Saturday, September 24, 2011

అప్పట్లో .......

అప్పట్లో అంటే నా చిన్నప్పుడన్నమాట. అప్పుడు నేను బందరులో ఆరో క్లాసు చదుతుండేవాడిని. బందరు అంటే చాలామందికి తెలుసు అనుకుంటా. దాన్నే మచిలీపట్టణం అనేవారు. ఆ రోజుల ఙ్ఞాపకాలు ఇప్పుడు గుర్తు చేసుకుంటుంటే భలే తమాషాగా ఉంటుంది. ఆ రోజుల్లో మా నాన్న గారు రీసర్చ్ కి అమెరికా వెళ్ళటంతో మేము బందరులో బాబాయిగారింట్లో ఉండి చదువుకునే వారం. మేము అంటే నేను మా అన్నయ్యా, నా ఇద్దరు చెల్లెళ్ళు.

         బందరులో మా బాబాయికి ఒక రేడియో షాపు ఉండేది. పక్కనే మా తాతయ్య గారి గడియారం దుకాణం. రోజూ స్కూలు నుంచి వచ్చాక సాయంత్రం 6 గంటలకల్లా బాబాయి కొట్టుకి వెళ్ళేవాళ్ళం. బందరులో అన్ని మాకు దగ్గరగానే ఉండేవి, అందుకోసం నడిచే వెళ్ళేవాళ్ళం. మా తాతయ్య మాకు రోజుకి ఫది పైసలు ఇచ్చేవాడు. ఆ రోజుల్లో ఫది పైసలంటే చాలా ఎక్కువే. ఫది పైసలకు రెండు గుప్పెళ్ళ సన్నపూసగానీ, బూందీగానీ, బఠాని మసాలా గాని కొనుక్కునే వాళ్ళం. ఆ బఠానీ మసాలా చాలా బాగా చేసేవాడు. బఠాణీలు ఉడకపెట్టి అందులో ఉల్లిపాయలు మొదలైన దినుసులన్ని వేసి, పైన నిమ్మకాయ పిండి చేసేవాడు. తినటానికి వీలుగా ఒక తాటి ఆకు ముక్క ఇచ్చేవాడు. చీకటి పడేదాకా అక్కడే ఉండి మా పిన్నికి ఏదో ఒక టిఫిను ఇంటికి తెచ్చేవాళ్ళం.

         అప్పట్లో త్రివేణి వక్కపొడి (ఇది బందరులోనే చేసేవాళ్ళు) 1 పైసా, 3 పైసలు, 5 పైసలకి దొరికేది. 1 పైసా పొట్లం సన్నని ఉల్లిపొర కాగితంలో కట్టేవారు. పైన త్రివేణి అనిరాసి మూడు కొండల బొమ్మలు కూడా ఉండేవి. భోజనాలు కాగానే మా బాబాయికి పిన్నికి కూడా వక్కపొడి కావాలి. వాళ్ళు వేసుకునేదాన్లో మాకూ ఒక పలుకు ఇస్తూ ఉండేవారు. అలా మాకు వక్కపొడి నమలటం అలవాటైపోయింది. ప్రతి రోజు మాకు సామాన్యం గా ఇదే పద్దతిలో నడీచేది.
ఆదివారం వచ్చిందంటే మాకు పండుగే. ఆ రోజు పొదున్నే లేచి, స్నానం చేసుకొని చద్దెన్నం తినేసి బాబాయి కొట్టుకు వెళ్ళి సామాన్లన్ని సర్దేసేవాళ్ళం. అంతా నీటుగా సర్ది బాబయికి వచ్చి చెప్పేవాళ్ళం. అందుకు మా బాబాయి 50 పైసలు ఇచ్చేవాడు. దాంతో మేము సినిమాకు వెళ్ళేవాళ్ళం. అప్పట్లో బెంచి టికెట్టు 40 పైసలు. 10 పైసలు పెట్టి ఇంటర్వెల్ లో ఏదైనా కొనుక్కుని తినే వాళ్ళం. ఎక్కువగా మేము బుట్టాయి పేటలోని దుర్గా టాకీసుకే వెళ్ళేవాళ్ళం. లోనే ఎన్.టి.ఆర్ సినిమాలు వచ్చేవి. చిక్కడు దొరకడు, కదలడు వదలడు, అగ్గిబరాటా, అగ్గి పిడుగు, పిడుగురాముడు, పాతాళభైరవీ, లాంటి  సినిమాలన్ని అందులోనే చూసాం.ఇకపోతే, పండుగల్లో మా హడావుడి అంతా ఇంతా కాదు. దీపావళి, దసరా అక్కడ బాగా జరిగేవి. దీపావళి బాంబులంటూ ఉంటే అవి తాటాకు టపాకాయలే. ఒక పైసా కి ఒకటి చప్పున ఒక వంద కొనే వాళ్ళం. ఒక తాటాకు చివర మందుపెట్టి పొట్లంలా కట్టి చివరన ఒక వత్తి పెట్టేవాళ్ళు. రెండో చివర మనం చేత్తో పట్టుకుని కాల్చ వచ్చన్న మాట. జువ్వలు కూడా వేసేవాళ్ళం కానీ, మా బాబాయి పిన్ని వెనకాల ఉండి ఒళ్ళు కాల్చుకోకుండా చుసేవారు. కాకర పువ్వొత్తులు, మతాబాలు బోలెడన్ని కాల్చేవాళ్ళం. దీపావళి కావలసినవన్నీ 25 లేక 30 రూపాయల్లో వచ్చేసేవి. అవే ఇప్పుడు కొనాలంటే 1500 పైనే అవుతుంది.
దసరాల్లో మా ఇంట్లో చాలా హడావుడిగా ఉండేది. ఆ ఫది రోజులు మా బాబాయి హోమం వగైరా చేసేవాడు. బందరు నుంచే కాకుండా, తరకటూరు, పెడన మొదలైన పక్క ఊళ్ళవారు కూడా ఆ ఫదిరోజులు వచ్చేవాళ్ళు. మాకు ఫుల్లుగా పనే. బజారుకు వెళ్ళి పూజకి కావాల్సినవన్నీ తేవటం మా పని. బందర్లో కన్యకా పరమేశ్వరి గుడి ఉండేది. నవరాత్రుల్లో అక్కడకూడా బోలెడన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఆ గుడిలో రోజూ పులిహోర, పరమాన్నం ప్రసాదం. భలే రుచిగా ఉండేవి.
దసరాల్లో బందరు ఇంకో స్పెషాలిటి ఏమిటంటే, శక్తిపఠాలు. పెద్ద పెద్ద కాళికా బొమ్మలని తలమీద పెట్టుకొని రాత్రంతా బందరంతా తిరిగే వాళ్ళు. అప్పట్లో దాదా శక్తిపఠం అని వచ్చేది. అది అక్కడి అన్ని శక్తి పఠాలలోకి పెద్దది. చూడటానికి భయంకరంగా ఉండేది. హటాత్తుగా ఎదురు వెళ్తే భయంతో నెత్తురు కక్కుకుని చస్తారని ఒక వదంతి కూడా ఉండేది. నేను చాలా సార్లే చూసాలేండి. ఇవి కాకుండ పులి డాన్సులవాళ్ళు, అఘోరాలు కూడా వచ్చేవాళ్ళు. అఘోరాలు నల్లని బట్టలు వేసుకుని ఒక చేతిలో పుర్రె పట్టుకుని తిరిగే వాళ్ళు.

దసరాల్లో మా స్కూలు మాష్టారులతో కలిసి అందరిళ్ళకి వెళ్ళేవాళ్ళం. 

" అయ్యవారికి చాలు ఐదు వరహాలు
పిల్లగాళ్ళకు చాలు పప్పు బెల్లాలు"
         అని పాడుకుంటూ. మొత్తం పాట ఇప్పుడు గుర్తులేదు.


         ఇక మా ఆటలు. కర్రా బిళ్ళ, అష్టాచెమ్మా, వామనగుంటలు, మొదలైనవే. క్రికెట్టు లాంటి ఆటలు నాకు అప్పట్లో తెలిసేది కాదు.
 ఏమిటో ఆ రోజులన్నీ ఇప్పట్లో ఉన్న సాధనాలు లేకపోయినా భలే సరదాగా గడిచిపోయాయి. ఒక పైసాకి కూడా చాల విలువ ఉండేది. ఒక పైసాకి మరమరాల ఉండ, సెనగపప్పుల ఉండ వచ్చేవి. ఒక పైసాకి మూడు నిమ్మ తొనల బిళ్ళలు, 5 పైసలకి ప్యారీ (ఆకుపచ్చ కాగితంతో) చాకలెట్టు, వచ్చేది. గోంగూర పచ్చడిలోకి ఉల్లిపాయలేకపోతే పరిగెట్టుకుంటు సందు చివర నవీన కొట్టుకి వెళ్ళి అడిగితే ఊరికే ఇచ్చేవాడు.

         ఇలా రాసుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. నాకు తెలుసు ఇది చదువుతుంటే మీకు కూడా మీ చిన్నప్పటి సంగతులు గుర్తుకు వస్తాయని. 

         మళ్ళీ ఆ రోజులు ఇంక రావు.  మనం చిన్నప్పడు నేర్చుకున్న ఆచారాలు, అనుభవాలూ, సంస్కృతి మన పిల్లలకు ఎంతవరకు అందిస్తున్నాము ? అని ఒక సారి నాకే అనిపిస్తుంది. అందుకే నేను ప్రతి పండుగకీ విధిగా చేయ్యాల్సినవన్నీ చేస్తుంటాను. వారికి కూడా ఎలా చెయ్యాలో చెప్పి చేయిస్తుంటాను. ఇదేకదా మనం మన తరువాతి తరానికి అందించే సంస్కారం. ఏమంటారు?

3 comments:

వనజ వనమాలి said...

mee jnaapakaalu baagunnaayi.nijamgaane naa baalyam loki velli.. alaa chuttesukuni vacchaanu. Thank you very much.

'భావన' కై తపన (4 feeling) said...

నాకు మన మచిలిపట్టణం మళ్ళి గుర్తు కొచ్చింధి దేవరకొండ సుబ్రమణ్యం గారు

miss my MTM :(

Machilipatnam said...

సర్ సుబ్రహ్మణ్యం గారు మీ చిన్ననాటి సంగతులు చాలా బాగా చెప్పారు... చదువుతుంటే నేను మీతోపాటుగా అక్కడే వున్నట్టు అనిపించింది ....