Tuesday, October 25, 2011

శ్రీ నారాయణ తీర్ధులు

సంగీత ప్రపంచంలో శ్రీ నారాయణ తీర్ధులవారి పేరు విననివారు చాలా అరుదుగా ఉంటారనే చెప్పాలి. ఏ సంగీత కచేరిలో ఐనా, కనీసం ఒకటైనా ఆయన రచన పాడనివారుండరు. నృత్య కార్యక్రమాలలో ఐతే ఇంక చెప్పనక్కరనేలేదు. చాలా చిత్రాలలో కూడా ఆయన రచించిన తరంగాలు అనేకం చిత్రించారు. 
  • బాలా గోపాల మా ముగ్ధరా కృష్ణ పరమకల్యాణ గుణాకర (మోహన రాగం)

  • కృష్ణం కలయ సఖీ సుందరం బాల (ముఖారి రాగం)

  • గోవింద ఘటయ మమ ఆనంద మమృతమిహ (కాంభోజి రాగం)

  • ఆలోకయే శ్రీ బాలకృష్ణం (హుశేని)

  • పరమ పురుష మనుయామ వయం సఖి (కేదారగౌళ)

  • మా మవ మాధవ దేవా (కేదారగౌళ)

  • గోవిందమిహ గోపికానందకందం (మధ్యమావతి)

  • బ్రూహిముకుందేత్తి రసనే (కళ్యాణి)
ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన "కృష్ణలీలాతరంగిణి" లో వ్రాసిన ఒక్కొక్క కీర్తన ఒక ఆణిముత్యం అనటంలో అతిశయోక్తి లేదు. అంతటి మహాభక్తుడూ, సంగీతకారుడు, అంధ్ర, సంస్కృత సాహిత్యవేత్త గురించి క్లుప్తంగా వివరించటమే ఈ వ్యాస ముఖ్యోద్దేశం.

శ్రీ నారాయణ తీర్ధులవారు ఆంధ్రదేశంలో, కృష్ణజిల్లలోని "కాజా" గ్రామంలో జన్మించారు. ఈయన జననకాలం గురించి అనేక వాదోపవాదాలున్నా, తంజావూరులోని సరస్వతీ గ్రంథాలయంలోని పాతప్రతుల వలన ఈయన క్రీ.శ. 1650-1745 వరకు ఉండి ఉండవచ్చని పండితుల అభిప్రాయం. ఈయన కొంతకాలం గోదావరి జిల్లాలోని కూచిమంచి అగ్రహారంలో నివసించారు. తరువాత శ్రీకాకుళం, శోభనాద్రి, వెంకటాద్రి మొదలైన స్థలాలు దర్శించి, చివరగా తమిళనాడులో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. కర్నాటక సంగీతానికి ఆదిపీఠమైన తంజావూరు జిల్లాలోని సంగీత విద్వాంసుల వలనే ఈయనకి అత్యంత పేరుప్రఖ్యాతులు వచ్చాయి.

 సనాతన మార్గావలంబికుల నమ్మకం ప్రకారం, వేదవ్యాసుడు కలియుగంలో మూడు జన్మలు ఎత్తారు. అందులో మొదటి అవతారంలో శృంగార మహాకవి జయదేవునిగా 12వ శతాబ్ధంలో జన్మించి అష్టపదులను (12 సర్గలలో 24 అష్టపదులు) రచించారని, రెండవజన్మలో శృంగార మహాకవి క్షేత్రయ్య (క్షేత్రజ్ఞ)గా 15/16 శతాబ్ధంలో జన్మించి సుమారు 24000 శృంగారపదాలను శ్రీ కృష్ణునిపై రచించారనీ, మూడవ జన్మలో యోగి నారాయణ తీర్ధులుగా జన్మించి శ్రీ కృష్ణుని లీలలపై కృష్ణలీలాతరంగిణీ ని రచించారని వారి ప్రగాఢ విశ్వాసం.

నారయణ తీర్ధులవారు సంస్కృతంలో పండితుడేకాక, సంగీత నాట్య శాస్త్రాలలో నిష్ణాతుడు. శ్రీ శంకరాచారుల వారికి జరిగినటువంటి సంఘటనే శ్రీ నారాయణతీర్ధుల వారి జీవితంలో తటస్థించి వారు సన్యాసం తీసుకోవటానికి దారి తీసిందని ఒక కథనం.

ఆ కథ ప్రకారం, ఒకనాడు నారాయణ తీర్ధులవారు వరదలో చిక్కుకుని కొట్టుకుపోతూ సుడిగుండంలో చిక్కుకున్నారుట. ఆ సమయంలో భగవంతుని ప్రార్థించి, ఈ గండం నుంచి బయటపడితే ఈ ఇహలోక సౌఖ్యాలు వదిలి సన్యాసం తీసుకుంటా అని అనుకున్నారుట. విచిత్రంగా ఆ వరదపొంగు తగ్గి నారాయణ తీర్ధులవారు క్షేమంగా ఇల్లు చేరుకున్నారు. తరువాత ఆయన సన్యాసం విషయం మర్చిపోయారు. కానీ ఆయన ధర్మపత్ని ఆయనలో ఒక విధమైన మార్పు గమనించి అతనిని సన్యాసం తీసుకోవటానికి ప్రోత్సహించిందని చెప్తారు.

ఒక రోజు ఆయనకు విపరీతమైన కడుపునొప్పి మొదలయింది. ఆ బాధ నివృత్తికోసం ఆయన దక్షిణాదిగా బయలుదేరారు. అలా కొన్ని వందల మైళ్ళు నడిచాక అలసటతో మూర్చపోయే సమయంలో ఎక్కడి నుంచో ఒక వరాహం అతనిని తంజావూరులోని భూపతిరాజపురం అనే ఒక గ్రామంలోని ఒక పాటుపడ్డ గుడికి దారి చూపింది. ఆ గుడికి చేరటంతోనే నారాయణ తీర్ధులవారి అనారోగ్యం క్షణంలో తగ్గిపోయింది. ఆ గుడిని ఎంతో మహిమ గలదిగా గుర్తించిన నారాయణతీర్ధులవారు దానిని పునరుద్ధరించటానికి పూనుకున్నారు. అదే సమయంలో ఆయన "కృష్ణలీలాతరంగిణి" రచించారు. తరువాతి కాలంలో ఈ గ్రామం "వరాహపురం/వరహూరూ" అనే పేర్లతో పిలబడుతోంది.

సన్యాసాశ్రమానికి పూర్వం, ఈయన నామధేయం "మాధవ" లేక "గోవింద శాస్త్రి" అనీ, వీరి తండ్రి నామధేయం "గాంధర్వ" లేక "నీలకంఠ శాస్త్రి" అని, సన్యాసం తీసుకున్న తరువాత "నారాయణ తీర్ధులు" గా పేరు మార్చుకున్నారని వాదోపవాదాలున్నాయి. అలాగే పైన చెప్పిన కథ తంజావూరులోని పెన్నా నదిలో జరగలేదని కృష్ణనదిలో జరిగిందని కూడా కొన్ని వాదనలున్నాయి.

   కృష్ణలీలాతరంగిణి:
నారాయణతీర్ధుల వారు ఈ కావ్యాన్ని నృత్యనాటకంగా రచించారు.  వేదవ్యాస ముని రచించిన మహాభాగవతంలోని దశమ స్కందంలోని మొదటి 58 అధ్యాయాల ఆధారంగా ఈ కావ్యాన్ని రచించారు. ఇందులో మొత్తం 12 తరంగాలలో 153 కీర్తనలు, 302 శ్లోకాలు, 31 చూర్ణికలు ఉన్నాయి. కృష్ణ అవతారం నుంచి మొదలుపెట్టి రుక్మిణీ కళ్యానంతో ముగిసే ఈ కావ్యంలో నారాయణతీర్ధుల వారు కనీసం 34 లోక ప్రియమైన రాగాలను వాడారు. త్రిపుట, ఆది, రూపక, చాపు, ఝంప, మత్య విలంబ, ఏక మరియు ఆట తాళాలలో ఈ కీర్తనలు నిభధించారు. సంస్కృత పండితుడైనప్పటికీ అత్యంత క్లిష్టమైన భాషలో కాక సరళమైన సంస్కృతంలో ఉన్న ఈ రచనలలో 17 రకములైన చంధసులని ఉపయోగించారు.


ఈయన రచనలన్నీ, వీరు శిష్యులు, వారిలో ముఖ్యంగా తులజ మహారాజు వ్రాతప్రతులను చేయించి శుద్ధిపరచి జాగ్రత్త చేసి మనకందించారు.

         శ్రీ నారాయణ తీర్ధుల వారి ఇతర రచనలు:
  • సుభోదిని : శంకరాచార్య బ్రహ్మసూత్రా భాష్యానికి వివరణ (సంస్కృతంలో)
  • వివరణదీపిక: సురేశ్వరాచార్యులవారి పంచీకరణవర్తిక కి వివరణ (తెలుగులో)
  • పారిజాతాపహరణం (తెలుగు మరియు సంస్కృతంలో)
  • హరిభక్తి సుధాకరం
  • శాండిల్య భక్తి సూత్ర వ్యాఖ్యానం


No comments: