Friday, September 30, 2011

ప్రాచీన భారత దేశంలో కాలమానం

         మన ప్రాచీన భారతదేశం లో కాలమానం గురించి విష్ణు పురాణం (BOOK-I, Chapter -III ) లో చాలా విపులంగా చర్చించబడింది. వాటిలోని కొన్ని విషయాలను మీతో పంచుకోవటమే ఈ వ్యాస ప్రధాన ఉద్దేశ్యం.

         ప్రాచిన భారతంలో కాలాన్ని రెండు రకాలుగా విభజించారు.

                 1. సూర్యమానం (Siderial metrics)
                 2. చంద్రమానం (Lunar metrics)

         సూర్యమానం (Siderial metrics) 

* ఒక " పరమాణువు " = ఒక కనురెప్ప పాటుకి పట్టె సమయం లేదా సుమారు 4 సెకన్లు
* ఒక " విఘటి " = 6 పరమాణువులు లేదా సుమారు 24 సెకన్లు
* ఒక " ఘడియ " = 60 విఘటియలు లేదా సుమారు 24 నిముషములు
* ఒక " ముహూర్తం " = 2 ఘడియలు లేదా సుమారు 48 నిముషములు
* ఒక " నక్షత్ర అహోరాత్రం " = ఒక సూర్య దినము లేదా 30 ముహూర్తములు.
         (గమనిక : ఒక రోజు అనగా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉండే కాలం )


         ప్రత్యామ్నాయ కాలమానం కూడ ఇదే పద్దతిలో సూచించారు. దాని ప్రకారం :
* 15 కనురెప్ప పాట్లు = ఒక కషితిహ
* 30 కషితిహములు= 1 కాల
* 30 కాలములు = 1 ముహూర్తం
* 30 ముహూర్తములు = 1 రోజు (24 గంటలు)
* 30 రోజులు = ఒక నెల లేక మాసం
* 6 నెలలు = ఒక ఆయనం
* 2 ఆయనములు = 1 సంవత్సరం లేదా దేవతలకి ఒక రోజు (పగలు + రాత్రి )
  చంద్రమానం (Lunar metrics)
* తిధి : సూర్య చంద్రుల మధ్య 12 డిగ్రీల రేఖాంశ కోణం రావటనికి పట్టె సమయాన్ని " తిధి " అంటారు. ఈ తిధి ఏ సమయంలో ఐనా రావచ్చును. ఈ తిధి కాల పరిమితి కూడ 19 నుంచి 26 గంటల మధ్యలో మారుతూ ఉంటుంది.
* పక్షము : 15 తిధులు జరగటానికి పట్టె కాలం
* ఒక మాసం లేదా చంద్ర మాసం : సుమారు 29.5 రోజుల కాలం. 2 పక్షాలు గా విభజించ వచ్చు. మొదటి పక్షం శుక్లపక్షం అమావాస్య నుండి పూర్ణమి వరకు, రెండో పక్షం కృష్ణ పక్షం పూర్ణమి నుండి అమావాస్య వరకు.
* ఒక ఋతువు = 2 మాసములు
* ఒక ఆయినము = 3 రుతువులు
* ఒక సంవత్సరం = 2 ఆయినములు (ఉత్తరాయిణం , దక్షణాయినం )
         పిత్రు దేవతల కాలమానం
ఒక మానవ మాసం = పిత్రువుల ఒక రోజు
30 పిత్రు దినములు = పిత్రు మాసం
12 పిత్రు మాసములు= ఒక పిత్రు సంవత్సరం
ఒక పిత్రు జీవిత కాలం 100 పిత్రు సంవత్సరములు (=3000 మానవ సంవత్సరములు )
         దేవతల కాలమానం
ఒక మానవ సంవత్సరం = దేవతల ఒక రోజు
30 దేవతల రోజులు = ఒక దైవ మాసం
12 దైవ మాసములు = ఒక దైవ సంవత్సరం
ఒక దేవుని జీవిత కాలం 100 దైవ సంవత్సరములు (= 36 000 మానవ సంవత్సరములు)


         బ్రహ్మ కాలమానం
360 దైవ దినములు = ఒక దైవ సంవత్సరం
12000 దైవ సంవత్సరములు = 4 యుగములు
4000 యుగములు = బ్రహ్మకు ఒక రోజు

బ్రహ్మ ఒకరోజుని 1000 భాగాలుగా విభజించారు. ఒక్కొక్క భాగాన్ని చరణం అంటారు.

4 చరణములు (1,728,000 సూర్య సంవత్సరములు ) కృతయుగం
3 చరణములు (1,296,000 సూర్య సంవత్సరములు ) త్రేతాయుగం
2 చరణములు (864,000 సూర్య సంవత్సరములు ) ద్వాపరయుగం
1 చరణం (432, 000 సూర్య సంవత్సరములు ) కలియుగం
         ఈ నాలుగుయుగాలని కలిపి ఒక " మహాయుగం " అంటారు (4.32 మిలియను సంవత్సరాలు). 71 మహాయుగాలు ఒక " మన్వంతరం " . ప్రతి మన్వంతరాన్ని ఒక మనువు పరిపాలిస్తాడు. ప్రతి మన్వంతరం తరవాత 4 చరణాల కాలం " సంధికళ " ఉంటుంది. ఈ సమయంలో ఈ ప్రపంచం నీట మునిగి ఉంటుంది అంటారు.


         ఒక కల్పం లో ఆది సంధి మరియు 14 మన్వంతరాలు వాటి సంధి కళలు ఉంటాయి.


         హిందు ధర్మ ప్రకారం కలియుగం జూలియన్ కాలండర్ అనుసరించి 17/18 ఫిబ్రవరీ 3102 B.C. అర్ధరాత్రి మొదలయింది మనం ప్రస్తుతం 28 వ కలియుగంలో వైవస్వత మన్వంతరంలో స్వేతవరాహ కల్ప మొదటి సంవత్సరం మొదటి రోజు లో ఉన్నాము. ఇది ఇప్పటి బ్రహ్మ కి 51 వ సంవత్సరం అంటే సుమారు 155 trillion సంవత్సరాల క్రితం ఈ బ్రహ్మ పదవి చేపట్టాడన్నమాట.

Monday, September 26, 2011

ఆత్మ కధ


      శీర్షిక పేరు చూడగానే ఇదేదో నా ఆత్మ కధ అనుకుంటున్నారేమో? ఆదేం లేదండీ. ఇది మన అందరిలో ఉన్న ఆత్మ గురించే. మనలో చాలా మందికి మన వేద శాస్త్రాలు మొదలైనవి పాత వాళ్ళు చెప్పిన సోదిలా  అనిపించవచ్చు.  అందుకు చాలానే కారణాలు ఉన్నాయి. నాకు తెలిసి అన్నిట్లో ముఖ్య కారణం వాటిపై మనకి సరి ఐన అవగాహన లేక పోవటమే అనిపిస్తుంది. సంస్కృతం ఉన్న ఆ శ్లోకాలని అర్థం చేసుకోవటానికి మనకు సంస్కృతంలో పరిపూర్ణ ఙ్ఞానం కావాలి. ఈ సంగతి వదిలి ఈ వ్యాసం అస్సలు విషయానికి వద్దాము. 

         మనకి పెద్దలు చెప్పినది, చదివినది బట్టి ఆత్మ గురించి కొద్దో గొప్పో తెలుసు. ఐతే అందులో మనకి పరిపూర్ణ ఙ్ఞానం లేదు. నాకు తెలిసిన కొన్ని విషయాలు ఇక్కడ పొందు పరుస్తున్న.       


    అస్సలు ఆత్మ అంటె ఏమిటి? ఆత్మ గుణం ఏమిటి? మనము ఎలా తెలుసుకోగలము అనే విషయాలని మన పూర్వులు ఉపనిషత్తులలో కూలంకుషం గా చర్చించారు. 
అవినాశి తు తద్విద్ధి యేన సర్వ మిదం తతం
వినాశ మవ్యయస్యాస్య న కశ్చి త్క ర్తు మర్హతి.
         "శరీరము నందంటను వ్యాపించి ఉన్న ఆత్మ నాశనము లేనిది. వినాశము లేని ఆత్మను చంప గలిగిన వాడెవ్వడునూ లేడు" (భగవద్గీత- సాంఖ్యా యోగం -17 ).
         ఆత్మ మనుస్యుని శరీరం అంతట వ్యాపించి ఉంటుంది అని, ఈ ఆత్మ వలనే మనలో చైతన్యము ఉంది అనే విషయము భగవద్గీతలో స్పష్టంగా చెప్పబడి ఉంది. ఐతే ఈ ఆత్మ ని మనము చూడగలమా? చూడలేకపోతే ఉంది అని ఎలా నిర్ధారించ గలమూ? అస్సలు ఆత్మ ఎక్కడ ఉంది? 
         ఆత్మ మన కంటికి కనిపించనంత సూక్షం రూపంలో ఉంటుంది. దాని పరిమాణం గురించి శ్వేతాశ్వతరోపనిషత్తులో (5,9) ఈ విధం గా చెప్ప బడింది. 
బాలాగ్ర శత భాగస్య శతధా కల్పితస్య చ
భాగో జీవ స్స విఙ్ఞేయః స చానంత్యాయ కల్పతే
         "వెంట్రుక యొక్క చివరిభాగమును నూరు తునకలుగా చేసి అందులో ఒక్కొక్క తునుకను మరల నూరు భాగములుగా చేసినచో అందులోని ఒక్కొక్క తునుక ఎంత పరిమాణముగల్గి ఉండునో అంతటి పరిమాణము గలది ఆత్మ." 


         ఇదే విషయం భాగవతం లో ఈ విధం గా చెప్పబడింది. 
కేశాగ్ర శతభాగస్య శతాంశస్సదృశాత్మకః
జీవః సూక్ష్మ స్వరూపో అయం సంఖ్యాతీతో హి చిత్కణః
         "ఆత్మ కణములు అసంఖ్యాకములు. అవి కేశాగ్రముయొక్క శతాంశ భాగ పరిమాణము గల్గి యున్నవి" 

         ఇంత సూక్ష్మ రూపంలో ఉన్న ఆత్మని మనము సామాన్యమైన కళ్ళతో చూడలేము కదా. మాండూకోపనిషత్తులో ఏమన్నారో చూద్దాం. 



ఏషోఆణురాత్మా చేతసా వేదితవ్యో యస్మిన్ ప్రాణాః పంచధా సంవివేశ ప్రణైశ్చిత్తం సర్వనోతం ప్రజానాం యస్మిన్ విశుధ్ధే విభవత్యేష ఆత్మా
         

 ""ఆత్మ పరమాణు మాత్రమైనది. దానిని భుధితోనే తెలుసుకోదగును. ఈ పరమాణు ప్రమాణమైన ఆత్మ పంచవిధ వాయువులతో (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన) ప్రవహితమై ప్రాణుల హృదయముల నుండి తన ప్రభావమును శరీర మంతటను వ్యాపింప చేయు చుండును. ఈ పంచవిధములైన భౌతిక వాయువులు కల్మషమును వదిలినప్పుడు ఆత్మ పునీతమై తన దివ్య ప్రభావమును ప్రకటించును" 

         దీనిని బట్టి మనకు తెలిసింది ఏమిటి అంటే ఆత్మ మన హృదయం లో ఉంటుంది అని. హృదయంలో ఆత్మ స్థానం మంత్రపుష్పంలో చక్కగ వివరించారు. 

         ఈ వివరణ ప్రకారం మనహృదయము నందు అతి సూక్ష్మమైన రంధ్రమొకటి కలదు. ఆ రంధ్రమునందలి మధ్య భాగమున అనంతమగు జ్వాలలతో కూడిన ఒక అగ్ని కలదు. ఈ మహా అగ్ని మధ్యమునందు మరొక విషిష్టగ్ని కలదు. ఈ విషిస్టాగ్ని యందే దేవుడు నివసించుచున్నాడు. 

         బహుశా ఇదే ఆత్మ స్థానం అయ్యి ఉండవచ్చు. భగవద్గీతలో చెప్పిన విధం గా ఆత్మకు జనన మరణాములు లేవు. ఎప్పటికీకి మార్పు చెందదు. శాశ్వితమైనది. ఇది ఒక శరీరము వదిలి ఇంకొక శరిరమును ఆశ్రయించునే కానీ శరీరముతో పాటు నాశనము కాదు. ఈ ఆత్మను ఏ ఆయుధములు ఖడింపలేవు. అగ్ని దహించలేదు. నీరు తడి చేయలేదు. గాలి శుష్కింప చేయలేదు. 


  ఇవన్ని చదువుతుంటె నాకు భౌతిక శాస్త్రంలో చదువుకున్న విషయాలు గుర్తుకు వస్తున్నాయి. మనము పరమాణువు గురించి వాని అంతర్గత విషయాలను గురించి చదువుకున్నవే. పరమాణు భౌతికశాస్త్ర (Atomic Physics) ప్రకారం ఎలక్ట్రానులు ప్రోటానులు కలిగిన పరమాణువును ఇంకా విభజించితే చవరికి మిగిలేది శక్తి (energy) మాత్రమే . మనము కొంచము నిశితం గా గమనిస్తే ఆత్మ అనే మన వైదిక సిద్ధాంతము పరమాణు సిద్ధాంతముకి చాలా పోలికలే కనిపిస్తాయి. 


         ఇది నా ఆలోచన మాత్రమే. మీరూ ఆలోచించండి మరి. 

Saturday, September 24, 2011

అప్పట్లో .......

అప్పట్లో అంటే నా చిన్నప్పుడన్నమాట. అప్పుడు నేను బందరులో ఆరో క్లాసు చదుతుండేవాడిని. బందరు అంటే చాలామందికి తెలుసు అనుకుంటా. దాన్నే మచిలీపట్టణం అనేవారు. ఆ రోజుల ఙ్ఞాపకాలు ఇప్పుడు గుర్తు చేసుకుంటుంటే భలే తమాషాగా ఉంటుంది. ఆ రోజుల్లో మా నాన్న గారు రీసర్చ్ కి అమెరికా వెళ్ళటంతో మేము బందరులో బాబాయిగారింట్లో ఉండి చదువుకునే వారం. మేము అంటే నేను మా అన్నయ్యా, నా ఇద్దరు చెల్లెళ్ళు.

         బందరులో మా బాబాయికి ఒక రేడియో షాపు ఉండేది. పక్కనే మా తాతయ్య గారి గడియారం దుకాణం. రోజూ స్కూలు నుంచి వచ్చాక సాయంత్రం 6 గంటలకల్లా బాబాయి కొట్టుకి వెళ్ళేవాళ్ళం. బందరులో అన్ని మాకు దగ్గరగానే ఉండేవి, అందుకోసం నడిచే వెళ్ళేవాళ్ళం. మా తాతయ్య మాకు రోజుకి ఫది పైసలు ఇచ్చేవాడు. ఆ రోజుల్లో ఫది పైసలంటే చాలా ఎక్కువే. ఫది పైసలకు రెండు గుప్పెళ్ళ సన్నపూసగానీ, బూందీగానీ, బఠాని మసాలా గాని కొనుక్కునే వాళ్ళం. ఆ బఠానీ మసాలా చాలా బాగా చేసేవాడు. బఠాణీలు ఉడకపెట్టి అందులో ఉల్లిపాయలు మొదలైన దినుసులన్ని వేసి, పైన నిమ్మకాయ పిండి చేసేవాడు. తినటానికి వీలుగా ఒక తాటి ఆకు ముక్క ఇచ్చేవాడు. చీకటి పడేదాకా అక్కడే ఉండి మా పిన్నికి ఏదో ఒక టిఫిను ఇంటికి తెచ్చేవాళ్ళం.

         అప్పట్లో త్రివేణి వక్కపొడి (ఇది బందరులోనే చేసేవాళ్ళు) 1 పైసా, 3 పైసలు, 5 పైసలకి దొరికేది. 1 పైసా పొట్లం సన్నని ఉల్లిపొర కాగితంలో కట్టేవారు. పైన త్రివేణి అనిరాసి మూడు కొండల బొమ్మలు కూడా ఉండేవి. భోజనాలు కాగానే మా బాబాయికి పిన్నికి కూడా వక్కపొడి కావాలి. వాళ్ళు వేసుకునేదాన్లో మాకూ ఒక పలుకు ఇస్తూ ఉండేవారు. అలా మాకు వక్కపొడి నమలటం అలవాటైపోయింది. ప్రతి రోజు మాకు సామాన్యం గా ఇదే పద్దతిలో నడీచేది.
ఆదివారం వచ్చిందంటే మాకు పండుగే. ఆ రోజు పొదున్నే లేచి, స్నానం చేసుకొని చద్దెన్నం తినేసి బాబాయి కొట్టుకు వెళ్ళి సామాన్లన్ని సర్దేసేవాళ్ళం. అంతా నీటుగా సర్ది బాబయికి వచ్చి చెప్పేవాళ్ళం. అందుకు మా బాబాయి 50 పైసలు ఇచ్చేవాడు. దాంతో మేము సినిమాకు వెళ్ళేవాళ్ళం. అప్పట్లో బెంచి టికెట్టు 40 పైసలు. 10 పైసలు పెట్టి ఇంటర్వెల్ లో ఏదైనా కొనుక్కుని తినే వాళ్ళం. ఎక్కువగా మేము బుట్టాయి పేటలోని దుర్గా టాకీసుకే వెళ్ళేవాళ్ళం. లోనే ఎన్.టి.ఆర్ సినిమాలు వచ్చేవి. చిక్కడు దొరకడు, కదలడు వదలడు, అగ్గిబరాటా, అగ్గి పిడుగు, పిడుగురాముడు, పాతాళభైరవీ, లాంటి  సినిమాలన్ని అందులోనే చూసాం.



ఇకపోతే, పండుగల్లో మా హడావుడి అంతా ఇంతా కాదు. దీపావళి, దసరా అక్కడ బాగా జరిగేవి. దీపావళి బాంబులంటూ ఉంటే అవి తాటాకు టపాకాయలే. ఒక పైసా కి ఒకటి చప్పున ఒక వంద కొనే వాళ్ళం. ఒక తాటాకు చివర మందుపెట్టి పొట్లంలా కట్టి చివరన ఒక వత్తి పెట్టేవాళ్ళు. రెండో చివర మనం చేత్తో పట్టుకుని కాల్చ వచ్చన్న మాట. జువ్వలు కూడా వేసేవాళ్ళం కానీ, మా బాబాయి పిన్ని వెనకాల ఉండి ఒళ్ళు కాల్చుకోకుండా చుసేవారు. కాకర పువ్వొత్తులు, మతాబాలు బోలెడన్ని కాల్చేవాళ్ళం. దీపావళి కావలసినవన్నీ 25 లేక 30 రూపాయల్లో వచ్చేసేవి. అవే ఇప్పుడు కొనాలంటే 1500 పైనే అవుతుంది.
దసరాల్లో మా ఇంట్లో చాలా హడావుడిగా ఉండేది. ఆ ఫది రోజులు మా బాబాయి హోమం వగైరా చేసేవాడు. బందరు నుంచే కాకుండా, తరకటూరు, పెడన మొదలైన పక్క ఊళ్ళవారు కూడా ఆ ఫదిరోజులు వచ్చేవాళ్ళు. మాకు ఫుల్లుగా పనే. బజారుకు వెళ్ళి పూజకి కావాల్సినవన్నీ తేవటం మా పని. బందర్లో కన్యకా పరమేశ్వరి గుడి ఉండేది. నవరాత్రుల్లో అక్కడకూడా బోలెడన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఆ గుడిలో రోజూ పులిహోర, పరమాన్నం ప్రసాదం. భలే రుచిగా ఉండేవి.
దసరాల్లో బందరు ఇంకో స్పెషాలిటి ఏమిటంటే, శక్తిపఠాలు. పెద్ద పెద్ద కాళికా బొమ్మలని తలమీద పెట్టుకొని రాత్రంతా బందరంతా తిరిగే వాళ్ళు. అప్పట్లో దాదా శక్తిపఠం అని వచ్చేది. అది అక్కడి అన్ని శక్తి పఠాలలోకి పెద్దది. చూడటానికి భయంకరంగా ఉండేది. హటాత్తుగా ఎదురు వెళ్తే భయంతో నెత్తురు కక్కుకుని చస్తారని ఒక వదంతి కూడా ఉండేది. నేను చాలా సార్లే చూసాలేండి. ఇవి కాకుండ పులి డాన్సులవాళ్ళు, అఘోరాలు కూడా వచ్చేవాళ్ళు. అఘోరాలు నల్లని బట్టలు వేసుకుని ఒక చేతిలో పుర్రె పట్టుకుని తిరిగే వాళ్ళు.

దసరాల్లో మా స్కూలు మాష్టారులతో కలిసి అందరిళ్ళకి వెళ్ళేవాళ్ళం. 

" అయ్యవారికి చాలు ఐదు వరహాలు
పిల్లగాళ్ళకు చాలు పప్పు బెల్లాలు"
         అని పాడుకుంటూ. మొత్తం పాట ఇప్పుడు గుర్తులేదు.


         ఇక మా ఆటలు. కర్రా బిళ్ళ, అష్టాచెమ్మా, వామనగుంటలు, మొదలైనవే. క్రికెట్టు లాంటి ఆటలు నాకు అప్పట్లో తెలిసేది కాదు.




 ఏమిటో ఆ రోజులన్నీ ఇప్పట్లో ఉన్న సాధనాలు లేకపోయినా భలే సరదాగా గడిచిపోయాయి. ఒక పైసాకి కూడా చాల విలువ ఉండేది. ఒక పైసాకి మరమరాల ఉండ, సెనగపప్పుల ఉండ వచ్చేవి. ఒక పైసాకి మూడు నిమ్మ తొనల బిళ్ళలు, 5 పైసలకి ప్యారీ (ఆకుపచ్చ కాగితంతో) చాకలెట్టు, వచ్చేది. గోంగూర పచ్చడిలోకి ఉల్లిపాయలేకపోతే పరిగెట్టుకుంటు సందు చివర నవీన కొట్టుకి వెళ్ళి అడిగితే ఊరికే ఇచ్చేవాడు.

         ఇలా రాసుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. నాకు తెలుసు ఇది చదువుతుంటే మీకు కూడా మీ చిన్నప్పటి సంగతులు గుర్తుకు వస్తాయని. 

         మళ్ళీ ఆ రోజులు ఇంక రావు.  మనం చిన్నప్పడు నేర్చుకున్న ఆచారాలు, అనుభవాలూ, సంస్కృతి మన పిల్లలకు ఎంతవరకు అందిస్తున్నాము ? అని ఒక సారి నాకే అనిపిస్తుంది. అందుకే నేను ప్రతి పండుగకీ విధిగా చేయ్యాల్సినవన్నీ చేస్తుంటాను. వారికి కూడా ఎలా చెయ్యాలో చెప్పి చేయిస్తుంటాను. ఇదేకదా మనం మన తరువాతి తరానికి అందించే సంస్కారం. ఏమంటారు?

Wednesday, September 21, 2011

ఏడుకొండలవాడా - ఎవరయ్యానీవు?


 ఈ మధ్య హైదరాబాదు వెళ్ళినప్పుడు మా బాబాయి గారింట్లో "సావిత్రి"అనే ఒక పుస్తకం చుశాను."సావిత్రి" అంటే శ్రీ అరబిందో రాసినది అనుకునేరు. కాదు. ఇది చిన్న పుస్తకం. అందులో చాలా వ్యాసాలు, వివిధ ధార్మిక విషయాల పైన ఉన్నాయి. అన్నిటిలోకి నన్ను ఆకట్టుకున్న వ్యాసం ఒకటే. అది "తిరుపతి వేంకటేశ్వర స్వామి నిజంగా ఎవరు" అన్న విషయం మీద చెలరేగుతున్నా వాదవివాదాల పై రాసినది. రచయిత పేరు గుర్తులేదు. కానీ వ్యాసం మాత్రం చాలా ఆసక్తిదాయకం గా ఉంది.


        మనకు అందరి తెలిసిన కథ ప్రకారం వేంకటేశ్వరుడు తిరుపతి పై వెలవటానికి కారణం ఈ విధంగా ఉంది...         పూర్వం మునులందరు కలియుగంలో లోకకల్యాణం కోసం యాగం చెయ్యాలని సంకల్పించగా, నారదముని అక్కడకు వచ్చి ఆ మునులతో "ఆ యాగఫలాన్ని గ్రహీంచి కలియుగంలో లోకకల్యాణం చెయ్యగలవారెవ్వరు" అని ప్రశ్నించాడు. అప్పుడూ ఆ మునులందరూ అక్కడ ఉన్న భృగు మహర్షిని ప్రార్థించి త్రిమూర్తులలో ఆ యాగఫలం స్వీకరించగల సమర్ధుడిని పరిక్షించమని కోరుకుంటారు.         మునుల కోరికను మన్నించి భృగు మహర్షి త్రిమూర్తులను పరిక్షించే నెపంతో ముందుగా సత్యలోకం చేరుకున్నాడు. అక్కడ సృష్టికర్త బ్రహ్మ సృష్టి కార్యంలో నిమగ్నమై భృగుమహర్షి రాకను గమనించడు. అందుకు కోపించన భృగుమహర్షి "బ్రహ్మకు కలియుగంలో భూలోకంలో ఎక్కడా పూజలుండవని" శపించి అక్కడ నుండి కైలాసం చేరుకుంటాడు.         శివలోకంలో పార్వతీ శివులు ఆనందతాండవం చేస్తూ పరవశిస్తుంటారు. పార్వతీ శివులు భృగు మహర్షి రాకను గ్రహించరు. "తన రాక గ్రహించని శివునకు కలియుగంలో భూలోకంలో విభూతితో మాత్రమే పూజలు జరుగుతాయని" శపిస్తాడు. సత్యలోకంలో, శివలోకంలో తనకు జరిగిన అవమానంతో మండిపడిన భృగుమహర్షి అదే కోపంతో వైకుంఠం చేరుకుంటాడు.         ఇక్కడ నారాయణుడు ఆదిశేషుని మీద శయనిస్తుంటాడు. ఎన్నిసార్లు పిలిచినా పలకలేదని భృగువు, లక్ష్మీ నివాసము అయిన నారాయణుని వామ వక్షస్ధలమును తన కాలితో తంతాడు.

        అప్పుడు శ్రీమహావిష్ణువు తన తల్పం నుండి క్రిందకు దిగి "ఓ మహర్షీ! మీ రాకను గమనించలేదు, క్షమించండి. నా కఠినమైన వక్షస్థలమును తన్ని మీ పాదాలు ఎంత కందిపోయుంటాయో?"అని భృగుమహర్షిని ఆసనం పైన కూర్చుండబెట్టి, అతని పాదాలను తన ఒడిలో పెట్టుకుని పిసకడం మొదలుపెట్టాడు. 


  అలా పిసుకుతూ, మహర్షి అహంకారానికి మూలమైన పాదం క్రింది భాగంలోని కన్నును చిదిమేశాడు. మహర్షి తన తప్పును తెలుసుకొని క్షమాపణ కోరుకొని వెళ్ళిపోయాడు. విష్ణువునే సత్వగుణ సంపూర్ణుడిగా గ్రహించాడు. కానీ, తన నివాసస్థలమైన వక్షస్థలమును తన్నిన కారణంగా లక్ష్మీదేవి అలకపూని భూలోకానికి వెళ్ళిపోయింది. శ్రీమహాలక్ష్మి లేని వైకుంఠంలో ఉండలేని మహావిష్ణువుకూడా లక్ష్మీదేవిని వెదుకుతూ భూలోకానికి పయనం అయ్యాడు.


        అలకపూనిన శ్రీమహాలక్ష్మి, ఈ నాటి కోల్హాపూరి ప్రాంతాన్ని చేరుకొని తపస్సు చేసుకుంటూ ఉండిపోయింది. ఆమెను వెతుకుతూ బయలుదేరిన మహావిష్ణువు, తిరుపతి ప్రాంతం చేరుకుని అలసిపోవటం చేత ఒక పుట్టలో తలదాల్చుకుంటాడు. అతని భాదలు గమనించిన బ్రహ్మా, శివులు ఆవు, గోవు రుపంలో వచ్చి అతనికి పాలు ఇచ్చి సేద తీర్చేవారు.  పై కథ అందరికీ తెలిసినదే ఐనా, మరి ఒకసారి గుర్తు చెయ్యటానికే క్లుప్తంగా చెప్పాను. 

ఇంకా అసలు విషయానికి వస్తే, తిరుమలలో వెలసిన శ్రీవేంకటేశ్వరుడు అసలు విష్ణు రూపం కాదని ఒక సిద్ధాంతం ఉంది. మూలవిరాట్టుకు వెనుక భాగంలో జడ ఉందని అందువలన ఆ విరాట్టు శక్తి రూపమనీ శాక్తేయుల వాద. అందుకు తోడు వేంకటేశ్వరుని "బాలాజీ" అని ఉత్తరాది ప్రజలు పిలవటం కూడా ఉన్నది. ఇది "బాల" రూపం అని వారి వాదన. ఇంకోవిషయం ఏమిటి అంటే, స్వామివారికి జరిగే కొన్ని పూజలు శాక్తేయులు అమ్మవారికి మాత్రమే చేస్తారనీ, అవి విష్ణు సాంప్రదాయంవి కాకపోయినా, ఇంకా ఆచారంలో ఉన్నాయని, దీనిబట్టి ఆ  మూలవిరాట్టు బాలత్రిపుర సుందరి" దే అని వాదన. ఇంకో విషయం గమనించాలిందేమిటి అంటే, జగద్గురు ఆదిశంకరులు ఈ స్థలం దర్శించినప్పుడు, మూలవిరాట్టు పాదాల వద్ద శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారు. విష్ణు పాదాల వద్ద శ్రీ చక్రం ఎందుకు ప్రతిష్టించారు అనేది అనేక సందేహాలకు దారి తీస్తుంది. శిల్పశాస్త్రం ప్రకారం మూలవిరాట్టు విగ్రహం స్త్రీమూర్తి కొలతలకు సరిపోతాయని, వక్షస్థలంని మూసివేస్తూ శ్రీదేవి, భూదేవులను ఉంచారనేది వీరి వాదన.         ఇదే విధంగా శైవులు శ్రీ వేంకటేశ్వరుని శివరూపంగా భావిస్తారు. అందుకు తగిన ఆధారాలు వారు చూపించారు. గుడిపై ఉన్న శిల్పాలలో నంది ఉండటం ఇప్పటికి గమనించవచ్చు. వైష్ణవ ఆలయాలలో ఇది జరగదు. స్వామి పేరులో కూడా ఈశ్వరుడు అని ఉండటం గమనించండి. (వేం= పాపములను కట = తొలగించు ఈశ్వరుడు = దేవుడు, శివుడు?). శివుని మూడవనేత్రం కప్పి ఉంచటానికే పెద్దనామం(తిరునామం) పెట్టారన్నది వీరి వాదన.

 ఈ వివాదాలన్నిటికీ తెరవేస్తూ, మహావైష్ణవుడైన శ్రీ రామానుజులవారు స్వామికి శంఖ చక్రాలను అమర్చి, ఈ క్షేత్రాన్ని శ్రీవైష్ణవ క్షేత్రంగా ప్రకటించారన్నది చారిత్రిక సత్యం.


        ఐతే, ఇప్పటికీ తేలని విషయం ఏమిటి అంటే, వేంకటేశ్వర స్వామి నిజంగా ఏ రూపం అనేది. విష్ణువా? శివుడా? శక్తిరూపమా? ఇంకెవరైనా నా? అఏమో తెలియదు. కాని ఈ వ్యాసం చదవగానే నాకు గుర్తు వచ్చినది"అన్నమయ్య కీర్తన"... 

ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమేనీవు

అంతరాంతరము లెంచి చూడ బిండంతె నిప్పటి అన్నట్లు

కొలుతురు మిము వైష్ణవులూ కురిమితో విష్ణుడని
పలుకుదురూ మిము వేదాంతులు పర బ్రహ్మంబనుచూ
తలతురు మిము శైవులు తగిన భక్తులునూ శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు ఆదిభైరవుడనుచూ

సరి నెన్నుదురు శాక్తేయులును శక్తిరూపు నీవనుచూ
దరిశనములు నిను నానా విధులను తలపుల కొలదుల భజింతురు
శిరుల మిము ఏ అల్ప బుద్ధి తలచిన వారికి అల్పంబగుదువు
దరిమల మిముఏ ఘనమని తలచిన ఘన బుద్దులకు ఘనుడవు

నీవలన కొలతేలేదు మరి నీరుకొలది తామరవు
ఆవల భాగీరధి బావుల ఆజలమే ఊరినయట్లు
శ్రీవేంకటాపతి నీవైతే మము చేకొను ఉన్నదైవము
ఈ వలనే నీ శరణనియెదను ఇదియే పరతత్వము నాకు
        అంటే, అన్నమయ్య కాలానికే ఈ వివాదం ఉండేదని తెలుస్తోంది. నిజానిజాలు ఆ వేంకటేశ్వరునికే తెలియాలి మరి.


Monday, September 12, 2011

నవ దుర్గలు



        మహా శక్తిస్వరూపిణి అయిన దుర్గా మాతని మనం అనేక రూపాలాలో కొలుచుకుంటాము. ఐతే వాటిలో ముఖ్యమైనవి 9 అవతారాలు. వారినే మనం నవదుర్గలని అంటుంటాం.

        దుర్గా మాత ముఖ్యమైన అవతారాలు మూడు. మాహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి. వీరు శ్రీమహావిష్ణువు, పరబ్రహ్మ, పరమశివుని అర్ధాంగినులుగా మనకు తెలుసు. వీరిలో ఒక్కొక్కరూ తిరిగి 3 అవతారాలు పొందారు. ఆ విధంగా నవదుర్గలుగా ప్రసిద్ధి చెందారు.




1. శైలపుత్రి


        నవదుర్గలలో ప్రధమమైన శైలపుత్రి హిమవంతుని పుత్రిక. ఈమెయే వెనుకజన్మలో దక్షప్రజాపతి కుమార్తె సతి. హిమవంతుడు పర్వతరాజు కనుక ఈమెకు శైలపుత్రి అనే పేరు కలిగింది. ఈమె వాహనం నంది. ఒక చేతిలో త్రిశూలం రెండో చేతిలో కలువ, నుదుటిన చంద్ర వంక ధరించిన ఈమె మహిమలు అపారం. నవరాత్రి సంధర్భంగా మొదటిరోజున ఈమె పూజ జరుగుతుంది.


2. బ్రహ్మచారిణి


        దుర్గామాత అవతారాలలో రెండవది అయిన బ్రహ్మచారిణి, తపస్సుకు ప్రతీక. ఇక్కడ బ్రహ్మ అనే పదానికి తపస్సు అని అర్థం. వేదము, తత్వము, తపము అనే పదాలు బ్రహ్మ అనే పదానికి పర్యాయ పదాలుగా వాడుతారు. ఒక చేతిలో కమండలము, మరొక చేతిలో తులసి మాల ధరించే ఈమెను సకల సౌభాగ్యదాయనిగా పూజిస్తారు.


3. చంద్రఘంట


        దుర్గామాత మూడవ అవతారమైన చంద్రఘంట మాత శిరసున అర్ధచంద్రుడిని గంటరూపంలో ధరించింది. అందువలననే ఆమెకి ఈ నామధేయం కలిగింది. సింహవాహిని ఐన ఈమె బంగారు దేహఛాయ కలిగి, పది హస్తాలతో ఉంటుంది. ఈమె పది హస్తాలలో శంఖ, ఖడ్గ, గద, కమండలము, విల్లు, కమలం మొదలైనవి కలిగి చూడటానికి ఎంతో మనోహరంగా ఉంటుంది.


4. కూష్మాండ


        సూర్యలోక నివాసిని అయిన కూష్మాండదేవి, సూర్యకాంతిని పోలిన దేహఛాయతో ఉంటుంది. ఈమె దేహఛ్ఛయతో దశ దిశంతాలు వెలుగు పొందుతాయి. సింహవాహిని ఐన ఈ దేవికి ఎనిమిది హస్తములలో కమండలము, విల్లు, అమ్ము, కమలము, అమృతభాండము, చక్రము, త్రిశులము, జపమాల ఉంటాయి.


5. స్కందమాత


        కుమారస్వామి లేక స్కందుని తల్లి అయిన స్కందమాత మహాదుర్గ ఐదవ అవతారం. చతుర్భుజి ఐన ఈ మాత రెండు చేతులలో కమలములనూ కుడి హస్తమందు స్కందుని ధరించి అభయ హస్తి అయి దర్శనమిస్తుంది. ఈమె పద్మములో కూర్చొని ఉండటం చేత పద్మాసన అనే నామధేయం కూడా ఉంది.


6. కాత్యాయని


        దుర్గామాత ఆరవ అవతారమైన కాత్యాయనిమాతను సకల వరప్రదాయనిగా పూజిస్తారు. శ్రీకృష్ణుని భర్తగా పొందటానికి గోపికలు ఈమెనే ఆరాధించారు. బంగారు మేనిఛాయతో, అత్యంత ప్రకాశవంతమైన ఈమెకు నాలుగు హస్తములు. ఒక చేత కత్తి, రెండవ చేత కమలం, మిగిలిన రెండుచేతులలో అభయప్రదాన ముద్రలో ఉంటుంది. ఈమె వాహనం సింహం.


7. కాళరాత్రి


        దుర్గమాత ఏడవ అవతారం కాళరాత్రి. ఈమె శరీరఛాయ చిమ్మచీకటిలా నల్లగా ఉంటుంది. చెదరిన జుట్టుతో, మెడలో వాసుకొనిన మాల మెరుపులు చిందిస్తూ ఉంటుంది. ఈమెకు మూడు కళ్ళు. ఈమె ఉచ్వాస నిశ్వాసలు అగ్నిని విరజిమ్ముతుంటాయి. ఈమెకు నాలుగు హస్తములు. కుడి రెండు హస్తములలో ఒకటి అభయాన్ని, రెండవది భాయాలని పారదోలేవిగా ఉంటాయి. ఎడమచేతిలో ఒక చిన్న కత్తి, ఇనుముతోచేసిన రంపంలాంటి అయుధం ఉంటుంది. ఈమె వాహనం గాడిద. ఈమె రూపం ఉగ్రమే ఐనా ఈమెని పూజించిన వారికి అన్ని శుభములని కూరుస్తుంది కనుక ఈమెనే శుభంకరి అని కూడా పిలుస్తారు.


8. మహాగౌరి


        దుర్గామాత అష్టమ అవతారం మహాగౌరి. ఈమె చంద్రునిపోలిన మేనిఛాయతో ఉంటుంది. ఈమె పార్వతి రూపంలో ఉన్నప్పుడు, శివునికోసం మహాతపస్సు చేసింది. అప్పుడు ఆమె శరీరఛ్ఛాయ నల్లగా మారిపోయింది. అది గమనించిన మహాశివుడు స్వయంగా ఆమెను పవిత్ర గంగాజలాలతో కడగగా ఆమెకు ఆ మేనిఛ్ఛాయ కలిగిందని ఒక కథ. సర్వకాల సర్వావస్తలలో ఈమెను ఎనిమిది ఏళ్ళ బాలికగానే పూజిస్తారు.
అత్యంత ప్రశాంతమైన స్వరూపం కలిగిన ఈమెకు నాలుగు చేతులు. రెండు చేతులలో త్రిశులం, దమరుకము ధరించి మిగిలన రెండుచేతులతో వర, అభయ ముద్రలతో దర్శనమిస్తుంది. ఈమె వాహనం నంది.


9. సిద్ధిదాత్రి


        దుర్గాదేవి ఆఖరి అవతారమైన ఈమె భక్తులకు అష్టసిద్దులను (అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఇసిత్వ, మరియు వాసిత్వ అనేవి అష్టసిద్ధులు) ప్రసాదించగలిగే దేవత. ఈమె ద్వారానే పరమశివుడు ఈ సిద్ధులని సంపాదించాడని, అర్ధనారీశ్వరుడిగా పేరుపొందాడని దేవీపురాణంలో చెప్పబడింది. కమలంలో కూర్చునే ఈ దేవత వాహనం సింహం. నాలుగు హస్తాలలో శంఖ, చక్ర, గదా, పద్మాలతో విరాజిల్లుతూ భక్తులను అనుగ్రహిస్తుంది.


        ఈ నవదుర్గ ఆరాధనకు యోగపరంగా కూడా అర్థం చెప్పబడింది. అది ఇంకెప్పుడైనా చర్చించుకుందాము.
యాదేవీ సర్వభూతేషు శ్రీరూపేణ సంస్థితా
నమస్తస్యె నమస్తస్యె నమెస్తస్యె నమొ నమః