Tuesday, September 10, 2013

మా చుట్టాలే

అప్పుడెప్పుడో ఒకసారి హైదరాబాదు వెళ్ళినప్పుడు (అదేలేండి ఈమద్య 3 నెలలక్రితం) అలా కోటికి వెళ్ళా. అలా విశాలాంధ్రా కి వెళ్ళి అక్కడనుంచి ఆంధ్రాబ్యాంకు మీదిగా కోటి హాస్పిటల్ దగ్గరకువచ్చి అక్కడే ఉన్న పుస్తకాలు అమ్మే షాపులోకి దూరా. అవి ఇవి చూస్తూ అక్కడే ఉన్న మేడం ని శతకాలమీద ఏమైనా పుస్తకాలు ఉన్నాయా అని అడిగాను. ఆపక్కనే ఉన్నాయి అంటు చూపించారు. అక్కడున్నవి చూసి "ఇవన్నీ నాదగ్గర ఉన్నాయండి. వావిళ్ళ వారు "భక్తిరస శతకసంపుటము" అని 5 సంపుటాలు ప్రచురించారు వాటికోసం వెతుకుతున్నా" అన్నాను. "లేవండి. మేరొకపనిచేయండి. ఇంటర్నెట్లో మీకు దొరుతాయి. మీకు సైట్ పేరు ఇస్తాను అన్నాను" అన్నారు
అహా అనుకుని "చెప్పండి" అన్నాను
SatakasAhityaM.blogspot.com అని ఒక కాగితం మీద వ్రాసి ఇచ్చి ఇందులో చూడండి దొరుకుతాయి. ఈ సైట్ మాచుట్టాలదే. సుబ్రమణ్యం గారని" అంటు చెప్పుకొచ్చారు.
"ఒహో అలాగా. ఎక్కడుంటారు " అని అడిగా.
"హైదరాబాదే" అన్నారు ధీమాగా.
" చూస్తానండి. ధన్యవాదములు. ఈలోగా ఏమైనా శతకాల పుస్తకాలు వస్తే కొంచం ఇన్ఫార్మ్ చేస్తారా "
"మీ పేరు మైయిల్ ఇవ్వండి చెప్తా "అన్నారు ఆమె
వ్రాసిచ్చాను. "ఒహో మీ పేరుకూడ సుబ్రమణ్యమేనా" అన్నారు.
" అవునండి మీరు చెప్పిన ఆ చుట్టాన్ని నేనే మరి" అంటు బయటకు కదిలాను.
(ఇది నిజంగా జరిగిన సంఘటన. నాకుతెలియని ఈ కొత్త చుట్టం ఎవరబ్బా అని కాసేపు మైండు బ్లాకైన మాట వాస్తవం)

Wednesday, April 10, 2013

ఉగాది - విశేషాలు

ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఉదయాన లేచి తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. దేవస్థానములకు వెళ్ళి పూజలు చేయిస్తారు. కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు. 

        ఈ పండగ ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడి పడ్వా గానూ, తమిళులు పుత్తాండుఅనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు. 

        ఉగాది ప్రాముఖ్యం: 

        చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొక గాధ. 

        "ఉగాది", మరియు "యుగాది" అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. "ఉగ" అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి 'ఆది' 'ఉగాది'. అంటే సృష్టి ఆరంభమైన దినమే "ఉగాది". 'యుగము' అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది. "తత్రచైత్రశుక్ల ప్రతిపదిసంవత్సరారంభ:" - చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది 'ఉగాది' గా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొనియున్నాడు. 

 సంప్రదాయాలు: 

        ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథినాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. నిర్ణయ సింధు ధర్మ సింధులలో దీనికి సంబంధించిన ప్రమాణాలు కనుపిస్తున్నాయి. ఉగాదిరోజు
1. తైలాభ్యంగనం
2. నూతన సంవత్సరాది స్తోత్రం
3. నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం)
4. ధ్వజారోహణం (పూర్ణకుంభదానం)
5. పంచాంగ శ్రవణం
        మున్నగు 'పంచకృత్య నిర్వహణ' గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం. మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారం. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితి. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు. మనకు తెలుగు సంవత్సరాలు 'ప్రభవ' తో మొదలుపెట్టి 'అక్షయ' నామ సంవత్సరము వరకు గల 60సంవత్సరములలో మానవులు తాము జన్మించిన నామ సంవత్సరాన్ని వారి జన్మాంతర సుకృతాలనుబట్టి జీవితంలో ఒక్కసారో, రెండుసార్లో చుస్తూంటారు! అందువల్లనే వారు జన్మించిన 60 సంవత్సరములకు తిరిగి ఆ నామ సంవత్సరం వచ్చినపుడు, అది ఒక పర్వదినంగా భావించి 'షష్టిపూర్తి' ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు. 

        పూజాదులు: 

        అన్ని పండుగలలాగానే ఉగాది పండుగనాడు ఉదయానే తలస్నానం చేసి క్రొత్త బట్టలు ధరించి పూజ చేసుకొంటారు. అయితే ప్రత్యేకంగా ఫలాని దేవుడి పూజ అని ఏమీ చెప్పబడలేదు గనుక ఈ రోజు ఇష్ట దేవతాపూజ చేసుకొంటారు. ఆ తర్వాత ఏమీ తినకముందే ఉగాది పచ్చడిని తింటారు. 

        ఉగాది పచ్చడి: 

        "ఉగాది పచ్చడి" ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన ఒక తిను పదార్ధం. ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సండేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. 


  ఉగాది పచ్చడికి మనశాస్త్రాలలో"నింబ కుసుమ భక్షణం" మరియు"అశోకకళికా ప్రాశనం" అని వ్యవహరించేవారు. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది అంటారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
త్వామష్ఠ శోక నరాభీష్ట
మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం
మమ శోకం సదా కురు
        ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉగాది పచ్చడి చేసే ఆచారం ఆహారంలో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాక పండుగలకు, ఆచారాలకు, సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటిచెప్తుంది. 

        ఉగాది రోజున తినే పచ్చడిలో కొత్త చింతపండు, లేత మామిడి చిగుళ్ళు, అశోక వృక్షం చిగుళ్ళు, కొత్తబెల్లం, వేపపూత, మామిడి కాయముక్కలు, చెరుకు ముక్కలు, జీలకర్రలాంటివి ఉపయోగించాలి. ఈ పచ్చడి శారీరిక ఆరోగ్యానికి కూడా ఎంతో శ్రేష్ఠమని ఆయుర్వేదశాస్త్రం పేర్కొంటోంది. ఈ పచ్చడిని ఖాళీ పొట్టతో తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మంచిదంటారు. వేపపూత పచ్చడికి శాస్త్రంలో నింబకుసుమ భక్షణం అని పేరుంది. సంవత్సరమంతా అనారోగ్యం లేకుండా హాయిగా ఉండేందుకు ఈ పచ్చడి ఉపకరిస్తుందని వైద్యులు చెప్పేమాట అయితే ఒక్కపూట తింటేనే అంతఫలితం వస్తుందా అని కొందరంటారు. కానీ ఈ వేపపూత పచ్చడిని సేవించటం చైత్రశుక్ల పాడ్యమి నుండి పూర్ణిమ వరకు కానీ లేదా కనీసం ఉగాది పండుగ నుండి తొమ్మిది రోజుల పాటైనా వసంత నవరాత్రుల వరకూ అయినా సేవించాలి. అలా సేవిస్తే వాత, పిత్త, శ్లేష్మాలవల్ల ఏర్పడే దోషాలు హరిస్తాయి. కాలక్రమంలో ఉగాది పచ్చడిలో లేత మామిడి చిగుళ్ళు అనేక చిగుళ్లు, ఇలాంటివన్నీ మానేసి కేవలం వేపపూత, బెల్లం ముక్కలను మాత్రమే ఉపయోగించటం కనిపిస్తుంది. పూర్వం లేతవేప చిగుళ్ళు ఇంగువ పొంగించి బెల్లం, సైంధవల వణం కలిపి కొద్దిగా నూరి చింతపండు, తాటిబెల్లంకానీ, పటికబెల్లంకానీ, వాము, జీలకర్ర మంచిపసుపు కలిపి నూరేవారు. ఈ మిశ్రమాన్ని అరతులం వంతున ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఉగాది నుండి తొమ్మిది రోజులుకానీ, పదిహేను రోజులుకానీ వీలును బట్టి సేవించేవారు. ఈ పద్ధతంతా చాలామంది మరచిపోయారు. ఉగాది పచ్చడితిన్న తరువాత శాస్త్ర విధిగా ఉగాది పండుగను జరుపుకునేవారు పూర్ణకుంభ లేక ధర్మ కుంభ దానాన్ని చేస్తుంటారు. ఈ ధర్మ కుంభ దానంవల్ల సంవత్సరం మంతా కోరిన కోరికలు తీరుతాయన్నది నమ్మకం. 


  ఉగాది ప్రసాదం: 

        ఉగాది రోజున దేవునికి నైవేద్యం పెట్టవలసిన ప్రశాదంలో ముఖ్యంగా పానకం, వడపప్పు చోటు చేసుకుంటాయి. ఉగాదితో వేసవి ఆరంభం అవుతుంది కనుక వేసవి తాపం తట్టుకోవడానికి పానకం లాంటి నీరాహారం తినడం ఆవసరాన్నిఇది గుర్తు చేస్తుంది, అలాగే వడపప్పు కూడా వడ పప్పు లో వాడే పెసరపప్పు చలవచేస్తుం కనుక వేసవిలో కలిగే అవస్థలను ఇది కొంత తగ్గిస్తుంది. ఇలాంటి ఆహారాన్ని ఉగాది రోజునే కాక ఈ ఋతువు మొత్తం తీసుకోవాలన్న సూచన ఈ ఆచారంలో నిబిడీకృతమై ఉంది. ఉగాదికి విసన కర్రలను పంచే ఆచారం ఉంది. ప్రస్థుత కాలంలో ఉన్న పంఖా లాంటి, ఏసీ మరియు ఎయిర్ కూలరు లాంటి వసతులు లేనికాలంలో వేసవిలో సంభవించే గాలి లేమిని విసనకర్రాలు కొంత తీరుస్తాయి కనుక ఈ ఆచారం ఉగాదితో ప్రారంభం అవుతుంది. 

        పంచాంగ శ్రవణం: 

        కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు. పంచాంగ శ్రవణంలో తిథి,వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగాస్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలంటారు. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండబోతున్నాయి ? ఏరువాక ఎలా సాగాలి ? లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి అదో మార్గంగా ఉండేది. 

        నిత్య వ్యవహారాల కోసం ఈనాడు అందరూ ఇంగ్లీషు క్యాలెండర్ అయిన "గ్రిగేరియన్ క్యాలెండరు" ను ఉపయోగిస్తూ వున్నా... శుభకార్యాలు, పూజా పునస్కారాలు, పితృదేవతారాధన వంటి విషయాలకు వచ్చేటప్పటికి "పంచాంగము" ను వాడుతుంటారు. ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి, మళ్ళీ సంవత్సరం ఉగాది ముందురోజు వరకు అమలులో ఉంటుంది. అటువంటి పంచాంగమును ఉగాదినాడు వివిధ దేవతలతోపాటు పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా 'పంచాంగ శ్రవణం' ఉగాది విధుల్లో ఒకటి. ఈనాడు గ్రామాలు మొదలుకొని పెద్ద పెద్ద నగరాల వరకూ అన్నిచోట్లా పంచాంగ శ్రవణం నిర్వహించడం చూస్తూనే ఉన్నాము. కాగా ప్రస్తుతం పంచాంగాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇలా పూర్వం లభించేవికాదు. తాటాకుల మీద వ్రాయబడేవి కనుక పండితులవద్ద మాత్రమే ఉండేవి. కనుక వారు ఉగాదినాడు సంవత్సర ఫలాలను అందరికీ తెలియజేస్తారు. 

 ఈ విధముగా పంచాంగ శ్రవణం ఆచారమైనట్లు పండితుల అభిప్రాయం. "పంచాంగం" అంటే అయిదు అంగములు అని అర్ధం. తిధి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనేవి ఆ అయిదు అంగాలు. 15 తిధులు, 7 వారాలు, 27 నక్షత్రములు, 27 యోగములు, 11 కరణములు వున్నాయి. వీటన్నిటినీ తెలిపేదే "పంచాంగం".పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు.అంటే నవనాయకులను తెలుసుకుని వారిద్వారా ఫలాలను అంచనా వేస్తారు. సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ సంవత్సర నవ నాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి.
1. రాజు - చాంద్రమాన సంవత్సర ప్రారంభదిన వారాలకి అధిపతి ఆ సంవత్సరానికి రాజు.
2. మంత్రి - 
సౌరమాన సంవత్సర ప్రారంభదిన వారానికి అధిపతి ఆ సంవత్సరానికి రాజు.
3. సేనాధిపతి - 
సూర్యుడు సింహరాశికి ప్రవేశించేనాటి వారానికి అధిపతి.
4. సస్యాధిపతి - 
సూర్యుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశించేనాటి వారానికి అధిపతి.
-:వివిధ ఉగాదులు:-

        గుడి పడ్వా: 

        తెలుగువారిలానే చాంద్రమానాన్ని అనుసరించే మరాఠీలు కూడా ఉగాది చైత్రశుద్ధ పాడ్యమి నాడే వస్తుంది. వారి సంవత్సరాదిని 'గుడి పడ్వా' గా (పడ్వా అంటే పాడ్యమి) వ్యవహరిస్తారు. మన ఉగాదిపచ్చడి లాంటిదే తయారుచేసి దానికి అదనంగా వాము చేర్చి ఆరగిస్తారు. బ్రహ్మదేవుడు ఆ రోజున సృష్టి ఆరంభించినందుకు గుర్తుగా ఆయన పేరున బ్రహ్మధ్వజం నిలుపుతారు. వెదురుపుల్లకు పట్టువస్త్రం కప్పి, పూలతో అలంకరించి పైన వెండి లేదా కంచు పాత్రలు బోర్లిస్తారు. గుడి పడ్వా రోజు ఈ బ్రహ్మధ్వజాలను తప్పనిసరిగా ప్రతిష్ఠిస్తారు. 

        పుత్తాండు: 

        తమిళుల ఉగాదిని (తమిళ) పుత్తాండు అంటారు. ఒకప్పుడు తమిళుల ఉగాది కూడా తెలుగు వారిలానే ఏప్రిల్ లో వచ్చేది. డీ.ఎం.కే. ప్రభుత్వం దీన్ని ఆర్యుల పండుగగా భావించి జనవరిలో జరిగే సంక్రాంతి సమయంలోనే ఉగాదివేడుకలు కూడా జరుపుకోవాలని అసెంబ్లీలో చట్టం చేసింది. ఏప్రిల్ లో వచ్చే ఉగాదిరోజును "చిత్తిరై తిరునాళ్" (చైత్ర తిరునాళ్లు) గా జరుపుకోవాలని ప్రకటించింది. ఆ చట్టం ప్రకారం ప్రస్తుతం తమిళుల ఉగాది వారి పంచాంగం ప్రకారం తై మాసం(జనవరి)లో వస్తుంది. సంప్రదాయబద్ధంగా వచ్చే పుత్తాండు నాడు తమిళులు ప్రత్యేకంగా ఆచరించే విధులేవీ లేవు. ఆరోజున ప్రత్యేక పూజలు చేస్తారు. నవకాయపిండివంటలతో విందుభోజనాలు ఆరగిస్తారు. పంచాంగ శ్రవణం మాత్రం తెలుగువారిలాగానే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పందాలు జరుగుతాయి. 

        విషు: 

        మలయాళీల సంవత్సరాదిని 'విషు' గా వ్యవహరిస్తారు. సౌరమానం ప్రకారం చేస్తారు కాబట్టి వీరి ఉగాది ఏప్రిల్ మధ్యలోనే వస్తుంది. పండుగ ముందురోజు రాత్రి ఇంట్లోని మహిళల్లో పెద్దవయస్కురాలు పచ్చిబియ్యం, కొత్తబట్టలు, బంగారు-పసుపు వన్నెలో ఉండే దోసకాయలు, అరటిపళ్లు, తమలపాకులు, అద్దం... వీటన్నిటినీ ఉరళి అనే పాత్రలో పెట్టి పూజగదిలో దేవుడి దగ్గర ఉంచుతారు. వాటన్నిటినీ ఉంచిన పాత్రను విషుకని అంటారు. మర్నాడు ఆమే ముందులేచి వయసుల వారీగా ఇంట్లో అందర్నీ నిద్రలేపి వారి కళ్లు మూసి ఆ పాత్ర దగ్గరకు తీసుకొచ్చి అప్పుడు కళ్లు తెరవమంటారు. ఆరోజు ఉదయాన్నే లేవగానే మంగళకరమైన 'విషుకని' ని చూస్తే అంతా శుభమే జరుగుతుందని నమ్మకం. 


    వైశాఖీ: 

        సిక్కుల కాలమానం ప్రకారం వైశాఖ శుద్ధ పాడ్యమి వారి సంవత్సరాది. సౌరమానం ప్రకారం ఇది ఏటా ఏప్రిల్ 13న, ముపైశ్ఫఆరు సంవత్సరాలకొకసారి ఏప్రిల్ 14న వస్తుంది. తెలుగువారి సంక్రాంతి లాగా ఇది వారికి పంటల పండుగ. రబీ పంట నూర్పిడి సమయం. సిరులు పొంగే ఆ సమయంలో సిక్కుల మనసులు ఆనందంతో నిండిపోతాయి. ఆ ఉత్సాహంలో స్త్రీపురుషులంతా కలిసి "భాంగ్రా, గిద్దా నృత్యాలు చేస్తారు. కొత్తగా పండిన గోధుమలను పట్టించి ఆ పిండితో రొట్టెలు చేసి బెల్లం, నెయ్యి కలిపి ఆరగిస్తారు. పెద్దపెద్ద మంటలు వేసి వాటిచుట్టూ ఆడిపాడతారు. 

        పొయ్ లా బైశాఖ్: 

        బెంగాలీయుల నూతన సంవత్సరం వైశాఖమాసంతో మొదలవుతుంది. వారి కాలమానం ప్రకారం చైత్రం ఏడాదిలో చివరిమాసం. వైశాఖశుద్ధ పాడ్యమినాడు ఉగాది వేడుకలు చేసుకుంటారు వారు. ఆరోజు ఉదయాన్నే స్త్రీపురుషులు సంప్రదాయ బెంగాలీ దుస్తులు ధరించి "ప్రభాత్ ఫేరీ" పేరిట నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఇంటిముందు రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దుతారు. వ్యాపారులు ఆ రోజున పాత ఖాతాపుస్తకాలన్నింటినీ మూసేసి సరికొత్త పుస్తకాలు తెరుస్తారు. తమ దుకాణానికి వచ్చిన వినియోగదారులకు మిఠాయిలు పంచుతారు. ఏవైనా బాకీలుంటే ముందురోజే తీర్చేస్తారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆరోజంతా ఆనందంగా ఉండడానికే ప్రయత్నిస్తారు. కొత్తవ్యాపారాలు, కొత్తపనులు ప్రారంభిస్తారు. 

-:విశేషాలు:-

  • ఈ పండుగ తెలుగు వారికి తెలుగు సంవత్సరము ప్రకారముగా తొలి పండుగ.

  • ఈ పండుగ ప్రతీ సంవత్సరము చైత్ర శుద్ధ పాడ్యమి రోజున వస్తుంది.

  • ఈ రోజు ప్రతి ఊరిలో దేవాలయాలలో, కూడళ్ళలో, సాంసృతిక సంస్థలలో ఆ సంవత్సరం అంతటా జరిగే మార్పులు, వార ఫలితాలతో పంచాంగ శ్రవణం జరుగుతుంది.

  • ఈ రోజు ప్రతి వారు కొత్తగా పనులు మొదలు పెట్టడం, కొత్తగా కార్యక్రమాలు ప్రారంభించడం చేస్తారు.

  • ఈ పండుగను యుగాది (యుగ+ఆది) అని కూడా అంటారు.

  • తమిళులు మేష సంక్రాంతి మొదటి రోజు ఉగాది జరుపుకుంటారు.

  • కృతయుగంలో కార్తికశుద్ధ అష్టమి రోజు ఉగాది జరుపుకునేవారు.

  • త్రేతా యుగంలో వైశాఖ శుద్ధ తదియ రోజు ఉగాది జరుకునేవారు.

  • ద్వాపరయుగంలో మాఘశుద్ధ అమావాస్య రోజు ఉగాది జరుపుకునే వారు.

  • శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తులైంది చైత్ర శుద్ధ పాడ్యమి రోజే.

  • వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసింది చైత్ర శుద్ధ పాడ్యమి రోజే.

  • కొత్త లెక్కలు ఆరంభించే రోజు ఉగాది.

  • పంచాంగ శ్రవణం చేసేరోజు ఉగాది.



మిత్రులందరికి శ్రీవిజయ నామ సంవత్సర ఉగాది శుభాకంక్షలతో...
(తెలుగు వికీపేడియా నుండి  సేకరణ.)



Friday, November 30, 2012

చిత్రం - భళారే విచిత్రం


నిన్నసాయంత్రం టి.వి న్యూస్ లో ఒక వార్త.

కూతురికి మొహం మీద కాల్చి వాతలుపెట్టిన కన్నతల్లి. కారణం 10 రూపాయలు తీసిందని అనుమానం. నిజమే ఆపిల్ల కి మొహం నిండా కాలిన మచ్చలున్నాయి. ఒంటి నిండా దెబ్బల గుర్తులు. పిల్ల వయసుకూడా ఎక్కువలేదు. మహా ఐతే తొమ్మిదో పదో ఉంటాయి. భాద అనిపించింది. దానికితోడు టి.వి. వాళ్ళుకూడా వాళ్ళ ఓపికకొద్ది ఆ తల్లిని తిట్టి మరీచూపించారు. నిజమే పిల్లలపై ఇలాంటి అగాయిత్యాలు చాలా భాదాకరం. తప్పక ఖండించాలి. ఖండిస్తున్నాను కూడా.

ఈరోజు ఉదయం ఒక వార్త విని నిజంగానే మూర్చవచ్చినంత పని అయ్యింది. ఒక పిల్లవాడి తల్లితండ్రులు వాడు సరిగా చదవటం లేదని మందలించారుట. వాడు పెద్ద వయసువాడు కాదు. పెద్ద క్లాసులూ కావు. అల్లరి చిల్లర పనులు చేస్తు తిరగకు అని మందలించినందుకు పిల్లవాడు అలిగి సరాసరి పోలీసు ష్టేషనుకి వెళ్ళి వాళ్ళమీద కంప్లయింటు చేసాడుట. నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి.

స్కూలులో టీచర్లు మందలించకూడదు, ఇంట్లో తల్లితండ్రులు చెప్పకూడదు. ఇంక మనపిల్లల భవిష్యత్తు ఏమిటో దేవుడా. ప్రతి విషయమూ అతిగానే ఉంటున్నాయి. అటు టీచర్ల దండనలు, ఇటు తల్లితండ్రుల ఆత్రం, ఎక్కదికి వెల్తున్నాము మనం? నా చిన్నప్పుడు ఇలా ఉండేది కాదు. మీ సంగతీ అంతేనా??

Monday, May 21, 2012

బందరు -- నీ పాత పేరేమిటి?

ఈమధ్య ఆరుద్రగారి వ్యాస సంపుటిలో ఒక ఆసక్తికరమైన వ్యాసం చదివాను. ఆసక్తి కరమైనది అని ఎందుకన్నాను అంటే ఆయన లేవనెత్తిన ప్రశ్న అలాటిది. ' బందరు ప్రాచీననామం ఏమిటి? " అనేది ఆవ్యాసం సారాంశం.   అవ్యాసానికి సంభందించిన సంగతులు ఆసక్తి కలవారితో పంచుకుందాం అన్నదే ఈ చిన్న పోష్టు ముఖ్యోద్దేశం.

ప్రాచీనకాలంలో మనదేశానికి అనేకమంది యాత్రికులు వచ్చి వారి అనుభవాలు వారు చూసిన వివిధ ప్రదేశాలు మొదలైనవి గ్రందస్థం చేసారు. అలాంటి వారిలో ప్లవి టోలెమీ అనేవారలు ప్రాగాంధ్ర తీరంలోని
కొన్ని ప్రదేశాలు వారి రచనలలో పేర్కొన్నారు, వాటిలో ' కొంటికపిల ' ' కోడూర ' మైసోలియా అన్నవి కొన్ని పేర్లు. తరువాతి కాలంలో కొంటికపిల అంటే ఘంటసాల గా, కోడూర అంటే బందరు దగ్గరి గూడూరుగా చరిత్ర కారులు గుర్తించారు. అయితే మైసోలియా అంటే ఇంతవరకు ఇతిమిద్దంగా ఏదీ అనేది ఇంతవరకు ఎవ్వరు నిర్ధారించ లేకపోతున్నారు. కొంతమంది మైసోలియా అంటే మచిలీపట్నమే అని వాదిస్తున్నా అది తప్పనే భావనే చాలామందికి ఉంది. కారణం టోలెమీ క్రీ.శ. 2 శతాబ్ధి వాడు. అప్పటికి మచిలీపట్నం లేదు కాబట్టి మైసోలియా బందరు కావటానికి వీలు లేదని కొంతమంది వాదన.

మళ్ళీ మొదటికి వచ్చాం. అసలు బందరు ప్రాచీన నామం ఏమిటి?? ఎన్నో కథలు చెప్తారు. బంధుడు అనే చేపలవాడు పట్టిన గొప్ప మత్యం వలన ఆ వూరికి మచిలీ బందరు అనే పేరు వచ్చిందని, మత్యపురి, బృందావనం అనే పేర్లు కూడా ఇదివరలో బందరుకు ఉన్నాయని అ కధలలలో కొన్ని. బందరుకు దగ్గరలో ఉన్న ఘంటసాల, గూడూరు మాత్రమే ప్రాచీన పట్టణాలు కానీ బందరు ప్రాచీనం కాదని వాదించే వాళ్ళు ఉన్నారు.

పదునాలుగో శతాబ్దంకి ముందు బందరు లేదనేవాళ్ళున్నారు. కారణం అప్పటికి దొరికిన శాసనములు. గార్డెన్ మెకంజీ వ్రాసిన ప్రకారం, మొట్టమొదటిసారిగా మచిలీపట్నం అనేపేరు ఆ ఊళ్ళోకట్టిన ఒక మసీదులోని శాసనంలో కనపడిందట. ఆ శాసనకాలం 1425. అంతకుముందు వంద సంవత్సరాల పూర్వం అరబ్బు ఓడవర్తకులు మచిలీపట్నాన్ని వలసగా నిర్మించారని మెకంజీ కధనం. అరబ్బు వర్తకులు రావటనికి పూర్వం ఆగ్రామం చేపల రేవేకానీ వ్యాపార కేంద్రం కాదు. అయితే 1397 నాటికే బందరులో దేవాలయాలు ఉన్నాయి. వాటి గోడలమీద శాసనాలు ఉన్నాయి. ఐతే వాటి సంగతి ఎవ్వరూ పట్టించుకోవటం లేదు.

బందరులో రామలింగేశ్వర స్వామి ఆలయంలో, రంగనాథ స్వామి ఆలయంలో ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో శాసనాలున్నాయి.

ఏకాంబరేశ్వరస్వామి ఆలయంలో గర్భాలయ ద్వారంకి ఇరువైపులా రెండు శాసనాలున్నాయి. అందులో కుడిప్రక్కన శాసనం క్రీ.శ. 1370 నాటిది. ఈ శాసనంలో, మొదటిసారి ' కడలిపురం ' అనే పేరు కనబడుతుంది. ఎడమవైపు శాసనం క్రీ.శ 1395 నాటిది. ఇందులో కూడా ' కడలిపురం ' అనే నామం కనబడుతుంది. బందరు కడలి (సముద్రం) తీరాన్న ఉందికాబట్టి కడలి పురం ఇవి రెండు ఒకటే కావొచ్చు.

ఐతే ఆంధ్రప్రదేష్ హిస్టరీ కాంగ్రస్ అనే సమావేశంలో ఇంగువ కార్తికేయ శర్మ గారు, బందరు ప్రాచీన నామం ' ముచిలింద నగరం ' అని నిర్ణయించారు. కారణం సింహళ బౌద్ధ గ్రంధాలలో ముచిలింద నగరం ప్రసక్తి ఉన్నది. ముచిలిందందుడు బుద్ధుడిని గాలివాన నుంచి రక్షించిన ఘట్టం చాలాప్రాముఖ్యం చెందింది. ఆ ముచిలిందుని పేర ముచిలింద నగరంగా ఏర్పడి కాలక్రమేణా మచిలిపట్నం గా మారిందా? ఎమో ఈ సంగతులని నిర్ధారించటానికి ప్రమాణాలు వెదకాలి. శాసనాలను త్రవ్వి తీయాలి.  కష్టపడాలి.

ఇంతకీ ఓ బందరూ నీ పాత పేరేమిటీ?
ముచిలింద నగరమా?, కడలిపురి ఆ? బందరు మచిలి ఆ? లేక ఇంకేదైనా నా?


Sunday, January 8, 2012

గాలిపటం... గాలిపటం

సంక్రాంతి వచ్చేసింది. ఆడవాళ్ళంతా పొద్దున్నే లేచి రాత్రి కష్టపడి ప్రాక్టిసు చేసిన ముగ్గులు వేస్తున్నారు. పిల్లకాయలు తము కొనుక్కున్న గాలి పటాలన్ని లెక్కలుచూసుకుంటున్నారు. ఎవరిదగ్గర ఎంత మాంజా ఉందో, అది సరిపోతుందో లేదో, ఒకవేళ కొత్త మంజా కావాలంటే ఏ షాపు నుంచి తెచ్చుకోవాలో అని ఆలోచనలలో ఉన్నారు. మా ఆవిడ ఇచ్చిన వేడి కాఫీ తాగుతు పేపరు పట్టుకుని మధ్య మధ్యలో వాళ్ళ హడావుడి చూస్తు నేను. ఇల్లంతా పిల్లలతో వాళ్ళ ఫ్రండ్స్ తో కోలాహలంగా ఉంది. వాళ్ళ హడావుడి చూస్తుంటే ఎదో యుద్ధానికి వెళ్ళే సైన్యం లా అనిపించింది.


        "   అవును మరి ఇది ఒకరకమైన యుద్ధమే కదా " అనుకున్నా మనసులో.

        ఒక్కసారి మనసులో నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. ఆ రోజుల్లో సంక్రాంతి అంటే ఎంత హడావుడి చేసేవాళ్ళమో. అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలావరకు తగ్గిపోయింది అనిపించింది. "ధరలు బాబూ, ధరలు" అనుకున్నా నాకు నేనే నచ్చచెప్పుకున్నట్లు. ఇప్పటివాళ్ళకు ఆనాటి గాలిపటాల పేర్లైనా సరిగా తెలుసో లేదో. పతంగులు అనేవాళ్ళు.

        ఎన్ని రాకాల పేర్లు ఉండేవి? సరిగా గుర్తులేవు. నమందార్, జీబా, లంగోటి, గుడ్లందార్, బనియందార్, గుడ్డి లంగోటి, గిల్లోరాడప్పన్, డోరేదార్, అద్దా, ఇవి కొన్ని గుర్తున్నాయి. హ హ భలే పేర్లు. నామందార్ అన్నా జీబా అన్నా ఒకటే. పతంగి పైన ఒక నామం ఉంటుంది. లంగోటి అంటే పతంగి అడుగున ఒక చిన్న గౌనులాగా, గుడ్లందార్ అంటే రెండు కళ్ళు, బనియందార్ అంటే చారల పతంగి, గుడ్డి లంగోటి అంటే ఒంటికన్ను, కింద గౌను. గిల్లోరాడప్పన్ అంటే సరిగా గుర్తులేదు. దోరేదార్ అంటే పతంగి చుట్టురా కాగితానికి దారం పెట్టేవారు. అద్దా అంటే పెద్ద గాలిపటం.

        సంక్రాంతికి ఒక్కొక్కళ్ళకి పది రూపాయలు ఇచ్చేవారు నాన్న. నేను మా అన్నయ్య ఇద్దరం మా చెల్లెల్లకి మస్కా కొట్టి వాళ్ళ డబ్బులు కూడా స్వాహా చేసేవాళ్ళం. అది వేరే సంగతి అనుకొండి. పతంగుల ధరలు అతిచిన్న పతంగి ఒక పైసా, 3 పైసలకి మధ్యరకం, 5 పైసలకి కొంచం పెద్ద గాలిపటం వచ్చేవి. దోరేదార్ 10 పైసల నుండి మొదలయ్యేవి. అద్దా అటు ఇటుగా 50 పైసలు నుంచి రూపాయి ఉండేది. గీటీ మాంజా 10 పైసలు. గీటి దాదాపు 20 లచ్చాలు. అంటే అంగుష్టాం నుంచి చిటికిన వేలుకి మధ్య దారాన్ని 20 సార్లు చుట్టి ఇచ్చేవాళ్ళు. అప్పట్లో చార్మినార్ దగ్గర గుల్జారాస్ మాంజాలకి చాలా ప్రసిద్ధంగా ఉండేది. ఒక సాదా దారపు రీలు 50 పైసలుండేది. చరఖాలంటివి కొనేవాళ్ళం కాదు. మా ఇంట్లో పాత పాండ్స్ డబ్బాలకి చుట్టు వాడేవాళ్ళం. 

 అస్సలు మా హడావుడి పండగకి వారం ముందు నుంచే మొదలయ్యేది. పాత సీసాలు పోగుచేసి అవి పగలకొట్టి, పొడిచేసి, వస్త్రంపట్టి, అన్నం మెత్తగా వండి, అందులో ఈ సీసాపొడీ కలిపి, రంగుకోసం కాస్త పసుపో, కుంకుమో కలిపి దారాన్ని సందు ఈ మొదలు నుంచి ఆ చివరదాకా కట్టి ఆ అన్నం ముద్దని దారానికి పట్టించి మాంజా చేసేవాళ్ళం. గాజు పొడి దారానికి పట్టుకోవటానికి యూనివర్సిటి వెళ్ళి కలబంద ఆకులు తెచ్చి లోపలి గుజ్జు తీసి అన్నం ముద్దకి కలిపేవాళ్ళం. మాకు అదొక పెద్ద అడ్వెంచర్ లా ఉండేది.


        భోగి మంటకి అందరిళ్ళల్లో ఉన్న పనికిరాని సామాన్లన్ని పోగుచెసేవాళ్ళం. చిత్తు కాగితాలు, ఎండిపోయిన ఆకులు ఒకటేమిటి "కాదేది దహనానికి అనర్హం" అనేలాగా దొరికినవన్ని భోగి నాడు పొద్దున్న తగలడిపోయేవి. మా సందు కూడలిలో భోగి మంట వేసేవాళ్ళం. పొద్దున్నే 5 కే లేచి అందరి ఇళ్ళకి వెళ్ళి మంట వేస్తున్నాం అని చెప్పి లేపి అప్పుడుగానీ మొదలెట్టెవాళ్ళం కాదు. ఒక గంట దాకా అదొక హంగామా.

        అది ఐపోగానే కొనుక్కున్న పతంగులకి కన్నాలు కట్టటం అనే మహాకార్యానికి నాంది పలికే వాళ్ళం. అమ్మో అందులో ఎన్ని రకాలో. కన్నాలు కట్టటం అంటే, సూత్రం కట్టటం అన్నమాట. డీల్ కన్నాలు, కీంచ్ కన్నాలు, బొమ్మ కన్నాలు ఇలా అనేక రకాలుండేవి. డీల్ కన్నాలంటె పతంగి దాలిలో గిరికీలు తిరుగుతూ ఎగురుతుంది. ఎక్కువ గిరికీలు తింటే పట్టుకోవటం కష్టం. చేతులు లాగేస్తాయి. ఒక్కప్పుడు (ఒక్కక్కప్పుడేమిటి చాలా సార్లే) అది అలా తిరుగుతూ వెళ్ళి ఏ చెట్టుకొమ్మల్లోనో ఇరుక్కునేది. కీంచ్ కన్నాలంటే పతంగి దారం లాగినప్పుడు సర్రు మని పైకి లేస్తుంది. పేంచీ వేసేప్పుడు ఈ కన్నాలు చాలా ఉపయోగం. ఈ కన్నాలుంటే పతంగి చాలా బరువు ఉంటుంది. పేంచీ అంటే పతంగుల లడాయి అన్నమాట. ఇంక బొమ్మ కన్నాలంటే పతంగి గాలిలో కదలకుండ బొమ్మలా ఉండిపోతుంది. ఎంత దారం వదిలినా అలా పైకి వెల్తుందే తప్ప అటూ ఇటూ కదలదు. టైంపాస్ కి ఇది బెష్టు. పేంచి టైం లో కూడా చాలా గొప్పభాష ఉండేది. పిలావ్, కాటే, డీల్ చోడో, లప్టావో, కీంచ్ లియా, లూట్ లియా, లాంటివి.

        ఇక సాఫ్ ఐన పతంగులు పట్టుకోవటం కూడా ఒక కళే. ఎన్నో రకాల ఎత్తులు. దొరికివాటిల్లో పెద్ద బొంగు తీసికుని దానికి చివర ఎండిపోయిన కొన్న గట్టిగా కట్టేవాళ్ళం. పతంగి కిందకి వచ్చేలోపలే మనం మన బొంగుతో దాన్ని పట్టెసేవాళ్ళం. కానీ వెంటనే కిందకి దించితే పక్క వెధవలు కుళ్ళుతో చింపేసేవాళ్ళు. అందుకని రెండు నిముషాలు అలానే ఉంచి వాళ్ళు వెళ్ళాక నెమ్మదిగా దించి తీసుకొనేవాళ్ళం. 

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని సాహసాలో సంక్రాంతి పండుగకి. అదొక ఆనందం. ఈ టివీలు, కంప్యూటరులు వచ్చాక ఆ సంబరాలు తగ్గాయనే చెప్పాలి. మళ్ళీ ఆ పాత రోజులు ఎప్పుడొస్తాయో.


        "   ఏమండి మనంకూడా మేడ మీదకి వెళదామా? పిల్లలు పతంగులెగరేస్తున్నారు. చూద్దాం"    అన్న భార్యామణి మాటలతో మళ్ళీ ఈలోకంలోకి వచ్చా.

        "   సరే పదా"   అంటూ మేడ మీదకి దారితీసా పతంగులాడుకోవటానికి, కాదు పిలాయించటానికి.

        ఇంత ఆనందమయ సమయంలో మిత్రులందరికీ

        సంక్రాంతి శుభాకాంక్షలతో...


        మీ మిత్రుడు,  సపరివార సమేతంగా. 

Friday, December 16, 2011

నమ్మండి-నమ్మకపొండి


మన జీవితంలో ఎంతో మందిని కలుస్తుంటాము. ఎన్నో సంఘటనలు తారసపడుతుంటాయి. చాలావరకు సామాన్యమైనవిగానే ఉన్నా కొన్ని సంఘటనలు మర్చిపోలేము. కొన్ని సంఘటనలను నమ్మలేము. మన కళ్ళు మనలని మోసం చేసాయా అనిపిస్తాయి. ఎందుకంటే అటువంటి సంఘటనలు మన దైనందిన జీవితాల్లో కనపడవు. కొన్ని సార్లు మనకి తెలిసినా ఎదో కాకాతాళీయంగా జరిగింది అని వదిలేస్తాము. చాలావరకు సంఘటనలు ఇలాంటివే.

అవి నెను 9 తరగతి చదువుకునే రోజులు. హైదరాబాదులో విద్యానగర్లో ఉండేవారము. ఆరోజు ఆదివారం అవటం వలన నేను మా ఫ్రండ్ ఉదయ్ ఇంట్లోనే ముందు వసారాలు చెస్ ఆడుకుంటూ కూర్చున్నాము. మా అమ్మ వంతింట్లో పూజ చేసుకుంటూ వంటపనిలో ఉంది. ఈలోగా బయట అమ్మా అనే పిలుపు వినిపించింది. ఎవరో ముష్టివాడు అనే ఆలోచనలో మేము పట్టించుకోలేదు. ఆమనిషి ఈలోగా గేత్ తీసుకొని లోపలికి వచ్చాడు. మంచి తెల్లని తెలుపు, పొడుగాటి గడ్డం, కాషాయ బట్టలు వేసుకొని ఉన్నాడు. ఈలోగా మా అమ్మ చాతలో బియ్య తెచ్చింది అతనికి వెయ్యటానికి. ఐతే అతను తీసుకోవటనికి ఒప్పుకోలేదు. ' మీ ఇంట దేవీ పూజ చేస్తారు కాదా ప్రతిరోజూ ' అని అడిగాడు. మాఅమ్మ అవునని తలఊపింది. అతను మా అమ్మ చెయ్యి చాపమని చేతిలో చిటికెడు విభూతి ఇచ్చి ' మీ పూజ గదిలోకి వెళ్ళి చూడ ' మని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడే ఉండి ఈ సంగతంతా చూస్తున్న మాకు ఎంజరుగుతుందో చూద్దామని మా అమ్మ వెనకాలే వెళ్ళాము.

విచిత్రం. పూజ గదిలోకి వెళ్ళగానే మా అమ్మ చేతిలో విభూది కారబ్బంతి పువ్వుగా మారిపోయింది. మా కళ్ళని మేమే నమ్మలేదు. మా అమ్మకైతే అసలేమి అర్థం కాలేదు. ఇలాంతివన్ని కనికట్టు అనుకి ఆ పువ్వు తరవాత మళ్ళి బూడిద ఐపొతుందని బాగా నమ్మి ఆ పువ్వుని ఒక పూజా పుస్తకంలో జాగ్రత్తగా దాచాము. పువ్వు ఎండిపోయింది గానీ మాయం మాత్రం కాలేదు. ఎన్నో ఏళ్ళు అలానే ఆ రేకులు అదే పుస్తకంలో ఉండేవి.

ఇది చదివిన చాలామందికి నేనేదో కథ చెప్తున్నా అనిపించవచ్చు. మరికొంత మంది ట్రాష్ అని కొట్టిపడేయవచ్చు. నాకు ఇలాంటివి నమ్మకం లేకపోయినా కళ్ళతో చూసింది కాదని ఎలా అనటం? ఇది నిజం. మీకెవరికైనా ఏమైనా వివరణ తెలిస్తే చెప్పండి.

Monday, December 12, 2011

కాఫీ దండకం

ఈ కాఫీ దండకం పోకూరి కాశీపతి అనే అవధాన పండితునిచే రచించబడినది. ఒకసారి ఆయన అవధానం కోసం చెన్నపట్టణం చేరుకుని సరాసరి సభాస్థలికి చేరుకున్నారు. సభా ప్రారంభానికి ముందు సభా నిర్వాహకులు ఆయనను కాస్త కాఫీ సేవించవలసిందిగా కోరారు. సగంకప్పుతాగినంతలో సభానిర్వాహకులు ఆయనను సభావేదికనలంకరించవలసిందిగా కోరారు. ఆ సమయంలో అదే సభలో ఉన్న "ఆంధ్రవిశారద" తాపీ ధర్మారావు గారు ఆయనను సేవించిన కాఫీ మీద దండకం చెప్పమని అవధానిగారిని కోరారు. అలా ఉధ్భవించినదే ఈ కాఫీ దండకం.


దండకం


         శ్రీమన్మహాదేవీ, లోకేశ్వరీ, కాళికాసన్నిభాకారిణీ, లోకసంచారిణీ, అంబ కాఫీ జగన్మోహినీ తల్లి శ్రీకృష్ణుడా స్వర్గమున్ జేరివూతంబునౌ పారిజాతంబున్ దెచ్చియున్, నాతికిన్ ప్రీతిగా నిచ్చు కాలంబునందా సుమంబందునం గల్గు బీజంబు లుర్విస్థలిన్ రాలియున్ లోకభేదంబుచే గాఫీ  భూజంబుగా బుట్టియున్, గొమ్మలన్, రెమ్మలన్, బూవులన్, దావులన్, జక్కనౌ పిందెలన్, జిక్కనౌగాయలన్, జొక్కమౌ పండ్ల భాసిల్ల దద్బీజజాలంబు నైర్లండు, నింగ్లండు, హాలెండు, పోలెండు, రష్యా, జపాన్, జర్మనీ, గ్రీకు దేశంబులన్ నాటి పెన్ మ్రాకులై ఇండియన్ దోటలై విత్తనాలిచ్చుచున్నావటంచున్ మదిన్ దోచెనే , బాపురే, తీపిలో, నీరమున్, క్షీరమున్, జెక్కెరన్, మించిటంగాదే నీ బీజ చూర్ణంబు, నా మూటిలో జేర్చి సేవించుటన్ నీదు బీజంబులన్ బెంచులో మాడ్చి చూర్ణమ్ము గావించినన్ దీపిపోదాయె నీ మాధురీ శక్తి, నీ యింపు, నీ సొంపు, నీ పెంపు వర్ణింప నేనెంతవాడన్ ధనాకర్షిణీ, ప్రాణ సంరక్షిణీ, ధాత్రి నెవ్వారలేన్ వేకువన్ లేచియున్ నిత్యకృత్యంబులన్ దీర్చి, మున్ ముందుగా నిన్ను బానంబు గావింపకున్నన్ ద్విజుల్ వేదమంత్రంబులన్ బల్కగాలేరు, ప్రాంచత్కవుల్ పద్యముల్ హృద్యమౌరీతి నిర్మింపగాలేరు, శ్రావ్యంబుగా శౌరిదాసుల్ గళం బెత్తుయున్ బాడి నృత్యంబులన్ సేయగాలేరు, శిల్పుల్ మనస్పూర్తిగా సుత్తి చేపట్టగాలేరు, వైశ్యోత్తముల్ కొట్ల తాళంబులన్ దీయగాలేరు,   డ్రైవర్లు మోటార్ల స్టీరింగులన్ బట్టగాలేరు, టిచర్లు పాఠంబులన్ జెప్పగాలేరు,    డాక్టర్లు నింజక్షనులన్ జేయగాలేరు, ప్లీడర్లు నోరెత్తి వాదింపగాలేరు, జడ్జీలు నానల్పమౌరీతి తీర్పులన్ వ్రాయగాలేరు, దిట్టంబుగ బాలసుల్ కూట సాక్ష్యంబులం జెప్పగా లేరు, వారాంగనల్ కోడెగాండ్రన్ వెనస్ గేళిలో నోలలాడింపగా లేరు, ముప్పూటలన్ నిన్నొగిన్ గ్రోలకున్నన్ శిరోభారమై నాల్క ఎండున్, మనంబెంతో చాంచల్యముంబొందుచున్ గుండియల తల్లడంబందుచున్, మేను కంపించుగాదే, కటాక్షంబుతో నిత్యమున్ వేకువన్ దర్శనమ్మిచ్చి నిన్ బాగుగం త్రాగు సౌభాగ్యమున్ గూర్చి రక్షింపవే సారెకున్ గొల్చెదన్ విశ్వకర్మాన్యంబందునన్ సత్కవీంద్రుడనన్, పోకూరి కాశీపతి స్వాంత రాజీవ సంవాసినీ నీకికన్ మంగళంబౌ మహా కాఫీ దేవీ నమస్తే నమస్తే నమస్తే నమో నమః