ (విప్రనారాయణ) (ఇక్కడ వినండి)
3. జగమే మారినది మధురముగా ఈ వేళ (దేశద్రోహులు) (ఇక్కడ వినండి)
4. మది శారదా దేవి మందిరమే (జయభేరి) (క్కడ వినండి)
5. తోటలో నారాజు (ఏకవీర) (ఇక్కడ వినండి)
6. సలలిత రాగ సుధా రస సారం (నర్తనశాల) (ఇక్కడ వినండి)
7. ఎప్పటి వలే కాదురా నా స్వామి (అభిమానవంతుడు) 
8. జోరుమీదున్నావు తుమ్మెదా (శివరంజని) (ఇక్కడ వినండి)
9. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ (దేవదాసు) (ఇక్కడ వినండి)
10. చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో (సంతానం) (ఇక్కడ వినండి)
11. తొలివలపే పదే పదే పిలిచే (దేవత) 
12. పూచే పూలలోనా (గీత) 
13. రావే నా చెలియా ..చెలియా (మంచిమనసుకు మంచిరోజులు) (ఇక్కడ వినండి)
14. దొరకునా ఇటువంటి సేవ (శంకరాభరణం) (ఇక్కడ వినండి)
15. పూవై విరిసిన పున్నమి వేళ (తిరుపతమ్మ కథ) (ఇక్కడ వినండి)
16. ఎవరివో నీవెవరివో (పునర్జన్మ) ()
17. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా (దళపతి) (ఇక్కడ వినండి)
18. ఏదో తెలియని బంధమిది ఎదలో ఒదిగిన రాగమిదీ (నాయకుడు) (ఇక్కడ వినండి)
19. నా ఊపిరీ నీవేనులే దేవదేవా (పోలీస్ డైరీ) 
20. ఈనాడే ఎదో అయ్యిందీ ఏనాడూ నాలో జరగనిదీ (ప్రేమ) (ఇక్కడ వినండి)
21. హాయి హాయి హాయి వెన్నెలమ్మ హాయి ...(తారకరాముడు) 
22. సుందరి నేనే నువ్వంట (దళపతి) (ఇక్కడ వినండి)
23. రారా నా సామి రారా (విప్రనారాయణ) (ఇక్కడ వినండి)
24. మనసే కోవెలగా మమతలు మల్లెలుగా (మాతృదేవత) (ఇక్కడ వినండి)
25. పెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకుని (పెళ్ళిచేసి చూడు) (ఇక్కడ వినండి)
26. పాడనా వాణి కళ్యాణి గా (మేఘసందేశం) (ఇక్కడ వినండి)
27. మాణిక్యవీణాం ముఫలాలయంతీం (మహాకవి కాళిదాసు)


ఇలా చెప్పుకొంటూపోతే అంతే ఉండదు. ఈ రాగానికి ఇది చిన్న ఉపోద్ఘాతం మాత్రమే. 
(తప్పులుంటే మన్నించండి)

Sunday, November 20, 2011

భోజరాజు - సాలభంజికలు

         పూర్వం భరత ఖండంలో దక్షిణ మండలాన ధారా నగరాన్ని భోజరాజు పరిపాలిస్తు ఉండేవాడు. అతని రాజ్యం సకల భోగాలతో, పండిత శ్రేష్టులతో, సకల ధర్మాలు తెలిసిన ప్రజలతో నిత్యం కళ కళ లాడుతూ ఉండేది. భోజరాజు కూడా ప్రజల పట్ల పిత్రువాత్సల్యంతో, ధర్మము తప్పక, నీతి న్యాయాలకు పెట్టింది పేరుగా నిష్పక్షపాతం గా పరిపాలించేవాడు. ప్రజలందరికీ ఆ ప్రభువంటే ఎనలేని భక్తి విశ్వాసాలు ఉండేవి.

         ఇలా ప్రజారంజకంగా పరిపాలిస్తున్న భోజరాజుకి అడవి మృగములు గ్రామాలపై పడి పంటలను నాశనం చేస్తున్నవని, వాటి వల్ల ప్రజలు అపాయం కలుగుతున్నదని వార్త తెలిసింది. వెంటనే భోజరాజు తన ప్రధాన మంత్రి బుధిసాగరుడిని పిలచి "మహామంత్రీ ! అడవి మృగాలవలన పంటలు నాశనం అవుతున్నవని, ప్రజలకు అపాయం కలుగుతున్నదన్న విషయం మీకు తెలుసు కదా. తక్షణమే సైన్యం సిద్ధం చేయించండి. నేడే మనము అరణ్యానికి వెళ్ళి ఆ జంతువులని తుద ముట్టిద్దాము" అన్నాడు.

         రాజాఙ్ఞ కాగానే వేటకి సర్వం సిద్ధం అయ్యింది. భోజరాజు సర్వ సైన్య సమేతంగా అడవికి ప్రయాణం అయ్యాడు. అడవికి చేరిన మహారాజు ఎన్నో క్రూరజంతువులని వేటాడాడు. ఎన్నో పులులు, ఎలుగులు భోజ మహారాజు భాణాలకి ఎర అయ్యాయి. అలా అన్ని మృగాలని వేటాడి సర్వ సైన్య సమేతుడై రాజ్యానికి తిరుగు ప్రయాణం అయ్యాడు.

         తిరుగు ప్రయాణం వేళకు మధ్యాహ్నం అయ్యింది. భోజరాజుతో సహా మిగిలిన సైన్యానికి కూడా విపరీతంగా ఆకలి వేయసాగింది. అదే సమయంలో వారికి దారిలో ఒక కోతకు వచ్చిన సజ్జ చేను కనపడింది. దానిని శ్రవణభట్టు అనే బ్రాహ్మణుడు కాపాలా కాస్తున్నాడు. పంట కోతకు రావటంతో పొలము మధ్యలో ఒక పెద్ద మంచె కట్టుకొని వడిసెల తిప్పి పక్షులని బెదర కొడుతున్నాడు.

         అతడు దూరం నుంచి వస్తున్న సైన్యాన్ని, ముందుగా వస్తున్న భోజరాజుని చూసి తన జన్మ ధన్యమైందని అనుకుని మంచ పైనుండే "మహా ప్రభూ ! వందనములు. తమరి రాకతో నా జీవితం ధన్యమయింది. మీరు నా కోరిక మన్నించి ఈ పూట నా ఆతిధ్యం స్వీకరించండి" అన్నాడు.

         అస్సలే ఆకలితో ఉన్న మహారాజుకు మిగిలిన వారికి ఆ మాటలు అమృతం పోసినట్లయింది. వారు సంతోషం గా ఒప్పుకున్నారు. అప్పుడు శ్రవణభట్టు "మహారాజా ! తమరు నా పొలంలో ఉన్న ఆ మహా వృక్షం క్రింద విశ్రాంతి తీసుకోండి. ఆ పక్కనే ఉన్న బావిలోని నీరు కొబ్బరి నీళ్ళలా తియ్యగా ఉంటాయి. కొంచం సేద తీరాక నా పొలంలో ఉన్న సజ్జలు మీకు కావలసినంత తినవచ్చును" అన్నాడు.     అందుకు ఒప్పుకున్న మహారాజు సైన్యంతో సహా చెట్టుకింద చేరి మంచినీళ్ళు తాగి కాసేపు విశ్రమించటానికి పూనుకున్నారు.

         ఇంతలో శ్రవవణభట్టు "మహా ప్రభూ ! నా వంటి పేద బ్రాహ్మణుడి కోరికను మన్నించి మీ గొప్పతనాన్ని చాటుకున్నారు. అనులకే కదా మిమ్ములను ప్రజలకి దైవ సమానులయ్యారు. దయచేసి మీరంతా వచ్చి నా పొలములో చక్కగా పండిన సజ్జలను తనివి తీరా ఆరగించండి. ఒక వేళ సజ్జలు ఎవరికైనా ఇష్టం లేకపోతే పక్కనే ఉన్న నా దోస తోటలో మంచి దోస పండ్లు ఉన్నాయి. ఎవరికి ఏది కావలనో అది తినండి " అన్నాడు. ఆ మాటలకు సంతోషించిన మహారాజు, వారి సైన్యం పొలంలోని సజ్జలు, దోసపండ్లు ఎవరికి కావలసినది వారు కోసుకొని తినటం ప్రారంభించారు.

         ఇంతలో ఏదో పనిమీద మంచె మీదనుంచి దిగిన శ్రవణభట్టు మంచె దిగగానే పొలంలో సజ్జలను దోసపండ్లను తింటున్న సైన్యాన్ని చూసి కోపంతో "ఔరా ఎంత ఘోరం ! పట్టపగలు నేను పొలానికి కాపలా ఉన్న సంగతి కూడా పట్టించుకోకుండా నా పొలం అంతా నాశనం చేస్తున్నారే. ఇది భోజుని రాజ్యం. ఇక్కడ అన్యాయానికి తావు లేదు. ఈ విషయం మహారాజుకు తెలిస్తే మిమ్మలను కఠినంగా శిక్షిస్తారు. నాశనం చేసింది చాలుగానీ ఇంక వెళ్ళండి. లేకపోతే మీ ప్రాణాలు మీకు దక్కవు. " అంటూ అరిచాడు.

         ఆ మాటలు విన్న మహారాజు, సైన్యం ఆశ్చర్యపోయారు. "మహారాజునై నేను ఈ విధంగా ప్రవర్తించటం సరి కాదు" అనుకుని సైన్యం తో తిరిగిపోవటానికి సిద్ధం అయ్యాడు.

         ఈ లోగా మళ్ళీ మంచె మీద చేరిన శరవణభట్టు, వెనుతిరిగి పోతున్న సైన్యాన్ని చూసి "అయ్యలారా ! అప్పుడే మీ కడుపులు నిండాయా? మిమ్ములని చూస్తే మీరు సరిగ్గా తినలేదనిపిస్తోంది. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే క్షమించండి. దయచేసి అర్ధాకలితో మాత్రం వెళ్ళకండి " అన్నాడు దీనంగా.

         ఇలాగ శ్రవణభట్టు రెండుసార్లు మంచె దిగినప్పుడు ఒక విధంగా మంచె మీద ఉన్నప్పుడు ఒక విధంగా ప్రవర్తించటం గమనించిన భోజరాజు మహామంత్రి బుధిసాగరుని పిలిచి "మహామంత్రీ ! ఈ బ్రాహ్మణుది ప్రవర్తన విచిత్రంగా ఉంది. ఈతనికి మతికానీ చలించలేదు కదా! ఇతను మంచె మీద ఉన్నప్పుడు చాలా వినయంగా మంచివాడుగా ప్రవర్తిస్తున్నాడు. మంచె దిగ గానే హటాత్తుగా మారిపోతున్నాడు. ఇది ఆ మంచె ప్రభావమా లేక ఇతనికు మతి లేదా?" అని అడిగాడు.

         అందుకు మహామంత్రి "మహారాజా ! నాకు మాత్రం ఇదేదో మంచెకి సంబంధించినదిగా తోస్తోంది. ఆ మంచె ఉన్న స్థల ప్రభావం వలనే అతను అలా ప్రవర్తిస్తున్నాడు " అన్నాడు.  సరే ఇదేదో మనమే స్వయంగా తేల్చుకుందాము అనుకున్న మహారాజు శ్రవణభట్టుని పిలిచి"బ్రాహ్మణోత్తమా ! తమరు మామీద జాలి చూపించి మా ఆకలి భాదను తీర్చారు. కానీ మావలన మీ పొలం నాశనం అయ్యింది. అందుకు ప్రతిఫలం గా మీకు ఐదు గ్రామాలు, ఒక చేను ఇస్తాను . దయచేసి ఈ పొలాన్ని మాకు ఇవ్వండి " అన్నాడు.

         ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు ఆనందంతో "మహాప్రభూ ! తమరు దయతో అంతగా అనుగ్రహిస్తే ఎలా కాదనగలను? తమకు ఏది ఉచితం ఐతే అలాగే చెయ్యండీ " అన్నాడు. ఆ విధంగా ఆ స్థలం మహారాజుకి స్వాధీనమయింది.

         వెంటనే మహారాజు ఆ మంచె ఉన్న స్థలాన్ని తవ్వించటానికి ముహూర్తం పెట్టించి అక్కడ పూజలు జరిపి తవ్వకం మొదలు పెట్టాడు. కొంత సేపటికి అక్కడనుంచి ఒక అద్భుతమైన సింహాసనం బయటపడింది. ఆ సింహాసనం పుర్తిగా బంగారంతో చేయబడి ధగధగా మెరిసిపోతోంది. సింహాసనం మొత్తం వజ్రాలు, పగడాలు మొదలైన అమూల్య రత్నాలతో పొదగబడి ఉంది. ఆ సింహాసనానికి 32 మెట్లు ఉన్నాయి. ఒక్కొక్క మెట్టు మీద ఒక సాలభంజిక (ప్రతిమ) ఉన్నది. ఆ సింహాసనాన్ని వర్ణించటానికి మాటలు చాలవు.

         దానిని చూసిన భోజరాజు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఆ సింహాసనాన్ని అత్యంత వైభవంతో తన నగరానికి తరలించి దానికి అభిషేకాదులు చేయించాడు. తరవాత బ్రాహ్మణులకు అన్నదాన భూదాన, గోదానములు చేసి, తాను దేవేంద్ర వైభవంతోమిక్కిలు ఉత్సాహంతో ఆ సింహాసనాన్ని ఎక్కటానికి బయలుదేరాడు. అలా బయలుదేరి మొదటిమెట్టు మీద కాలు పెట్టేలోగానే ఆ సింహాసనానికి గల 32 ప్రతిమలు చప్పట్లు కొట్టి పకపకా నవ్వాయి.

         ఆ వింతకి అబ్బురపడ్డ భోజరాజు "ఓ ప్రతిమలారా ! మీరెవరు? ఈ సింహాసనం ఎవరిది? మీరలాగు చప్పట్లు కొట్టి ఎందుకునవ్వారు? నేను ఈ సింహాసనానికి తగిన వాడను కానా? " అని ప్రశ్నించాడు.

         అందుకు మొదటి మెట్టులోని ప్రతిమ " మహారాజా! నా పేరు వినోదరంజిత ప్రతిమ. నేను ఈ మొదటిమెట్టుకు అధికారిని. తమరు ఈ సింహాసనాన్ని అధిరోహించటానికి అర్హుడని కానా అని ప్రశ్నించారు. అందుకు నేను చెప్పబోయేది తమరు వినవలెను. పూర్వము ఈ సింహాసనాన్ని విక్రమాదిత్యుడు అనే సార్వభౌముడి అలంకరించి తన మంత్రి అయిన భట్టి తో సుమారు 2000 సంవత్సరాలు రాజ్యం చేసాడు. అతని గుణగణాలు వర్ణించనలవి కాదు. అతను పరమ సాహసోపేతుడు. అసమాన ధైర్య పరాక్రమాలు కలవాడు. ఆ మహారాజు కాలము తరువాత దీనిని అధిరోహించే అర్హులు ఎవరు లేకపోటం చేతనే ఇది భూమిలోకి క్రుంగింది. విక్రమాదిత్యుని గుణాలలో వెయ్యోవంతు గుణాలు మీకు ఉన్నా మీరు ఈ సింహాసనాన్ని అధిరోహించటానికి అర్హులు. అందుచేత దీనిని, దీనిని అధిరోహించిన విక్రమాదిత్యుని గురించి వివరించటం ఎంతో అవసరం" అన్నది.       అందుకు భోజరాజు "ఓ వినోదరంజితా, నాకు ఆ మహానుభావుని గురించి తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. దయచేసి నాకు తెలియచేయండి" అని వేడుకున్నాడు.

         అలా ఒక్కొక్క ప్రతిమా చెప్పిన 32 కథలే ఈనాడు "భట్టి విక్రమార్క" కథలు గా "భేతాళ" కథలుగా ప్రాచుర్యం సంపాదించుకున్నాయి.

         ఇంకో విషయం ఏమిటి అంటే 32 సాలభంజికలకు 32 పేర్లు ఉన్నాయి. అవి ఏమిటి అంటే :1. వినోదరంజిత2. మదనాభిషేక3. కోమలవల్లి4. మంగళ కళ్యాణి
5. మంత్ర మనోరమ6. శృంగార మోహనవల్లి7. ---8. ---
9. ----10. ---11. విద్వత్శిరోమణి12. శాంతగుణవల్లి
13. సూర్యప్రకాశవల్లి14. పూర్ణచంద్రవల్లి15. అమృతసంజీవివల్లి16. కృపాపరిపూర్ణవల్లి
17. కరుణాకరవల్లి18. పరిమళమోహనవల్లి19. సద్గుణవల్లి20. సుందరవినోదవల్లి
21. కనకరంజితవల్లి22. పంకజవల్లి23. అపరాజితవల్లి24. మనోరంజితవల్లి
25. స్వర్ణకాంతవల్లి26. సకలకళావల్లి27. మాణిక్యవల్లి28. మనునీతివల్లి
29. సంప్రదాయవల్లి30. రుక్మిణీవల్లి31. నీతివాక్యవల్లి32. ఙ్ఞానప్రకాశవల్లి

Thursday, November 10, 2011

అనులోమ విలోమ కావ్యం

 శ్రీ రాఘవ యాదవ్యం అనే కావ్యం లో రామ కథ, కృష్ణ కథ ఒకేసారి వస్తాయి. దీనిని అనులోమ విలోమ కావ్యం అంటారు.


         అందులోంచి ఒక పద్యం .... 


వందేహం దేవం తం శ్రీతం
రంతారం కాలం భాసాయః
రామో రామాధీరాప్యాగో
లీలామారాయోధ్య వాసే
                  దీని అర్థం : సీత కొరకు పరితపించుచూ సహ్యాద్రి పర్వతములు దాటి, రావణుని చంపి, సీతతో అయోధ్యలో చాలాకాలము నివసించెనో, ఆ రామునికి నా నమస్సులు . 


         ఇప్పుడు ఇదే పద్యాన్ని తిరగ వేసి రాస్తే: 


సేవాధ్యేయో రామాలాలీ
గోప్యారాధీ మారామోరాః
యసాభాలంకారం తారం
తం శ్రీతం వందేహం దేవం
                  దీని అర్ధం : వక్షస్థలి లక్ష్మీ వాసమై, యజ్ఞ పూజాదులతో స్మరించ యుక్తుడో, రుక్మిణి మున్నగు భార్యలతో సరసమాడునో, గోపికలచే వందించ బడునో, నగలతో విరాజితుడై ఉండునో, అట్టి శ్రీ కృష్ణునకి నా నమస్సులు. 


Saturday, November 5, 2011

మోహనం - సన్మోహనం

  కర్నాటక సంగీతంలో అనేక జనరంజకమైన రాగలున్నాయి. శంకరాభరణం, కల్యాణి, ఆనందభైరవి, హిందోళం, మోహనం ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిష్టే తయారవుతుంది. ఐతే ఇక్కడ నేను చెప్పదలచు కున్నది ఒకేఒక్క రాగం గురించి- అది " మోహన రాగం". అదే ఎందుకు అని మీరు అడగవచ్చు. చదవండి. మీకే అర్ధమవుతుంది.

        సంగీత పరంగా మోహన రాగం:

        కర్నాటక, హిందుస్థానీ సంగీతంలో మోహన రాగానికి విశిష్ట స్థానం ఉంది. ఎంతో మంది వాగ్గేయకారులు ఈ రాగంలో ఎన్నో అద్భుతమైన రచనలు చేసారు. కారణం ఈ రాగం అన్ని వేళలా పాడ దగినది, నవరసాలను పలికించగలది కావటమే. సంగీతం తెలిసిన వారినైనా, తెలియని వారినైనా ఒకేలా ఆకట్టుకునే రాగం మోహన రాగం.

        మోహన రాగం 28 మేళకర్త అయిన హరికాంభోజి అనే రాగానికి జన్యం. ఔఢవ-ఔఢవ రాగం. అంటే ఈ రాగం ఆరోహణ, అవరోహణలో కూడా కేవలం ఐదు స్వరాలే ఉంటాయి. అవి...

1. షడ్జమం (స)
2. చతుశృతి రిషభం (చ. రి)
3. అంతర గాంధారం (అం.గ)
4. పంచమం (ప)
5. చతుశృతి ధైవతం (చ.ద)
        అంటే స, రి, గ, ప, ద, స - స, ద, ప, గ, రి, స అనేది ఈ రాగం ఆరోహణ అవరోహణలన్న మాట. సంగీతం నేర్చుకునేప్పుడు వచ్చేగీతాలలో "వరవీణ మృదుపాణి" అనే గీతం చాలా మందికి తెలిసిందే. ఇది మోహన రాగంలోని గీతమే.


        కర్నాటక సంగీతంలో మోహన రాగంలో వచ్చిన కొన్ని ప్రసిద్ధ రచనలు:
1. నిన్ను కోరి (వర్ణం)
2. ననూ పాలింప (త్యాగరాజ కృతి)
3. ఎవరూరా నిను వినా (త్యాగరాజ కృతి)
3. బాల గోపాల ( నారాయణ తీర్ధులవారి తరంగం)
4. రక్త గణపతిం భజేహం (ముత్తుస్వామి దీక్షితార్ కృతి)
5. చందన చర్చిత (గీతాగోవిందం-జయదేవ)
6. రతి సుఖసారే (గీతాగోవిందం-జయదేవ)
7. రామా నిను నమ్మిన వారము (త్యాగరాజ కృతి)
8. మాటిమాటికి తెల్పవలెనా (త్యాగరాజ కృతి)
9. భవనుత (త్యాగరాజ కృతి)
10. మోహన రామ (త్యాగరాజ కృతి)
11. చేరి యశోదకు శిశువితడు (అన్నమాచార్య కృతి)
        పైన చెప్పినవి కొన్ని ప్రసిద్ద కీర్తనలు మాత్రమే.
 సినిమా సంగీతంలో మోహన రాగం:

        సినిమా సంగీతంలో మోహన రాగాన్ని వాడినంతగా వేరే ఏ రాగాన్ని వాడలేదనుకుంటా. కారణం ఏమిటంటే పైన చెప్పిన విధంగా ఈ రాగంలో నవరసాలు పలికించవచ్చు. ఉదాహరణకి....

లాహిరి లాహిరి లాహిరిలో -అని అలలపై తేలిపోయే ప్రణయ గీతానికైనా, చెంగు చెంగునా గంతులు వేయండి -అనే ఉత్సావంతమైన పాటకైనా, ఘనా ఘన సుందరా -అనిగానీ, శివ శివ శంకరా భక్త వశంకర -అని దేవుణ్ణి వేడుకొన్నా, మధుర మధురమీ చల్లని రేయీ -అని ప్రణయలోకాల్లో తేలిపోయినా, ఈ నల్లని రాళలో ఏ కన్నులు దాగెనో -అంటు ఊహల్లో విహరించినా....
        ఈ రాగంలోనే సాధ్యం. ఈ పాటలు ఎంత ప్రసిద్ధి చెందాయంటే వీటిని వేరే రాగంలో వేరే ట్యూన్ లో ఊహించటం కూడ కష్టం.


        ఎస్. (సుస్వర) రాజేశ్వరరావు గారు ఈ రాగాధారంగా అనేక పాటలకు సంగీతం అందించారు. ' వినిపించని రాగాలే ' (చదువుకున్న అమ్మాయిలు - సుశీల), ' చూడుమదే చెలియా ' (విప్రనారాయణ - ఏ.ఎం.రాజ), మధుర మధురమీ చల్లని రేయీ (విప్రనారాయణ - ఏ.ఎం.రాజ, పి.భానుమతి), మదిలో వీణలు మ్రోగే (ఆత్మీయులు - సుశీల) కొన్ని అద్భుతమైన మోహన రాగంపై ఆధారితమైన సినిమా పాటలు.


        నాకు తెలిసిన పాటలు కొన్ని ఇక్కడ రాస్తున్నాను. మీకు తెలిసినవి నాకు చెప్పండి.
1. లాహిరి లాహిరి లాహిరిలో -- మాయాబజార్
2. ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి -- అప్పు చేసి పప్పు కూడు
3. చంగు చంగున గంతులు వేయండి -- నమ్మిన బంటు
4. శివ శివ శంకర భక్త వశంకర -- భక్త కన్నప్ప
5. ఈ నాటి ఈ హాయీ కల కాదోయి నిజమోయి -- జయసింహ
6. మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును-- గుండమ్మ కధ
7. మధుర మధురమీ చల్లని రేయి -- విప్రనారాయణ
8. చూడుమదే చెలియా -- విప్రనారాయణ
9. కనులకు వెలుగువు నీవే కాదా -- భక్త ప్రహ్లాద
10. పాడవేల రాధిక -- ఇద్దరు మిత్రులు
11. నిన్ను కోరి వర్ణం -- ఘర్షణ
12. మనసు పరిమళించెనె -- శ్రీకృష్ణార్జున యుద్ధం
13. ఘనా ఘన సుందరా -- భక్త తుకారాం
14. తెల్లవార వచ్చె తెలియక నాసామీ -- చిరంజీవులు
15. తెలుసుకొనవె యువతి -- మిస్సమ్మ
16. సిరిమల్లె నీవే -- పంతులమ్మ
17. ఐనదేమో ఐనది -- జగదేకవీరుని కధ
18. మోహన రాగమహా -- మహా మంత్రి తిమ్మరుసు
19. పలికినదీ పిలిచినది -- సీత రాములు
20. చందన చర్చిత -- తెనాలిరామకృష్ణ
21. పులకించని మది పులకించు -- పెళ్ళికానుక
22. తిరుమల గిరివాసా -- రహస్యం
23. వే వేల గోపెమ్మల మువ్వా గోపాలుడె -- సాగర సంగమం
24. గోపాల జాగేలరా --- భలే అమ్మాయిలు
25. ననుపాలింపగ నడచీ వచ్చితివా -- బుద్ధిమంతుడు
26. రతిసుఖ సారె -- జయదేవ
27. జ్యోతి కలశ చలికే -- (హింది - భాభీకి చుడియా)
28. సయొనారా సయినారా -- (హింది - లవ్ ఇన్ టొక్యో)
29. ఆ మొగల్ రణధిరుల్ -- (ఘంటసాల వారి ప్రైవేటు ఆల్బం)
30. భారతీయుల కళా ప్రాభవమ్మొలికించి -- (ఘంటసాల వారి ప్రైవేటు ఆల్బం)
        ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఎన్నెన్నో పాటలు ఉన్నాయి. తరచుగా అవే పాటలను వింటుంటె, మీరు కూడ ఏ పాట మోహనంలో ఉందో ఈజీగా చెప్పేయ గలరు. ప్రయతించండి.


        ( నాకు ఉన్న మిడిమిడి జ్ఞానంతో, అది మీతో పంచుకోవాలనే ఆశతో, ఏదో రాయాలనే ఆత్రంతో ఈ ఆర్టికల్ రాసాను. నచ్చితే మెచ్చుకోండి, బాగాలేకపోతే విమర్శించండి. తప్పులుంటె క్షమించండి. )