Sunday, October 16, 2011

రామాయణంలో రావణుని పాత్ర


       మన భారతదేశంలో రామాయణం చదవని వారు కాని, వినని వారు కానీ ఉండరనటం లో ఆశ్చర్యమేమీలేదు. ఎందుకంటే, ఆ మహా కావ్యం మన సంస్కృతిలో మన నరనరాలలో జీర్ణించుకుని పోయింది. ఎవరైన ఒక సద్గుణవంతుడు మనకి కనపడితే శ్రీ రాముడితో పోలుస్తు ఉంటాము. శ్రీ రాముని గుణాలను వాల్మీకి అంత గొప్పగా వర్ణించారు. ఐతే ప్రతినాయకుడైన రావణాసురుడిని కూడా అదే రీతిలో పొగిడారు. రాముని గురించి గాని ఆయన గొప్పదనాన్ని గురించి గానీ వర్ణించ నవసరం లేదు. అవి అందరికీ తెలిసిన సంగతులు. రామాయణంలోని ప్రతి నాయకుడైన రావణ బ్రహ్మ గురించి కొంచము ముచ్చటిద్దాం. 


రావణ బ్రహ్మ జననం:
         భాగవత పురాణం ప్రకారం, ఒక పర్యాయం శ్రీమహావిష్ణువు దర్శనార్థం సనత్ కుమారులు వైకుంఠం చేరుకొనగా, వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు సనత్ కుమారులను చూసి చిన్న బాలురు అనుకొని అడ్డగిస్తారు. దీని వల్ల సనత్ కుమారులకు ఆగ్రహం వచ్చి జయవిజయులను భూలోకంలో జన్మించమని శపిస్తారు. ద్వారపాలకులు విషయాన్ని గ్రహించి శాపవిమోచనాన్ని అర్థించగా హరి భక్తులుగా ఏడు జన్మలు గానీ, లేదా హరి విరోధులుగా మూడు జన్మలు గానీ భూలోకంలో గడిపితే, శాపవిమోచనం కలిగి తిరిగి తనను చేరుకుంటారని విష్ణుమూర్తి సూచిస్తాడు. ఏడు జన్మల పాటు విష్ణుమూర్తికి దూరంగా జీవించలేమని భావించిన జయ విజయులు మూడు జన్మల పాటు హరికి శత్రువులుగా జన్మించడానికి సిద్ధపడతారు. ఈ విధంగా జయవిజయులు కింది జన్మలెత్తుతారు.


                 కృతయుగము: హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు

                 త్రేతాయుగము: రావణాసురుడు, కుంభకర్ణుడు

                 ద్వాపరయుగము: శిశుపాలుడు, దంతవక్ర్తుడు


         ఈ విధంగా త్రేతాయుగంలో జన్మించిన వారే రావణ, కుంభకర్ణులనే అన్నదమ్ములు. రావణాసురుడి జన్మవృత్తాంతం స్కాంద పురాణము, బ్రహ్మఖండం నందు రామేశ్వర సేతు మాహాత్మ్యం నందు చెప్పబడింది.          బ్రహ్మ మానస పుత్రుడైన పులస్త్యుని కుమారుడు విశ్రవసునికి, దైత్య రాకుమారియైన కైకసికి రావణాసురుడు జన్మిస్తాడు. కైకసికి తండ్రి సుమాలి. సుమాలి తనకు అత్యంత పరాక్రమవంతుడైన మనుమడు కావాలన్న కోరికతో అందరు రాకుమారులను అంగీకరించకుండా మహా తపస్వి అయిన విశ్రవసుకి కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాడు. కైకసి, తండ్రి ఆజ్ఞపై అసుర సంధ్యాకాలంలో విశ్రవసు మహర్షి తపస్సు చేసుకొంటుండగా ఆయన వద్దకు వెళ్లి, తపోశక్తితో తన కోరిక తెలుసుకొనమని అంటుంది. విశ్రవసు విషయం తెలుసుకొని అసుర సంధ్యాకాలం చేత క్రూరులైన పుత్రులు జన్మిస్తారని చెబుతాడు. కాని ఒక ధార్మికుడైన కుమారుడు కూడా జన్మిస్తాడని చెబుతాడు. ఆ ధార్మిక పుత్రుడే విభీషణుడు. ఈ విధంగా పుట్టినవాడు రావణాసురుడు. అందువల్ల రావణాసురుడు దైత్యుడు, బ్రాహ్మణుడు.

     రావణాసురుడి తండ్రి వైపు నుండి- తాత పులస్త్యుడు, అతని తండ్రి బ్రహ్మ. రావణాసురుని తల్లి వైపు నుండి- తాత మల్యవుడు, అమ్మమ్మ తాటకి. రావణాసురుడి మామ మారీచుడు. రావణాసురుడికి ఆరుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు. వారు 1. కుబేరుడు, 2. విభీషణుడు, 3. కుంభకర్ణుడు, 4. ఖరుడు, 5. దూషణుడు, 6. అహిరావణుడు (ఇతనినే మైరావణుడు అనికూడా అంటారు). 7. కుంభిని (సోదరి, లవణాసురిని తల్లి), 8. శూర్పణక. (సోదరి).


         రావణ బ్రహ్మ పాతాళ రాజ పుత్రిక ఐన మండోదరిని వివాహమాడాడు. వీరికి ఎడుగురు సంతానం. వారు 1. ఇంద్రజిత్తు, 2. ప్రహస్తుడు, 3. అతికాయుడు, 4. అక్షయకుమారుడు, 5. దేవాంతకుడు, 6. నరాంతకుడు, 7. త్రిశిరుడు.

రావణ బ్రహ్మ గుణగణాలు:
       
        "రావణుని కిరీటం, ఆభరణాలు, వస్త్రాలు, అనులేపనాదులు అత్యద్భుతంగా ఉన్నాయి. మహా తేజశ్శాలియు, వీరుడును ఐన రావణుడు పది శిరస్సులతో ఒప్పుచు, అనేక కౄర మృగములతో నిండిన శిఖరములు గల మందరగిరి వలె ప్రకాశిస్తున్నాడు. మణిమయాలంకృతమైన ఉన్నతాసనంపై కూర్చొని ఉన్నాడు. మంత్రాంగ నిపుణులైన నలుగురు మంత్రులచే పరివేష్టితుడై ఉన్నాడు." అప్పుడు హనుమంతుడు ఇలా అనుకొన్నాడు.
         "ఆహా! ఈ రావణుని రూపం అత్యద్భుతం. ధైర్యం నిరుపమానం. సత్వం ప్రశంసార్హం. తేజస్సు అసదృశం. నిజముగా ఈ రాక్షస రాజు సర్వ లక్షణ శోభితుడు. ఈ అధర్మానికి ఒడి గట్టకపోతే సురలోకానికి సైతం ప్రభువయ్యేవాడు. లోకాలన్నీ ఇతనికి భయపడుతున్నాయి. ఇతడు కృద్ధుడైనచో సమస్త జగత్తునూ సముద్రమున ముంచి ప్రళయం సృష్టించగల సమర్ధుడు గదా!"     రావణాసురుని శివభక్తి అనుపమానం. అందుకు ఆయన రచించిన శివతాండవ స్తోత్రమే నిదర్శనం. కైలాసవాసుని తన భక్తితో మెప్పించిన పరమ భక్తునిగా అగ్రస్తానం లో నిలిచాడు. తమ పరాక్రమంతో, యుద్ధనీతితో ముల్లోకాలని జయించి తన ఏలుబడికి తెచ్చుకున్నాడు. రావణుని గొప్పతనాన్ని చాటే ఎన్నో కథలు ప్రచుర్యంలో ఉన్నాయి.


         ఒక కథ ప్రకారం, రామ రావణ యుధ్ధానికి ముందు ఒక క్షత్రియుడిగా రాముడు చేయదలచిన క్రతువులు నిర్వహించుటకు కిష్కింధలో బ్రాహ్మణుడు దొరకని సమయంలో రావణుడు (తను బ్రాహ్మణుడు కావటంతో) తను స్వయంగా రాముడితో ఆ క్రతువులు నిర్వహింపచేసాడని అంటారు. 

         ఇంకొక కథ ప్రకారం రామ రావణ యుద్ధకాలంలో ఒక సారి లక్ష్మణుడు తనకు యుధ్ధ నీతిని నేర్పమని రాముని కోరుతాడు. అప్పుడూ రాముడు తనకంటే రావణాసురుడె అందుకు అర్హుడని అతని వద్దకి వెళ్ళి నేర్చుకోమని చెపుతాడు. అందుకు ఆశ్చర్య పడిన లక్ష్మణుడు శత్రువు వద్దకి వెళ్ళినచో చంపివేస్తాడనే అనుమానం వ్యక్తం చేస్తాడు. అందుకు రాముడు రావణుడు అటువంటివాడు కాదు అని నచ్చ చెప్పి పంపుతాడు. లంకకు చేరిన విద్యార్ధి ఐన లక్షణుడిని సకల మర్యాదలతో ఆహ్వానించి పూర్తిగా యుధ్ధనీతిని భోదించి వెనక్కి పంపుతాడని కథ. 

         ఇటువంటి కథలు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఐతే ఇవన్ని కట్టు కథలనీ, వాల్మీకి రామాయణం మాత్రమే నిజమైన కథ అని చాలా మంది వాదిస్తారు. నిజానిజాలు మనకి తెలియవు.

సీతాపహరణం:

         ఇంత గొప్ప భక్తుడు, మంత్రవేత్త, మహావీరుడైన రావణుడు సీతని దొంగతనంగా ఎత్తుకుపోవటం మనకి కొంత ఆశ్చర్యం గానే ఉంటుంది. ఐతే ఎలా ఎత్తుకుపోయాడు అనే విషయం పైన కూడా కొన్ని కథలు మనకి వినిపిస్తాయి.

         రావణుడు భిక్ష అడిగినప్పుడు సీత లక్షణుడు గీచిన గీటు దాటి భిక్ష వేయపోతుంది. అప్పుడు బ్రాహ్మణవేషంలో వచ్చిన రావణుడు తన నిజ స్వరూపం చూపిస్తాడు. అందుకు భయపడిన సీత అక్కడే మూర్చపోతుంది. అలా క్రిందపడిన సీతని రావణుడు తన పుష్పక విమానంలో తీసుకుని వెళ్తాడు.

  ఐతే, ఆ సమయంలో సీతను అతను తాక లేదనీ, ఆమె పడిఉన్న స్థలాన్ని భూమితో సహా పెకళించి తీసుకుని వెళ్ళాడని ఒక కథ. అందుకు కారణం లేకపోలేదు. ఒకానొక సమయంలో రావణుడు రంభను మోహించి బలవంతం చేయబోతాడు. అప్పుడు రంభ తనకు కుబేరుడి కొడుకుతో వివాహం నిశ్చయమైనందున తాను రావణుడికి కుమార్తె సమానురాలనని, కామకలాపాలకు సరికాదని చెపుతుంది. కానీ, రావణుడు వినకుండా బలవంతం చేయబోతాడు. దాంతో కోపించిన కుబేరుడి కొడుకు, ఇకముందు ఏ స్త్రీనైనా బలవంతపెడితే అతని పది తలలు రాలిపోతాయని శపిస్తాడు. ఈ శాపమే రావణుడి చెరలో ఉన్న కాలంలో సీతను కాపాడిందని చెప్పబడుతుంది.

         ఇంతకు చెప్పేది ఏమంటే అన్ని తెలిసిన రావణుడు తన పూర్వజన్మ రహస్యం తెలుసుకోలేక పోయాడా? సీత తన మృత్యుకారకురాలని తెలుసుకోలేకపోయాడా? లేక తెలిసే తొందరగా విష్ణు సాయిద్యం పొందటానికి ఆ విధంగా చేసాడా?

         నేను ఇంటరులో ఉండగా ఒక మంచి పుస్తకం చదివా. పుస్తకం పేరు, రచయిత ఎవరో సరిగా గుర్తులేదు. కాని, అందులో రావణపాత్ర చిత్రీకరణ చాల అద్భుతంగా చేసారు. కథ ప్రకారం రావణునికి తన జన్మ రహస్యం తెలుసు, సీత తన మృత్యు కారకురాలని తెలుసు. ఐనా, శాపవిమోచనం కోసమే అతను సీతను అపహరించినట్లు చూపించారు.

         ఈ విధంగా రావణాసురిని కథలు చాలానే ఉన్నాయి. చాలావరకు అవి అతని గొప్పతనాన్ని, శక్తినీ, భక్తిని సూచిస్తాయి. కానీ, ఇవన్ని రాముని గుణగణాల ముందు వెలవెల పోయాయి. సీతాపహరణం అనే చర్యతో మహానాయకుడు కావలసిన రావణుడు, ప్రతినాయకుడైపోయాడు. ఆ తప్పిదమే రావణుని మిగిలిన సద్గుణాలన్నిటిని కప్పివేసింది.

         ఇక కాసేపు రామాయణం ఒక కావ్యం కాకుండా ఒక నిజ సంఘటనగా తీసుకుంటే:

         పాశ్చాత్య చరిత్ర కారుల అభిప్రాయం ప్రకారం రామాయణం ఒక యదార్ధ సంఘటన అని, రామ రావణ యుధ్ధం పూర్వకాలం ఆర్యులకి, అప్పటి భరతఖండ వాసులైన రావణుడికి మధ్య జరిగిన యుద్ధంగా వర్ణిస్తున్నారు. దైత్యులు అనే వారే నిజమైన భరతఖండ వాసులనీ, ఆర్యులు తూర్పు దిక్కుగా ప్రవేశించి, అన్ని రాజ్యాలు జయిస్తూ వచ్చారని ఒక సిధ్ధాంతం. ఇప్పటికీ దక్షిణ దేశంలో ముఖ్యంగా తమిళనాడు కొన్ని ప్రాంతాలలో రావణ పూజ జరగటం వింటుంటాం. 

1 comment:

durgeswara said...

ఇంతకూ రామాయణం చదివి ఏమి తెలుసుకున్నారు .