Monday, May 21, 2012

బందరు -- నీ పాత పేరేమిటి?

ఈమధ్య ఆరుద్రగారి వ్యాస సంపుటిలో ఒక ఆసక్తికరమైన వ్యాసం చదివాను. ఆసక్తి కరమైనది అని ఎందుకన్నాను అంటే ఆయన లేవనెత్తిన ప్రశ్న అలాటిది. ' బందరు ప్రాచీననామం ఏమిటి? " అనేది ఆవ్యాసం సారాంశం.   అవ్యాసానికి సంభందించిన సంగతులు ఆసక్తి కలవారితో పంచుకుందాం అన్నదే ఈ చిన్న పోష్టు ముఖ్యోద్దేశం.

ప్రాచీనకాలంలో మనదేశానికి అనేకమంది యాత్రికులు వచ్చి వారి అనుభవాలు వారు చూసిన వివిధ ప్రదేశాలు మొదలైనవి గ్రందస్థం చేసారు. అలాంటి వారిలో ప్లవి టోలెమీ అనేవారలు ప్రాగాంధ్ర తీరంలోని
కొన్ని ప్రదేశాలు వారి రచనలలో పేర్కొన్నారు, వాటిలో ' కొంటికపిల ' ' కోడూర ' మైసోలియా అన్నవి కొన్ని పేర్లు. తరువాతి కాలంలో కొంటికపిల అంటే ఘంటసాల గా, కోడూర అంటే బందరు దగ్గరి గూడూరుగా చరిత్ర కారులు గుర్తించారు. అయితే మైసోలియా అంటే ఇంతవరకు ఇతిమిద్దంగా ఏదీ అనేది ఇంతవరకు ఎవ్వరు నిర్ధారించ లేకపోతున్నారు. కొంతమంది మైసోలియా అంటే మచిలీపట్నమే అని వాదిస్తున్నా అది తప్పనే భావనే చాలామందికి ఉంది. కారణం టోలెమీ క్రీ.శ. 2 శతాబ్ధి వాడు. అప్పటికి మచిలీపట్నం లేదు కాబట్టి మైసోలియా బందరు కావటానికి వీలు లేదని కొంతమంది వాదన.

మళ్ళీ మొదటికి వచ్చాం. అసలు బందరు ప్రాచీన నామం ఏమిటి?? ఎన్నో కథలు చెప్తారు. బంధుడు అనే చేపలవాడు పట్టిన గొప్ప మత్యం వలన ఆ వూరికి మచిలీ బందరు అనే పేరు వచ్చిందని, మత్యపురి, బృందావనం అనే పేర్లు కూడా ఇదివరలో బందరుకు ఉన్నాయని అ కధలలలో కొన్ని. బందరుకు దగ్గరలో ఉన్న ఘంటసాల, గూడూరు మాత్రమే ప్రాచీన పట్టణాలు కానీ బందరు ప్రాచీనం కాదని వాదించే వాళ్ళు ఉన్నారు.

పదునాలుగో శతాబ్దంకి ముందు బందరు లేదనేవాళ్ళున్నారు. కారణం అప్పటికి దొరికిన శాసనములు. గార్డెన్ మెకంజీ వ్రాసిన ప్రకారం, మొట్టమొదటిసారిగా మచిలీపట్నం అనేపేరు ఆ ఊళ్ళోకట్టిన ఒక మసీదులోని శాసనంలో కనపడిందట. ఆ శాసనకాలం 1425. అంతకుముందు వంద సంవత్సరాల పూర్వం అరబ్బు ఓడవర్తకులు మచిలీపట్నాన్ని వలసగా నిర్మించారని మెకంజీ కధనం. అరబ్బు వర్తకులు రావటనికి పూర్వం ఆగ్రామం చేపల రేవేకానీ వ్యాపార కేంద్రం కాదు. అయితే 1397 నాటికే బందరులో దేవాలయాలు ఉన్నాయి. వాటి గోడలమీద శాసనాలు ఉన్నాయి. ఐతే వాటి సంగతి ఎవ్వరూ పట్టించుకోవటం లేదు.

బందరులో రామలింగేశ్వర స్వామి ఆలయంలో, రంగనాథ స్వామి ఆలయంలో ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో శాసనాలున్నాయి.

ఏకాంబరేశ్వరస్వామి ఆలయంలో గర్భాలయ ద్వారంకి ఇరువైపులా రెండు శాసనాలున్నాయి. అందులో కుడిప్రక్కన శాసనం క్రీ.శ. 1370 నాటిది. ఈ శాసనంలో, మొదటిసారి ' కడలిపురం ' అనే పేరు కనబడుతుంది. ఎడమవైపు శాసనం క్రీ.శ 1395 నాటిది. ఇందులో కూడా ' కడలిపురం ' అనే నామం కనబడుతుంది. బందరు కడలి (సముద్రం) తీరాన్న ఉందికాబట్టి కడలి పురం ఇవి రెండు ఒకటే కావొచ్చు.

ఐతే ఆంధ్రప్రదేష్ హిస్టరీ కాంగ్రస్ అనే సమావేశంలో ఇంగువ కార్తికేయ శర్మ గారు, బందరు ప్రాచీన నామం ' ముచిలింద నగరం ' అని నిర్ణయించారు. కారణం సింహళ బౌద్ధ గ్రంధాలలో ముచిలింద నగరం ప్రసక్తి ఉన్నది. ముచిలిందందుడు బుద్ధుడిని గాలివాన నుంచి రక్షించిన ఘట్టం చాలాప్రాముఖ్యం చెందింది. ఆ ముచిలిందుని పేర ముచిలింద నగరంగా ఏర్పడి కాలక్రమేణా మచిలిపట్నం గా మారిందా? ఎమో ఈ సంగతులని నిర్ధారించటానికి ప్రమాణాలు వెదకాలి. శాసనాలను త్రవ్వి తీయాలి.  కష్టపడాలి.

ఇంతకీ ఓ బందరూ నీ పాత పేరేమిటీ?
ముచిలింద నగరమా?, కడలిపురి ఆ? బందరు మచిలి ఆ? లేక ఇంకేదైనా నా?