Thursday, October 13, 2011

పాపం వినాయకుడు

 వినాయక చవితి వచ్చింది వెళ్ళింది. ఐతే ఇప్పుడేం రాస్తావు అని మీరడగ వచ్చు. వస్తున్నా! అదే పాయింటుకి వస్తున్నా.

         ఇదివరకు, అంటే నా చిన్నప్పటి సంగతి, వినాయక చవితి అనగానే పొదున్నే లేచి తలంటి పోసుకుని, బజారు వెళ్ళి ఒక చిన్న వినాయకుడి బొమ్మ, మట్టి వినాయకుడిని, పత్రి తెచ్చి పూజ చేసుకునే వాళ్ళం. వినాయకుడి బొమ్మలు సాధారణంగా సింహాసనం మీద కూర్చున్నట్లో, కాస్త పెద్దవి ఐతే కొంచం పక్కగా ఒరిగి పడుకున్నట్లో ఉండేవి. చక్కగా తీర్చిన కళ్ళు, తొండము మీద చక్కని డిజైను పసుపు గాని ఎరుపుగాని రంగులో బట్టల తో ఉండేవి. ఇక మట్టి వినాయకుడి విషయానికి వస్తే పండుగనాడూ, విద్యానగార్ ఫస్ట్ లకీ దగ్గరో, శంకర మఠం దగ్గరికో వెళితే అప్పటికపుడు అచ్చులో బంకమన్ను తో బొమ్మ చేసి పైన పైన బంగారు రంగో లేకపోతే వెండి రంగో అద్ది ఇచ్చే వాళ్ళు.

         సార్వజనిక గణపతి పందిళ్ళు ఎక్కువ ఉండేవి కాదు అప్పట్లో. అలాగే చందాల వసూళ్ళు ఉండేవి కాదు. ఎక్కడో పెద్ద పెద్ద కూడళ్ళ దగ్గర మాత్రం పందిళ్ళువేసి వినాయ విగ్రహాలు పెట్టేవాళ్ళు. తొమ్మిది రోజులు పొదున్న సాయంకాలం పుజా చేసి ప్రసాదం పంచటం లాంటివి చేసేవాళ్ళు. చక్కటి భక్తి గీతాలతో రోజు అందరిని ఆకర్షించేవారు.

         మరి ఇప్పుడో? కాలంతో పాటు వినాయకుడిని కూడా మార్చేసారు మన వినాయకులు. గత కొద్దిరోజులుగా టి.వీ లో చూపిస్తున్న రకరకాల వినాయక విగ్రహాలని చూస్తుంటే నిజం గానే కోపం , దుఃఖం , వెగటు , అసహ్యం ఇంక అన్నిరకాల భావాలు భక్తి భావం తప్ప కలిగాయి. 



ఉదాహరణకి ఒక పండల్ లో వినాయకుడికి సైఫ్ అలీ ఖాన్ వేషం వేశారు. వినాయకుడు సూటు వేసుకుని, గాగుల్స్ పెట్టుకొని గిటారు వాయిస్తునట్టు పెట్టారు. ఆఖరికి జుట్టుకూడా లేటెష్టు గా జూలపాలు పెట్టారు.

         ఇంకో చోట వినాయకుడికి రైతన్న వేషం వేశారు. తలకి పాగా చుట్టుకుని, ఎద్దు బండి తోలుతున్నట్టు అలంకరించారు. మోటారుతో బండి ముందుకి వెళ్తున్నట్టు, వినాయకుడీ చెయ్యి కదులుతూ బండినడుపుతున్నట్టు.

         ఇలా చెప్పుకుంటు పోతే అంతే లేదు. ఏదో బొమ్మ పెట్టాలి అని పెట్టటమే తప్పా ఎలాంటి బొమ్మ పెడుతున్నాము అని ఆలోచించటమే లేదు. పూజలు కూడా అంతే. మైకులో చదవటమే ముఖ్యం కానీ సరైన మంత్రాలు చదువుతున్నారాలేదా అని ఎవ్వరు చూడటంలేదు. సార్వజనిక గణపతి ఉత్సవాలు వ్యాపార కేంద్రాలే తప్ప ఇంకోటి కాదు.

         ఇలాంటి సంస్క్సృతి మన తరవాతి తరాలకి అందిస్తే కొన్ని ఏళ్ళలో వినాయకుని అసలు రూపమే మన మనవలకి, ముని మనవలకి తెలియక పోవచ్చు.

         వినాయకా నీవైనా వీళ్ళ కళ్ళు తెరిపించు.

No comments: