Sunday, January 8, 2012

గాలిపటం... గాలిపటం

సంక్రాంతి వచ్చేసింది. ఆడవాళ్ళంతా పొద్దున్నే లేచి రాత్రి కష్టపడి ప్రాక్టిసు చేసిన ముగ్గులు వేస్తున్నారు. పిల్లకాయలు తము కొనుక్కున్న గాలి పటాలన్ని లెక్కలుచూసుకుంటున్నారు. ఎవరిదగ్గర ఎంత మాంజా ఉందో, అది సరిపోతుందో లేదో, ఒకవేళ కొత్త మంజా కావాలంటే ఏ షాపు నుంచి తెచ్చుకోవాలో అని ఆలోచనలలో ఉన్నారు. మా ఆవిడ ఇచ్చిన వేడి కాఫీ తాగుతు పేపరు పట్టుకుని మధ్య మధ్యలో వాళ్ళ హడావుడి చూస్తు నేను. ఇల్లంతా పిల్లలతో వాళ్ళ ఫ్రండ్స్ తో కోలాహలంగా ఉంది. వాళ్ళ హడావుడి చూస్తుంటే ఎదో యుద్ధానికి వెళ్ళే సైన్యం లా అనిపించింది.


        "   అవును మరి ఇది ఒకరకమైన యుద్ధమే కదా " అనుకున్నా మనసులో.

        ఒక్కసారి మనసులో నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. ఆ రోజుల్లో సంక్రాంతి అంటే ఎంత హడావుడి చేసేవాళ్ళమో. అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలావరకు తగ్గిపోయింది అనిపించింది. "ధరలు బాబూ, ధరలు" అనుకున్నా నాకు నేనే నచ్చచెప్పుకున్నట్లు. ఇప్పటివాళ్ళకు ఆనాటి గాలిపటాల పేర్లైనా సరిగా తెలుసో లేదో. పతంగులు అనేవాళ్ళు.

        ఎన్ని రాకాల పేర్లు ఉండేవి? సరిగా గుర్తులేవు. నమందార్, జీబా, లంగోటి, గుడ్లందార్, బనియందార్, గుడ్డి లంగోటి, గిల్లోరాడప్పన్, డోరేదార్, అద్దా, ఇవి కొన్ని గుర్తున్నాయి. హ హ భలే పేర్లు. నామందార్ అన్నా జీబా అన్నా ఒకటే. పతంగి పైన ఒక నామం ఉంటుంది. లంగోటి అంటే పతంగి అడుగున ఒక చిన్న గౌనులాగా, గుడ్లందార్ అంటే రెండు కళ్ళు, బనియందార్ అంటే చారల పతంగి, గుడ్డి లంగోటి అంటే ఒంటికన్ను, కింద గౌను. గిల్లోరాడప్పన్ అంటే సరిగా గుర్తులేదు. దోరేదార్ అంటే పతంగి చుట్టురా కాగితానికి దారం పెట్టేవారు. అద్దా అంటే పెద్ద గాలిపటం.

        సంక్రాంతికి ఒక్కొక్కళ్ళకి పది రూపాయలు ఇచ్చేవారు నాన్న. నేను మా అన్నయ్య ఇద్దరం మా చెల్లెల్లకి మస్కా కొట్టి వాళ్ళ డబ్బులు కూడా స్వాహా చేసేవాళ్ళం. అది వేరే సంగతి అనుకొండి. పతంగుల ధరలు అతిచిన్న పతంగి ఒక పైసా, 3 పైసలకి మధ్యరకం, 5 పైసలకి కొంచం పెద్ద గాలిపటం వచ్చేవి. దోరేదార్ 10 పైసల నుండి మొదలయ్యేవి. అద్దా అటు ఇటుగా 50 పైసలు నుంచి రూపాయి ఉండేది. గీటీ మాంజా 10 పైసలు. గీటి దాదాపు 20 లచ్చాలు. అంటే అంగుష్టాం నుంచి చిటికిన వేలుకి మధ్య దారాన్ని 20 సార్లు చుట్టి ఇచ్చేవాళ్ళు. అప్పట్లో చార్మినార్ దగ్గర గుల్జారాస్ మాంజాలకి చాలా ప్రసిద్ధంగా ఉండేది. ఒక సాదా దారపు రీలు 50 పైసలుండేది. చరఖాలంటివి కొనేవాళ్ళం కాదు. మా ఇంట్లో పాత పాండ్స్ డబ్బాలకి చుట్టు వాడేవాళ్ళం. 

 అస్సలు మా హడావుడి పండగకి వారం ముందు నుంచే మొదలయ్యేది. పాత సీసాలు పోగుచేసి అవి పగలకొట్టి, పొడిచేసి, వస్త్రంపట్టి, అన్నం మెత్తగా వండి, అందులో ఈ సీసాపొడీ కలిపి, రంగుకోసం కాస్త పసుపో, కుంకుమో కలిపి దారాన్ని సందు ఈ మొదలు నుంచి ఆ చివరదాకా కట్టి ఆ అన్నం ముద్దని దారానికి పట్టించి మాంజా చేసేవాళ్ళం. గాజు పొడి దారానికి పట్టుకోవటానికి యూనివర్సిటి వెళ్ళి కలబంద ఆకులు తెచ్చి లోపలి గుజ్జు తీసి అన్నం ముద్దకి కలిపేవాళ్ళం. మాకు అదొక పెద్ద అడ్వెంచర్ లా ఉండేది.


        భోగి మంటకి అందరిళ్ళల్లో ఉన్న పనికిరాని సామాన్లన్ని పోగుచెసేవాళ్ళం. చిత్తు కాగితాలు, ఎండిపోయిన ఆకులు ఒకటేమిటి "కాదేది దహనానికి అనర్హం" అనేలాగా దొరికినవన్ని భోగి నాడు పొద్దున్న తగలడిపోయేవి. మా సందు కూడలిలో భోగి మంట వేసేవాళ్ళం. పొద్దున్నే 5 కే లేచి అందరి ఇళ్ళకి వెళ్ళి మంట వేస్తున్నాం అని చెప్పి లేపి అప్పుడుగానీ మొదలెట్టెవాళ్ళం కాదు. ఒక గంట దాకా అదొక హంగామా.

        అది ఐపోగానే కొనుక్కున్న పతంగులకి కన్నాలు కట్టటం అనే మహాకార్యానికి నాంది పలికే వాళ్ళం. అమ్మో అందులో ఎన్ని రకాలో. కన్నాలు కట్టటం అంటే, సూత్రం కట్టటం అన్నమాట. డీల్ కన్నాలు, కీంచ్ కన్నాలు, బొమ్మ కన్నాలు ఇలా అనేక రకాలుండేవి. డీల్ కన్నాలంటె పతంగి దాలిలో గిరికీలు తిరుగుతూ ఎగురుతుంది. ఎక్కువ గిరికీలు తింటే పట్టుకోవటం కష్టం. చేతులు లాగేస్తాయి. ఒక్కప్పుడు (ఒక్కక్కప్పుడేమిటి చాలా సార్లే) అది అలా తిరుగుతూ వెళ్ళి ఏ చెట్టుకొమ్మల్లోనో ఇరుక్కునేది. కీంచ్ కన్నాలంటే పతంగి దారం లాగినప్పుడు సర్రు మని పైకి లేస్తుంది. పేంచీ వేసేప్పుడు ఈ కన్నాలు చాలా ఉపయోగం. ఈ కన్నాలుంటే పతంగి చాలా బరువు ఉంటుంది. పేంచీ అంటే పతంగుల లడాయి అన్నమాట. ఇంక బొమ్మ కన్నాలంటే పతంగి గాలిలో కదలకుండ బొమ్మలా ఉండిపోతుంది. ఎంత దారం వదిలినా అలా పైకి వెల్తుందే తప్ప అటూ ఇటూ కదలదు. టైంపాస్ కి ఇది బెష్టు. పేంచి టైం లో కూడా చాలా గొప్పభాష ఉండేది. పిలావ్, కాటే, డీల్ చోడో, లప్టావో, కీంచ్ లియా, లూట్ లియా, లాంటివి.

        ఇక సాఫ్ ఐన పతంగులు పట్టుకోవటం కూడా ఒక కళే. ఎన్నో రకాల ఎత్తులు. దొరికివాటిల్లో పెద్ద బొంగు తీసికుని దానికి చివర ఎండిపోయిన కొన్న గట్టిగా కట్టేవాళ్ళం. పతంగి కిందకి వచ్చేలోపలే మనం మన బొంగుతో దాన్ని పట్టెసేవాళ్ళం. కానీ వెంటనే కిందకి దించితే పక్క వెధవలు కుళ్ళుతో చింపేసేవాళ్ళు. అందుకని రెండు నిముషాలు అలానే ఉంచి వాళ్ళు వెళ్ళాక నెమ్మదిగా దించి తీసుకొనేవాళ్ళం. 

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని సాహసాలో సంక్రాంతి పండుగకి. అదొక ఆనందం. ఈ టివీలు, కంప్యూటరులు వచ్చాక ఆ సంబరాలు తగ్గాయనే చెప్పాలి. మళ్ళీ ఆ పాత రోజులు ఎప్పుడొస్తాయో.


        "   ఏమండి మనంకూడా మేడ మీదకి వెళదామా? పిల్లలు పతంగులెగరేస్తున్నారు. చూద్దాం"    అన్న భార్యామణి మాటలతో మళ్ళీ ఈలోకంలోకి వచ్చా.

        "   సరే పదా"   అంటూ మేడ మీదకి దారితీసా పతంగులాడుకోవటానికి, కాదు పిలాయించటానికి.

        ఇంత ఆనందమయ సమయంలో మిత్రులందరికీ

        సంక్రాంతి శుభాకాంక్షలతో...


        మీ మిత్రుడు,  సపరివార సమేతంగా.