Monday, December 12, 2011

కాఫీ దండకం

ఈ కాఫీ దండకం పోకూరి కాశీపతి అనే అవధాన పండితునిచే రచించబడినది. ఒకసారి ఆయన అవధానం కోసం చెన్నపట్టణం చేరుకుని సరాసరి సభాస్థలికి చేరుకున్నారు. సభా ప్రారంభానికి ముందు సభా నిర్వాహకులు ఆయనను కాస్త కాఫీ సేవించవలసిందిగా కోరారు. సగంకప్పుతాగినంతలో సభానిర్వాహకులు ఆయనను సభావేదికనలంకరించవలసిందిగా కోరారు. ఆ సమయంలో అదే సభలో ఉన్న "ఆంధ్రవిశారద" తాపీ ధర్మారావు గారు ఆయనను సేవించిన కాఫీ మీద దండకం చెప్పమని అవధానిగారిని కోరారు. అలా ఉధ్భవించినదే ఈ కాఫీ దండకం.


దండకం


         శ్రీమన్మహాదేవీ, లోకేశ్వరీ, కాళికాసన్నిభాకారిణీ, లోకసంచారిణీ, అంబ కాఫీ జగన్మోహినీ తల్లి శ్రీకృష్ణుడా స్వర్గమున్ జేరివూతంబునౌ పారిజాతంబున్ దెచ్చియున్, నాతికిన్ ప్రీతిగా నిచ్చు కాలంబునందా సుమంబందునం గల్గు బీజంబు లుర్విస్థలిన్ రాలియున్ లోకభేదంబుచే గాఫీ  భూజంబుగా బుట్టియున్, గొమ్మలన్, రెమ్మలన్, బూవులన్, దావులన్, జక్కనౌ పిందెలన్, జిక్కనౌగాయలన్, జొక్కమౌ పండ్ల భాసిల్ల దద్బీజజాలంబు నైర్లండు, నింగ్లండు, హాలెండు, పోలెండు, రష్యా, జపాన్, జర్మనీ, గ్రీకు దేశంబులన్ నాటి పెన్ మ్రాకులై ఇండియన్ దోటలై విత్తనాలిచ్చుచున్నావటంచున్ మదిన్ దోచెనే , బాపురే, తీపిలో, నీరమున్, క్షీరమున్, జెక్కెరన్, మించిటంగాదే నీ బీజ చూర్ణంబు, నా మూటిలో జేర్చి సేవించుటన్ నీదు బీజంబులన్ బెంచులో మాడ్చి చూర్ణమ్ము గావించినన్ దీపిపోదాయె నీ మాధురీ శక్తి, నీ యింపు, నీ సొంపు, నీ పెంపు వర్ణింప నేనెంతవాడన్ ధనాకర్షిణీ, ప్రాణ సంరక్షిణీ, ధాత్రి నెవ్వారలేన్ వేకువన్ లేచియున్ నిత్యకృత్యంబులన్ దీర్చి, మున్ ముందుగా నిన్ను బానంబు గావింపకున్నన్ ద్విజుల్ వేదమంత్రంబులన్ బల్కగాలేరు, ప్రాంచత్కవుల్ పద్యముల్ హృద్యమౌరీతి నిర్మింపగాలేరు, శ్రావ్యంబుగా శౌరిదాసుల్ గళం బెత్తుయున్ బాడి నృత్యంబులన్ సేయగాలేరు, శిల్పుల్ మనస్పూర్తిగా సుత్తి చేపట్టగాలేరు, వైశ్యోత్తముల్ కొట్ల తాళంబులన్ దీయగాలేరు,   డ్రైవర్లు మోటార్ల స్టీరింగులన్ బట్టగాలేరు, టిచర్లు పాఠంబులన్ జెప్పగాలేరు,    డాక్టర్లు నింజక్షనులన్ జేయగాలేరు, ప్లీడర్లు నోరెత్తి వాదింపగాలేరు, జడ్జీలు నానల్పమౌరీతి తీర్పులన్ వ్రాయగాలేరు, దిట్టంబుగ బాలసుల్ కూట సాక్ష్యంబులం జెప్పగా లేరు, వారాంగనల్ కోడెగాండ్రన్ వెనస్ గేళిలో నోలలాడింపగా లేరు, ముప్పూటలన్ నిన్నొగిన్ గ్రోలకున్నన్ శిరోభారమై నాల్క ఎండున్, మనంబెంతో చాంచల్యముంబొందుచున్ గుండియల తల్లడంబందుచున్, మేను కంపించుగాదే, కటాక్షంబుతో నిత్యమున్ వేకువన్ దర్శనమ్మిచ్చి నిన్ బాగుగం త్రాగు సౌభాగ్యమున్ గూర్చి రక్షింపవే సారెకున్ గొల్చెదన్ విశ్వకర్మాన్యంబందునన్ సత్కవీంద్రుడనన్, పోకూరి కాశీపతి స్వాంత రాజీవ సంవాసినీ నీకికన్ మంగళంబౌ మహా కాఫీ దేవీ నమస్తే నమస్తే నమస్తే నమో నమః 

3 comments:

శ్యామలీయం said...

ఈ దండకం ప్రచురించినందుకు ధన్యవాదాలు. చాలా ఛందోభంగాలూ, ముద్రారాక్షసాదులు దొర్లాయి. దయచేసి క్రింది విధంగాసవరించవలసినది.

తప్పనిసరి సవరణలు:
అంబా కాఫీ --> అంబ కాఫీ
జగన్మోహినీ తల్లీ --> జగన్మోహినీ తల్లి
నాతికిన్ ప్రీతిగ నిచ్చు --> నాతికిన్ ప్రీతిగా నిచ్చు
గాఫీబూజంబుగా --> గాఫి భూజంబుగా
మదిన్ దోచెన్, బాపురే --> మదిన్ దోచెనే, బాపురే
సేవించుటాన్ --> సేవించుటన్
బెంచులో ---> ???
నీ మధుర శక్తి --> నీ మధురీ శక్తి
గళాంబెత్తుయున్ --> గళం బెత్తుయున్
తాళంబులన్ దీయగలేరు --> తాళంబులన్ దీయగాలేరు
స్టీరింగులన్ బట్టగలేరు --> స్టీరింగులన్ బట్టగాలేరు
పాఠంబులన్ జెప్పాగాలేరు --> పాఠంబులన్ జెప్పగాలేరు
నేసల్పమౌరీతి --> నానల్పమౌరీతి
కూట సాక్ష్యంబుల --> కూట సాక్ష్యంబులం
ముప్పూటాలన్ నిన్నాగిన్ --> ముప్పూటలన్ నిన్నొగిన్
మనంబెంతో చాల చాంచల్యముం --> మనంబెంతో చాంచల్యముం
గుండీయల --> గుండియల్
వేకువన్ దర్శనమిచ్చి --> వేకువన్ దర్శనమ్మిచ్చి
బాగుగ త్రాగు --> బాగుగం త్రాగు
విశ్వకర్మన్యంబందునన్ --> వి శ్వకర్మాన్వయంబందునన్
మహా కాఫీ దేవీ --> మహా కాఫి దేవీ

శ్యామలీయం said...

సవరణ:

'బెంచులో మాడ్చి' అన్నచోట బెంచులో అంటే యేమిటో స్పష్టం కావటం లేదు. బహుశః 'ప్రొయ్యిలో మాడ్చి' అని యేమో!

నీ మధుర శక్తి --> నీ మాధురీ శక్తి

D. Subrahmanyam said...

Thank you very much SyAmalIyaM gAru for the corrections. In fact I am just looking for the original from which I collected this long back. I will recheck this again for other errors if any.
Regards