Saturday, November 5, 2011

మోహనం - సన్మోహనం

  కర్నాటక సంగీతంలో అనేక జనరంజకమైన రాగలున్నాయి. శంకరాభరణం, కల్యాణి, ఆనందభైరవి, హిందోళం, మోహనం ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిష్టే తయారవుతుంది. ఐతే ఇక్కడ నేను చెప్పదలచు కున్నది ఒకేఒక్క రాగం గురించి- అది " మోహన రాగం". అదే ఎందుకు అని మీరు అడగవచ్చు. చదవండి. మీకే అర్ధమవుతుంది.

        సంగీత పరంగా మోహన రాగం:

        కర్నాటక, హిందుస్థానీ సంగీతంలో మోహన రాగానికి విశిష్ట స్థానం ఉంది. ఎంతో మంది వాగ్గేయకారులు ఈ రాగంలో ఎన్నో అద్భుతమైన రచనలు చేసారు. కారణం ఈ రాగం అన్ని వేళలా పాడ దగినది, నవరసాలను పలికించగలది కావటమే. సంగీతం తెలిసిన వారినైనా, తెలియని వారినైనా ఒకేలా ఆకట్టుకునే రాగం మోహన రాగం.

        మోహన రాగం 28 మేళకర్త అయిన హరికాంభోజి అనే రాగానికి జన్యం. ఔఢవ-ఔఢవ రాగం. అంటే ఈ రాగం ఆరోహణ, అవరోహణలో కూడా కేవలం ఐదు స్వరాలే ఉంటాయి. అవి...

1. షడ్జమం (స)
2. చతుశృతి రిషభం (చ. రి)
3. అంతర గాంధారం (అం.గ)
4. పంచమం (ప)
5. చతుశృతి ధైవతం (చ.ద)
        అంటే స, రి, గ, ప, ద, స - స, ద, ప, గ, రి, స అనేది ఈ రాగం ఆరోహణ అవరోహణలన్న మాట. సంగీతం నేర్చుకునేప్పుడు వచ్చేగీతాలలో "వరవీణ మృదుపాణి" అనే గీతం చాలా మందికి తెలిసిందే. ఇది మోహన రాగంలోని గీతమే.


        కర్నాటక సంగీతంలో మోహన రాగంలో వచ్చిన కొన్ని ప్రసిద్ధ రచనలు:
1. నిన్ను కోరి (వర్ణం)
2. ననూ పాలింప (త్యాగరాజ కృతి)
3. ఎవరూరా నిను వినా (త్యాగరాజ కృతి)
3. బాల గోపాల ( నారాయణ తీర్ధులవారి తరంగం)
4. రక్త గణపతిం భజేహం (ముత్తుస్వామి దీక్షితార్ కృతి)
5. చందన చర్చిత (గీతాగోవిందం-జయదేవ)
6. రతి సుఖసారే (గీతాగోవిందం-జయదేవ)
7. రామా నిను నమ్మిన వారము (త్యాగరాజ కృతి)
8. మాటిమాటికి తెల్పవలెనా (త్యాగరాజ కృతి)
9. భవనుత (త్యాగరాజ కృతి)
10. మోహన రామ (త్యాగరాజ కృతి)
11. చేరి యశోదకు శిశువితడు (అన్నమాచార్య కృతి)
        పైన చెప్పినవి కొన్ని ప్రసిద్ద కీర్తనలు మాత్రమే.




 సినిమా సంగీతంలో మోహన రాగం:

        సినిమా సంగీతంలో మోహన రాగాన్ని వాడినంతగా వేరే ఏ రాగాన్ని వాడలేదనుకుంటా. కారణం ఏమిటంటే పైన చెప్పిన విధంగా ఈ రాగంలో నవరసాలు పలికించవచ్చు. ఉదాహరణకి....

లాహిరి లాహిరి లాహిరిలో -అని అలలపై తేలిపోయే ప్రణయ గీతానికైనా, చెంగు చెంగునా గంతులు వేయండి -అనే ఉత్సావంతమైన పాటకైనా, ఘనా ఘన సుందరా -అనిగానీ, శివ శివ శంకరా భక్త వశంకర -అని దేవుణ్ణి వేడుకొన్నా, మధుర మధురమీ చల్లని రేయీ -అని ప్రణయలోకాల్లో తేలిపోయినా, ఈ నల్లని రాళలో ఏ కన్నులు దాగెనో -అంటు ఊహల్లో విహరించినా....
        ఈ రాగంలోనే సాధ్యం. ఈ పాటలు ఎంత ప్రసిద్ధి చెందాయంటే వీటిని వేరే రాగంలో వేరే ట్యూన్ లో ఊహించటం కూడ కష్టం.


        ఎస్. (సుస్వర) రాజేశ్వరరావు గారు ఈ రాగాధారంగా అనేక పాటలకు సంగీతం అందించారు. ' వినిపించని రాగాలే ' (చదువుకున్న అమ్మాయిలు - సుశీల), ' చూడుమదే చెలియా ' (విప్రనారాయణ - ఏ.ఎం.రాజ), మధుర మధురమీ చల్లని రేయీ (విప్రనారాయణ - ఏ.ఎం.రాజ, పి.భానుమతి), మదిలో వీణలు మ్రోగే (ఆత్మీయులు - సుశీల) కొన్ని అద్భుతమైన మోహన రాగంపై ఆధారితమైన సినిమా పాటలు.


        నాకు తెలిసిన పాటలు కొన్ని ఇక్కడ రాస్తున్నాను. మీకు తెలిసినవి నాకు చెప్పండి.
1. లాహిరి లాహిరి లాహిరిలో -- మాయాబజార్
2. ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి -- అప్పు చేసి పప్పు కూడు
3. చంగు చంగున గంతులు వేయండి -- నమ్మిన బంటు
4. శివ శివ శంకర భక్త వశంకర -- భక్త కన్నప్ప
5. ఈ నాటి ఈ హాయీ కల కాదోయి నిజమోయి -- జయసింహ
6. మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును-- గుండమ్మ కధ
7. మధుర మధురమీ చల్లని రేయి -- విప్రనారాయణ
8. చూడుమదే చెలియా -- విప్రనారాయణ
9. కనులకు వెలుగువు నీవే కాదా -- భక్త ప్రహ్లాద
10. పాడవేల రాధిక -- ఇద్దరు మిత్రులు
11. నిన్ను కోరి వర్ణం -- ఘర్షణ
12. మనసు పరిమళించెనె -- శ్రీకృష్ణార్జున యుద్ధం
13. ఘనా ఘన సుందరా -- భక్త తుకారాం
14. తెల్లవార వచ్చె తెలియక నాసామీ -- చిరంజీవులు
15. తెలుసుకొనవె యువతి -- మిస్సమ్మ
16. సిరిమల్లె నీవే -- పంతులమ్మ
17. ఐనదేమో ఐనది -- జగదేకవీరుని కధ
18. మోహన రాగమహా -- మహా మంత్రి తిమ్మరుసు
19. పలికినదీ పిలిచినది -- సీత రాములు
20. చందన చర్చిత -- తెనాలిరామకృష్ణ
21. పులకించని మది పులకించు -- పెళ్ళికానుక
22. తిరుమల గిరివాసా -- రహస్యం
23. వే వేల గోపెమ్మల మువ్వా గోపాలుడె -- సాగర సంగమం
24. గోపాల జాగేలరా --- భలే అమ్మాయిలు
25. ననుపాలింపగ నడచీ వచ్చితివా -- బుద్ధిమంతుడు
26. రతిసుఖ సారె -- జయదేవ
27. జ్యోతి కలశ చలికే -- (హింది - భాభీకి చుడియా)
28. సయొనారా సయినారా -- (హింది - లవ్ ఇన్ టొక్యో)
29. ఆ మొగల్ రణధిరుల్ -- (ఘంటసాల వారి ప్రైవేటు ఆల్బం)
30. భారతీయుల కళా ప్రాభవమ్మొలికించి -- (ఘంటసాల వారి ప్రైవేటు ఆల్బం)
        ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఎన్నెన్నో పాటలు ఉన్నాయి. తరచుగా అవే పాటలను వింటుంటె, మీరు కూడ ఏ పాట మోహనంలో ఉందో ఈజీగా చెప్పేయ గలరు. ప్రయతించండి.


        ( నాకు ఉన్న మిడిమిడి జ్ఞానంతో, అది మీతో పంచుకోవాలనే ఆశతో, ఏదో రాయాలనే ఆత్రంతో ఈ ఆర్టికల్ రాసాను. నచ్చితే మెచ్చుకోండి, బాగాలేకపోతే విమర్శించండి. తప్పులుంటె క్షమించండి. ) 

4 comments:

Disp Name said...

మీ కూర్పు బాగుందండి. ఆ ఫాంటు సైజు కొద్ది పెద్దది చేసారంటే చదవడానికి వీలుగ ఉంటుంది. మీ టపాలలో విభిన్నత్వం కనిపిస్తున్నది. చాల మంచి విషయాలు చెబుతున్నారు. మీ సబ్జక్ట్ అయిన జియో ఫిజిక్స్ గురించి కూడా కొంత రాస్తే బ్లాగ్ చదువరులకి కొత్త విషయాలు తెలిపిన వారైవుతారు.

D. Subrahmanyam said...

ధన్యవాదములు జిలేబిగారు గారు :) మీసూచన తప్పక పాటిస్తాను. ఇకపోతే జియోఫిజిక్స్ గురించి తెలుగులో వ్రాయటం కొంచం కష్టం ముఖ్యంగా పరిభాషిక పదాలు (technical terms) తెలుగులో నాకుతెలియవు.

Disp Name said...

భలే వారండీ, తెలుగు బ్లాగుల్లో అంతా తెలుగులోనే ఉండాలనే రూలేమీ లేదు కదా. ఆ పదాలు తెలుగు లో లేకపోతె ఆంగ్లం లోనే రాయండి. వాటి ఆ గురించి -ఆ సబ్జెక్ట్ గురించి అవగాహన అంతే అన్న మాట

Unknown said...

DS గారూ , నమస్తే.
టూకీగా అయినా చాలా చక్కగా రాసారు.
నేను కూడా ఒకటి రెండు ముచ్చట్లు మీతో పంచుకుంటాను.
మోహన రాగం ప్రపంచంలో చాలా దేశాల సంగీతం లోనూ వినిపిస్తుందని పెద్దలు చేబుతారు.
అద్భుతమైన కీర్తనలు సరే సరి, ఇంకా ప్రేమ గీతాలే కాదు ఇంచు మించు నవరసాలన్నిటినీ మోహనలో పలికించవచ్చునట. కొన్ని ఉదాహరణలు :
విజయోత్సాహం లో లవకుశులు పాడిన “లేరు కుశలవుల సాటి...”, కోపంలో నాగమ్మ “పలనాడీతని తాతదా.....” (పల్నాటి యుద్ధం – భానుమతి పద్యం) ; భక్తి పారవశ్యంలో తిన్నాడు పాడిన “దేవా......” అనే అద్భుతమైన పద్యం .(కాళహస్తి మాహాత్మ్యం – ఘంటసాల ), రాయబారంలో శ్రీకృష్ణుడు “చెల్లియో, చెల్లకో...” (షణ్ముఖి ఆంజనేయ రాజు పద్యం). ఇలా పాటలు, పద్యాలు ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చును
ఇకపోతే – మీరు జియోఫిజిక్స్ రాయడం గురించి. తెలుగు-ఇంగ్లీషు రంగరించి చక్కగా రాయవచ్చు. ఈ విషయంలో డా. వేమూరు వెంకటేశ్వర రావు గారు “సుజనరంజని” లో “నిత్య జీవనంలో రసాయన శాస్త్రం” అద్భుతంగా రాస్తున్నారు. లంకె ఇదిగో : http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/sep14/rasayanam.html
చూడండి, మీకేమైనా స్పూర్తినిస్తుందేమో.
భవదీయుడు
బాలాంత్రపు వేంకట రమణ
సనా, రిపబ్లిక్ అఫ్ యెమెన్