Wednesday, October 5, 2011

నౌకా చరిత్ర

   సంగీత త్రిమూర్తులలో ఒకరైన శ్రీ త్యాగరాజ భాగవతార్ రచించిన ' నౌకా చరిత్ర ' అనే గేయ ప్రభందము అత్యంత భక్తి, శృంగార, కరుణ రస పూరితము.

         గోపికలందరు శ్రీ కృష్ణునితో కలిసి నౌకా విహారనికి యమునా నది కి బయలుదేరుతారు.

         " శృంగారించుకొని వెడలిరి శ్రీ కృష్ణునితోను " అనే కీర్తనలో గోపికలు ఎలా అలంకరించుకుని బయలుదేరారో మనకు కళ్ళకి కట్టినట్టుగా వర్ణించారు.


నవ్వుచు గులుకుచు నొకతె
కొప్పున బువ్వులు ముడుచుచు నొకతె
దువ్వుచు గురులను నొకతె
కృష్ణుని రవ్వ చేయుచును నొకతె
మగడు వీడనుచును నొకతె
రవికయు బిగువున జేర్చుచు నొకతే
సొక్కుచు సోలుచు నొకతే
కృష్ణుని గ్రక్కున ముద్దిడు నొకతె
 
         ఇలా ఒక్కక్క గోపిక ఒకో రకం గా శ్రీ క్రిష్ణుడి పై తమ మమకారం అనురాగం తెలిసేట్టుగా అలంకరించుకొని బయలుదేరారు.


         యమునా నదితీరం మొనోహరం గా ఉంది. అందు మొట్టమొదట ఎఱ్ఱని పద్మములు, వాటి మీద వ్రాలే తుమ్మెదల నాదాలు, తెల్లటి ఇసుక తిన్నెలు, అనేక ఫల వృక్షములు, ఆ వృక్షములని చేరిన పక్షుల కిల కిలారవములు, ప్రక్కన మనోహరుడైన శ్రీ కృష్ణుడు. (చూడరే చెలులార యమునాదేవి, పంతువరాళి-ఆది).

         ఇక గోపికల ఆనందానికి అంతేముంటుంది? గోపకాంతలు మితి మీరిన యుత్సాహం తో ఆ యమునా తీరాన విహారాలు చేస్తూ, తమ యవ్వన గర్వమున మోహము చెంది తమ ఆనందాన్ని ఒకరితో ఒకరు వర్ణించుకున్నారు. (ఏనోము నోచితిమో చెలుల-పున్నగ వరాళి-రూపకం).

         శ్రీ కృష్ణుడి చిన్నపటినుంచి చేసిన చేష్టలన్ని ఏకరువుపెట్టారు. నువ్వు దుడుకు వాడివి, మా చీరలు దోచావు, బొట్టు పెట్టె నెపం తో దగ్గరకు పిలిచి పంటితో నొక్కవు, ఇలాంటి చేష్టలు చేసిన వాడివి నున్ను ఎలా నమ్ముతాము అని నిలదీసి అడిగారు. (ఏమని నెఱ నమ్ముకొందుము-సౌరాస్ట్రము-చాపు).

         శ్రీ కృష్ణుడు తక్కువ తిన్నాడా? వారికి తగిన సమాధానం ఇచ్చాడు. పూర్వము మందర పర్వతాన్ని ఎత్తిన విషయం, గజేంద్ర రక్షణ, వేద రక్షణ, కాళియ మర్ధన గుర్తు చేసాడు. (ఏమోమో తెలియక బలికేరు-సౌరాష్ట్రము-చాపు). వారి సౌందర్య వర్ణన కావించి, అభినందించాడు. గోపికలు శ్రీ కృష్ణుని ఇంకా ఆట పట్టించారు.

         అందరూ నౌక పైన బయలుదేరారు. ఆ దృశ్యం మనోహరం గా ఉంది.
గోపికలు కృష్ణుడి తో కలసి నౌకలో ఆనందిస్తున్నారు. కొంతమంది శ్రీ కృష్ణుని తమకు నచ్చినట్టుగా అలకరిస్తున్నారు .

         కస్తూరి తిలకం దిద్దేవాళ్ళు, చేలము కట్టె వారు, హారతులిచే వాళ్ళు, కొందరైతే పూజలు చేసేవారు మరికొందరు (గంధము పూయరుగా -పున్నాగ వరాళి).

         శ్రీ కృష్ణుడు గోపికల అందాన్ని పొగిడాడు. అభినందించాడు. వారితో సరస సల్లాపాలాడాడు. గోపికలు ఆమాటలకి కృష్ణుడి ఆట పట్టించారు. 



         " చాలు చాలు నీ యుక్తులు సారసాక్ష శ్రీకృష్ణా " (సావేరి-ఆది) 


 నీ కుటిల యుక్తులు తమ వద్ద సాగ వన్నారు. దేవతలకి కూడ అందని అందం తమది, ఆనందించమన్నారు. నౌక సాగిపోతొంది. గోపాలుడు అక్కడ ఉన్న ప్రతి గోపికకి ఆమెకి కావలన విధం గా కనిపిస్తున్నాడు. ఒకరి విషయం ఇంకొకరికి తెలియకుండ మసలుకుంటున్నాడు.

         ఈలోగా వారి నావకి రంధ్రం పడీంది. నీరు నావలోకి ప్రవహించటం మొదలయింది. గోపికలందరు భయపడి శ్రీ కృష్ణుని చేరారు. తమని ఎలా ఐనా కాపాడమని మొరపెట్టుకున్నారు. శ్రీ కృష్ణుడు వారి రవికలను తీసి రంధ్రం పూడ్చమని సలహా ఇచ్చాడు. గోపికలకు వేరే దారిలేక అలాగే చేసారు, కాని ప్రవాహ వేగం వల్ల అవికూడా కొట్టుకుపోయాయి.

         అప్పుడు శ్రీకృష్ణుడూ వారి చీరలతో రంధ్రం పూడ్చమన్నాడు. గోపికలకు ఆగ్రహం వచింది. మాగురించి ఏమనుకున్నావు? మాకు ప్రాణం కంటె మానమే ముఖ్యం అని ఎదురు తిరిగారు. తనపై నమ్మకం ఉంటె తను చెప్పిన విధంగా చెయ్యమని, లేకపోతే మరణమే అని కృష్ణుడు చెప్పటం వలన చివరకు గోపికలు తమ చీరలతో రంధ్రాన్ని మూసి తీరం చేరుతారు.

         ఇది క్లుప్తంగా నౌకా చరిత్ర. ఇందులో ఒక్కొక్క కీర్తనలో భక్తి భావం ఉట్టిపడుతుంది. ఈ ప్రభంధ అంతరార్ధం ఆలోచిస్తే బ్రతుకు అనే ఈ నౌకని కష్టాలలో, సుఖాలలో , అన్ని వేళలా దాటటానికి భగవంతుడు తోడు ఉండాలి. భగవంతుని నమ్మిన వాడు, ఈ సంసారం అనే సముద్రాన్ని జీవితం అనే నౌకతో చాలా సునాయాసం గా దాటగలడు అని అనిపిస్తుంది.

2 comments:

రహ్మానుద్దీన్ షేక్ said...

చూడబోతే మీరు తెలుగు వారిలా లేరు. మీ భాష పరభాషలా ఉంది!
త్యాగరాజు అన్నది తెలుగు పేరే, భాగవతోత్తముడు అని అనడం మన సంప్రదాయమే! అరవ వారిలా భాగవతార్ ఏంటి?

dokka srinivasu said...

సుబ్రహ్మణ్యం గారూ నమస్కారము. సుబ్రహ్మణ్యం గారూ నాకు మన భారతీయ సంస్కృతి మరియు సంప్రదాయములు అంటే అమితమైన ఆసక్తి. నేను భారతీయ సంస్కృతి మరియు సంప్రదాయములకు సంభందించి వివిధ రకములైన సేకరణలు చేస్తాను. వీటితో పాటు తీర్థములు, జాతరలు, పండుగలు మొదలగు సందర్భములలో కోలాటం, యక్షగానం, గరగలు, తోలుబొమ్మలాట మొదలగు కళారూపములని కూడా నేను సేకరించి వాటన్నింటిని నా భారతీయ సంస్కృతి (Heritage of India) బ్లాగులో పొందుపరుస్తాను.
అంతే కాకుండా నేను అప్పుడప్పుడు స్కూల్ మరియు కాలేజి విద్యార్దులకు మన భారతీయ సంస్కృతి మరియు సంప్రదాయముల మీద సెమినార్లు (seminars) ఇస్తాను. ఇది నేను విద్యార్దులకు ఇచ్చిన 3వ సెమినార్.
సుబ్రహ్మణ్యం గారూ మీకు నా భారతీయ సంస్కృతి (Heritage of India) బ్లాగు కనుక నచ్చితే నా బ్లాగులో మెంబర్ గా జాయిన్ (join) అవ్వగలరు. అలాగే బ్లాగులో కూడా తెలుగులో కామెంట్స్ (comments) కూడా ఇవ్వగలరు.

http://indian-heritage-and-culture.blogspot.in/2014/12/my-third-seminar-on-indian-heritage-and.html