Friday, November 30, 2012

చిత్రం - భళారే విచిత్రం


నిన్నసాయంత్రం టి.వి న్యూస్ లో ఒక వార్త.

కూతురికి మొహం మీద కాల్చి వాతలుపెట్టిన కన్నతల్లి. కారణం 10 రూపాయలు తీసిందని అనుమానం. నిజమే ఆపిల్ల కి మొహం నిండా కాలిన మచ్చలున్నాయి. ఒంటి నిండా దెబ్బల గుర్తులు. పిల్ల వయసుకూడా ఎక్కువలేదు. మహా ఐతే తొమ్మిదో పదో ఉంటాయి. భాద అనిపించింది. దానికితోడు టి.వి. వాళ్ళుకూడా వాళ్ళ ఓపికకొద్ది ఆ తల్లిని తిట్టి మరీచూపించారు. నిజమే పిల్లలపై ఇలాంటి అగాయిత్యాలు చాలా భాదాకరం. తప్పక ఖండించాలి. ఖండిస్తున్నాను కూడా.

ఈరోజు ఉదయం ఒక వార్త విని నిజంగానే మూర్చవచ్చినంత పని అయ్యింది. ఒక పిల్లవాడి తల్లితండ్రులు వాడు సరిగా చదవటం లేదని మందలించారుట. వాడు పెద్ద వయసువాడు కాదు. పెద్ద క్లాసులూ కావు. అల్లరి చిల్లర పనులు చేస్తు తిరగకు అని మందలించినందుకు పిల్లవాడు అలిగి సరాసరి పోలీసు ష్టేషనుకి వెళ్ళి వాళ్ళమీద కంప్లయింటు చేసాడుట. నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి.

స్కూలులో టీచర్లు మందలించకూడదు, ఇంట్లో తల్లితండ్రులు చెప్పకూడదు. ఇంక మనపిల్లల భవిష్యత్తు ఏమిటో దేవుడా. ప్రతి విషయమూ అతిగానే ఉంటున్నాయి. అటు టీచర్ల దండనలు, ఇటు తల్లితండ్రుల ఆత్రం, ఎక్కదికి వెల్తున్నాము మనం? నా చిన్నప్పుడు ఇలా ఉండేది కాదు. మీ సంగతీ అంతేనా??

Monday, May 21, 2012

బందరు -- నీ పాత పేరేమిటి?

ఈమధ్య ఆరుద్రగారి వ్యాస సంపుటిలో ఒక ఆసక్తికరమైన వ్యాసం చదివాను. ఆసక్తి కరమైనది అని ఎందుకన్నాను అంటే ఆయన లేవనెత్తిన ప్రశ్న అలాటిది. ' బందరు ప్రాచీననామం ఏమిటి? " అనేది ఆవ్యాసం సారాంశం.   అవ్యాసానికి సంభందించిన సంగతులు ఆసక్తి కలవారితో పంచుకుందాం అన్నదే ఈ చిన్న పోష్టు ముఖ్యోద్దేశం.

ప్రాచీనకాలంలో మనదేశానికి అనేకమంది యాత్రికులు వచ్చి వారి అనుభవాలు వారు చూసిన వివిధ ప్రదేశాలు మొదలైనవి గ్రందస్థం చేసారు. అలాంటి వారిలో ప్లవి టోలెమీ అనేవారలు ప్రాగాంధ్ర తీరంలోని
కొన్ని ప్రదేశాలు వారి రచనలలో పేర్కొన్నారు, వాటిలో ' కొంటికపిల ' ' కోడూర ' మైసోలియా అన్నవి కొన్ని పేర్లు. తరువాతి కాలంలో కొంటికపిల అంటే ఘంటసాల గా, కోడూర అంటే బందరు దగ్గరి గూడూరుగా చరిత్ర కారులు గుర్తించారు. అయితే మైసోలియా అంటే ఇంతవరకు ఇతిమిద్దంగా ఏదీ అనేది ఇంతవరకు ఎవ్వరు నిర్ధారించ లేకపోతున్నారు. కొంతమంది మైసోలియా అంటే మచిలీపట్నమే అని వాదిస్తున్నా అది తప్పనే భావనే చాలామందికి ఉంది. కారణం టోలెమీ క్రీ.శ. 2 శతాబ్ధి వాడు. అప్పటికి మచిలీపట్నం లేదు కాబట్టి మైసోలియా బందరు కావటానికి వీలు లేదని కొంతమంది వాదన.

మళ్ళీ మొదటికి వచ్చాం. అసలు బందరు ప్రాచీన నామం ఏమిటి?? ఎన్నో కథలు చెప్తారు. బంధుడు అనే చేపలవాడు పట్టిన గొప్ప మత్యం వలన ఆ వూరికి మచిలీ బందరు అనే పేరు వచ్చిందని, మత్యపురి, బృందావనం అనే పేర్లు కూడా ఇదివరలో బందరుకు ఉన్నాయని అ కధలలలో కొన్ని. బందరుకు దగ్గరలో ఉన్న ఘంటసాల, గూడూరు మాత్రమే ప్రాచీన పట్టణాలు కానీ బందరు ప్రాచీనం కాదని వాదించే వాళ్ళు ఉన్నారు.

పదునాలుగో శతాబ్దంకి ముందు బందరు లేదనేవాళ్ళున్నారు. కారణం అప్పటికి దొరికిన శాసనములు. గార్డెన్ మెకంజీ వ్రాసిన ప్రకారం, మొట్టమొదటిసారిగా మచిలీపట్నం అనేపేరు ఆ ఊళ్ళోకట్టిన ఒక మసీదులోని శాసనంలో కనపడిందట. ఆ శాసనకాలం 1425. అంతకుముందు వంద సంవత్సరాల పూర్వం అరబ్బు ఓడవర్తకులు మచిలీపట్నాన్ని వలసగా నిర్మించారని మెకంజీ కధనం. అరబ్బు వర్తకులు రావటనికి పూర్వం ఆగ్రామం చేపల రేవేకానీ వ్యాపార కేంద్రం కాదు. అయితే 1397 నాటికే బందరులో దేవాలయాలు ఉన్నాయి. వాటి గోడలమీద శాసనాలు ఉన్నాయి. ఐతే వాటి సంగతి ఎవ్వరూ పట్టించుకోవటం లేదు.

బందరులో రామలింగేశ్వర స్వామి ఆలయంలో, రంగనాథ స్వామి ఆలయంలో ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో శాసనాలున్నాయి.

ఏకాంబరేశ్వరస్వామి ఆలయంలో గర్భాలయ ద్వారంకి ఇరువైపులా రెండు శాసనాలున్నాయి. అందులో కుడిప్రక్కన శాసనం క్రీ.శ. 1370 నాటిది. ఈ శాసనంలో, మొదటిసారి ' కడలిపురం ' అనే పేరు కనబడుతుంది. ఎడమవైపు శాసనం క్రీ.శ 1395 నాటిది. ఇందులో కూడా ' కడలిపురం ' అనే నామం కనబడుతుంది. బందరు కడలి (సముద్రం) తీరాన్న ఉందికాబట్టి కడలి పురం ఇవి రెండు ఒకటే కావొచ్చు.

ఐతే ఆంధ్రప్రదేష్ హిస్టరీ కాంగ్రస్ అనే సమావేశంలో ఇంగువ కార్తికేయ శర్మ గారు, బందరు ప్రాచీన నామం ' ముచిలింద నగరం ' అని నిర్ణయించారు. కారణం సింహళ బౌద్ధ గ్రంధాలలో ముచిలింద నగరం ప్రసక్తి ఉన్నది. ముచిలిందందుడు బుద్ధుడిని గాలివాన నుంచి రక్షించిన ఘట్టం చాలాప్రాముఖ్యం చెందింది. ఆ ముచిలిందుని పేర ముచిలింద నగరంగా ఏర్పడి కాలక్రమేణా మచిలిపట్నం గా మారిందా? ఎమో ఈ సంగతులని నిర్ధారించటానికి ప్రమాణాలు వెదకాలి. శాసనాలను త్రవ్వి తీయాలి.  కష్టపడాలి.

ఇంతకీ ఓ బందరూ నీ పాత పేరేమిటీ?
ముచిలింద నగరమా?, కడలిపురి ఆ? బందరు మచిలి ఆ? లేక ఇంకేదైనా నా?


Sunday, January 8, 2012

గాలిపటం... గాలిపటం

సంక్రాంతి వచ్చేసింది. ఆడవాళ్ళంతా పొద్దున్నే లేచి రాత్రి కష్టపడి ప్రాక్టిసు చేసిన ముగ్గులు వేస్తున్నారు. పిల్లకాయలు తము కొనుక్కున్న గాలి పటాలన్ని లెక్కలుచూసుకుంటున్నారు. ఎవరిదగ్గర ఎంత మాంజా ఉందో, అది సరిపోతుందో లేదో, ఒకవేళ కొత్త మంజా కావాలంటే ఏ షాపు నుంచి తెచ్చుకోవాలో అని ఆలోచనలలో ఉన్నారు. మా ఆవిడ ఇచ్చిన వేడి కాఫీ తాగుతు పేపరు పట్టుకుని మధ్య మధ్యలో వాళ్ళ హడావుడి చూస్తు నేను. ఇల్లంతా పిల్లలతో వాళ్ళ ఫ్రండ్స్ తో కోలాహలంగా ఉంది. వాళ్ళ హడావుడి చూస్తుంటే ఎదో యుద్ధానికి వెళ్ళే సైన్యం లా అనిపించింది.


        "   అవును మరి ఇది ఒకరకమైన యుద్ధమే కదా " అనుకున్నా మనసులో.

        ఒక్కసారి మనసులో నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. ఆ రోజుల్లో సంక్రాంతి అంటే ఎంత హడావుడి చేసేవాళ్ళమో. అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలావరకు తగ్గిపోయింది అనిపించింది. "ధరలు బాబూ, ధరలు" అనుకున్నా నాకు నేనే నచ్చచెప్పుకున్నట్లు. ఇప్పటివాళ్ళకు ఆనాటి గాలిపటాల పేర్లైనా సరిగా తెలుసో లేదో. పతంగులు అనేవాళ్ళు.

        ఎన్ని రాకాల పేర్లు ఉండేవి? సరిగా గుర్తులేవు. నమందార్, జీబా, లంగోటి, గుడ్లందార్, బనియందార్, గుడ్డి లంగోటి, గిల్లోరాడప్పన్, డోరేదార్, అద్దా, ఇవి కొన్ని గుర్తున్నాయి. హ హ భలే పేర్లు. నామందార్ అన్నా జీబా అన్నా ఒకటే. పతంగి పైన ఒక నామం ఉంటుంది. లంగోటి అంటే పతంగి అడుగున ఒక చిన్న గౌనులాగా, గుడ్లందార్ అంటే రెండు కళ్ళు, బనియందార్ అంటే చారల పతంగి, గుడ్డి లంగోటి అంటే ఒంటికన్ను, కింద గౌను. గిల్లోరాడప్పన్ అంటే సరిగా గుర్తులేదు. దోరేదార్ అంటే పతంగి చుట్టురా కాగితానికి దారం పెట్టేవారు. అద్దా అంటే పెద్ద గాలిపటం.

        సంక్రాంతికి ఒక్కొక్కళ్ళకి పది రూపాయలు ఇచ్చేవారు నాన్న. నేను మా అన్నయ్య ఇద్దరం మా చెల్లెల్లకి మస్కా కొట్టి వాళ్ళ డబ్బులు కూడా స్వాహా చేసేవాళ్ళం. అది వేరే సంగతి అనుకొండి. పతంగుల ధరలు అతిచిన్న పతంగి ఒక పైసా, 3 పైసలకి మధ్యరకం, 5 పైసలకి కొంచం పెద్ద గాలిపటం వచ్చేవి. దోరేదార్ 10 పైసల నుండి మొదలయ్యేవి. అద్దా అటు ఇటుగా 50 పైసలు నుంచి రూపాయి ఉండేది. గీటీ మాంజా 10 పైసలు. గీటి దాదాపు 20 లచ్చాలు. అంటే అంగుష్టాం నుంచి చిటికిన వేలుకి మధ్య దారాన్ని 20 సార్లు చుట్టి ఇచ్చేవాళ్ళు. అప్పట్లో చార్మినార్ దగ్గర గుల్జారాస్ మాంజాలకి చాలా ప్రసిద్ధంగా ఉండేది. ఒక సాదా దారపు రీలు 50 పైసలుండేది. చరఖాలంటివి కొనేవాళ్ళం కాదు. మా ఇంట్లో పాత పాండ్స్ డబ్బాలకి చుట్టు వాడేవాళ్ళం. 

 అస్సలు మా హడావుడి పండగకి వారం ముందు నుంచే మొదలయ్యేది. పాత సీసాలు పోగుచేసి అవి పగలకొట్టి, పొడిచేసి, వస్త్రంపట్టి, అన్నం మెత్తగా వండి, అందులో ఈ సీసాపొడీ కలిపి, రంగుకోసం కాస్త పసుపో, కుంకుమో కలిపి దారాన్ని సందు ఈ మొదలు నుంచి ఆ చివరదాకా కట్టి ఆ అన్నం ముద్దని దారానికి పట్టించి మాంజా చేసేవాళ్ళం. గాజు పొడి దారానికి పట్టుకోవటానికి యూనివర్సిటి వెళ్ళి కలబంద ఆకులు తెచ్చి లోపలి గుజ్జు తీసి అన్నం ముద్దకి కలిపేవాళ్ళం. మాకు అదొక పెద్ద అడ్వెంచర్ లా ఉండేది.


        భోగి మంటకి అందరిళ్ళల్లో ఉన్న పనికిరాని సామాన్లన్ని పోగుచెసేవాళ్ళం. చిత్తు కాగితాలు, ఎండిపోయిన ఆకులు ఒకటేమిటి "కాదేది దహనానికి అనర్హం" అనేలాగా దొరికినవన్ని భోగి నాడు పొద్దున్న తగలడిపోయేవి. మా సందు కూడలిలో భోగి మంట వేసేవాళ్ళం. పొద్దున్నే 5 కే లేచి అందరి ఇళ్ళకి వెళ్ళి మంట వేస్తున్నాం అని చెప్పి లేపి అప్పుడుగానీ మొదలెట్టెవాళ్ళం కాదు. ఒక గంట దాకా అదొక హంగామా.

        అది ఐపోగానే కొనుక్కున్న పతంగులకి కన్నాలు కట్టటం అనే మహాకార్యానికి నాంది పలికే వాళ్ళం. అమ్మో అందులో ఎన్ని రకాలో. కన్నాలు కట్టటం అంటే, సూత్రం కట్టటం అన్నమాట. డీల్ కన్నాలు, కీంచ్ కన్నాలు, బొమ్మ కన్నాలు ఇలా అనేక రకాలుండేవి. డీల్ కన్నాలంటె పతంగి దాలిలో గిరికీలు తిరుగుతూ ఎగురుతుంది. ఎక్కువ గిరికీలు తింటే పట్టుకోవటం కష్టం. చేతులు లాగేస్తాయి. ఒక్కప్పుడు (ఒక్కక్కప్పుడేమిటి చాలా సార్లే) అది అలా తిరుగుతూ వెళ్ళి ఏ చెట్టుకొమ్మల్లోనో ఇరుక్కునేది. కీంచ్ కన్నాలంటే పతంగి దారం లాగినప్పుడు సర్రు మని పైకి లేస్తుంది. పేంచీ వేసేప్పుడు ఈ కన్నాలు చాలా ఉపయోగం. ఈ కన్నాలుంటే పతంగి చాలా బరువు ఉంటుంది. పేంచీ అంటే పతంగుల లడాయి అన్నమాట. ఇంక బొమ్మ కన్నాలంటే పతంగి గాలిలో కదలకుండ బొమ్మలా ఉండిపోతుంది. ఎంత దారం వదిలినా అలా పైకి వెల్తుందే తప్ప అటూ ఇటూ కదలదు. టైంపాస్ కి ఇది బెష్టు. పేంచి టైం లో కూడా చాలా గొప్పభాష ఉండేది. పిలావ్, కాటే, డీల్ చోడో, లప్టావో, కీంచ్ లియా, లూట్ లియా, లాంటివి.

        ఇక సాఫ్ ఐన పతంగులు పట్టుకోవటం కూడా ఒక కళే. ఎన్నో రకాల ఎత్తులు. దొరికివాటిల్లో పెద్ద బొంగు తీసికుని దానికి చివర ఎండిపోయిన కొన్న గట్టిగా కట్టేవాళ్ళం. పతంగి కిందకి వచ్చేలోపలే మనం మన బొంగుతో దాన్ని పట్టెసేవాళ్ళం. కానీ వెంటనే కిందకి దించితే పక్క వెధవలు కుళ్ళుతో చింపేసేవాళ్ళు. అందుకని రెండు నిముషాలు అలానే ఉంచి వాళ్ళు వెళ్ళాక నెమ్మదిగా దించి తీసుకొనేవాళ్ళం. 

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని సాహసాలో సంక్రాంతి పండుగకి. అదొక ఆనందం. ఈ టివీలు, కంప్యూటరులు వచ్చాక ఆ సంబరాలు తగ్గాయనే చెప్పాలి. మళ్ళీ ఆ పాత రోజులు ఎప్పుడొస్తాయో.


        "   ఏమండి మనంకూడా మేడ మీదకి వెళదామా? పిల్లలు పతంగులెగరేస్తున్నారు. చూద్దాం"    అన్న భార్యామణి మాటలతో మళ్ళీ ఈలోకంలోకి వచ్చా.

        "   సరే పదా"   అంటూ మేడ మీదకి దారితీసా పతంగులాడుకోవటానికి, కాదు పిలాయించటానికి.

        ఇంత ఆనందమయ సమయంలో మిత్రులందరికీ

        సంక్రాంతి శుభాకాంక్షలతో...


        మీ మిత్రుడు,  సపరివార సమేతంగా. 

Friday, December 16, 2011

నమ్మండి-నమ్మకపొండి


మన జీవితంలో ఎంతో మందిని కలుస్తుంటాము. ఎన్నో సంఘటనలు తారసపడుతుంటాయి. చాలావరకు సామాన్యమైనవిగానే ఉన్నా కొన్ని సంఘటనలు మర్చిపోలేము. కొన్ని సంఘటనలను నమ్మలేము. మన కళ్ళు మనలని మోసం చేసాయా అనిపిస్తాయి. ఎందుకంటే అటువంటి సంఘటనలు మన దైనందిన జీవితాల్లో కనపడవు. కొన్ని సార్లు మనకి తెలిసినా ఎదో కాకాతాళీయంగా జరిగింది అని వదిలేస్తాము. చాలావరకు సంఘటనలు ఇలాంటివే.

అవి నెను 9 తరగతి చదువుకునే రోజులు. హైదరాబాదులో విద్యానగర్లో ఉండేవారము. ఆరోజు ఆదివారం అవటం వలన నేను మా ఫ్రండ్ ఉదయ్ ఇంట్లోనే ముందు వసారాలు చెస్ ఆడుకుంటూ కూర్చున్నాము. మా అమ్మ వంతింట్లో పూజ చేసుకుంటూ వంటపనిలో ఉంది. ఈలోగా బయట అమ్మా అనే పిలుపు వినిపించింది. ఎవరో ముష్టివాడు అనే ఆలోచనలో మేము పట్టించుకోలేదు. ఆమనిషి ఈలోగా గేత్ తీసుకొని లోపలికి వచ్చాడు. మంచి తెల్లని తెలుపు, పొడుగాటి గడ్డం, కాషాయ బట్టలు వేసుకొని ఉన్నాడు. ఈలోగా మా అమ్మ చాతలో బియ్య తెచ్చింది అతనికి వెయ్యటానికి. ఐతే అతను తీసుకోవటనికి ఒప్పుకోలేదు. ' మీ ఇంట దేవీ పూజ చేస్తారు కాదా ప్రతిరోజూ ' అని అడిగాడు. మాఅమ్మ అవునని తలఊపింది. అతను మా అమ్మ చెయ్యి చాపమని చేతిలో చిటికెడు విభూతి ఇచ్చి ' మీ పూజ గదిలోకి వెళ్ళి చూడ ' మని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడే ఉండి ఈ సంగతంతా చూస్తున్న మాకు ఎంజరుగుతుందో చూద్దామని మా అమ్మ వెనకాలే వెళ్ళాము.

విచిత్రం. పూజ గదిలోకి వెళ్ళగానే మా అమ్మ చేతిలో విభూది కారబ్బంతి పువ్వుగా మారిపోయింది. మా కళ్ళని మేమే నమ్మలేదు. మా అమ్మకైతే అసలేమి అర్థం కాలేదు. ఇలాంతివన్ని కనికట్టు అనుకి ఆ పువ్వు తరవాత మళ్ళి బూడిద ఐపొతుందని బాగా నమ్మి ఆ పువ్వుని ఒక పూజా పుస్తకంలో జాగ్రత్తగా దాచాము. పువ్వు ఎండిపోయింది గానీ మాయం మాత్రం కాలేదు. ఎన్నో ఏళ్ళు అలానే ఆ రేకులు అదే పుస్తకంలో ఉండేవి.

ఇది చదివిన చాలామందికి నేనేదో కథ చెప్తున్నా అనిపించవచ్చు. మరికొంత మంది ట్రాష్ అని కొట్టిపడేయవచ్చు. నాకు ఇలాంటివి నమ్మకం లేకపోయినా కళ్ళతో చూసింది కాదని ఎలా అనటం? ఇది నిజం. మీకెవరికైనా ఏమైనా వివరణ తెలిస్తే చెప్పండి.

Monday, December 12, 2011

కాఫీ దండకం

ఈ కాఫీ దండకం పోకూరి కాశీపతి అనే అవధాన పండితునిచే రచించబడినది. ఒకసారి ఆయన అవధానం కోసం చెన్నపట్టణం చేరుకుని సరాసరి సభాస్థలికి చేరుకున్నారు. సభా ప్రారంభానికి ముందు సభా నిర్వాహకులు ఆయనను కాస్త కాఫీ సేవించవలసిందిగా కోరారు. సగంకప్పుతాగినంతలో సభానిర్వాహకులు ఆయనను సభావేదికనలంకరించవలసిందిగా కోరారు. ఆ సమయంలో అదే సభలో ఉన్న "ఆంధ్రవిశారద" తాపీ ధర్మారావు గారు ఆయనను సేవించిన కాఫీ మీద దండకం చెప్పమని అవధానిగారిని కోరారు. అలా ఉధ్భవించినదే ఈ కాఫీ దండకం.


దండకం


         శ్రీమన్మహాదేవీ, లోకేశ్వరీ, కాళికాసన్నిభాకారిణీ, లోకసంచారిణీ, అంబ కాఫీ జగన్మోహినీ తల్లి శ్రీకృష్ణుడా స్వర్గమున్ జేరివూతంబునౌ పారిజాతంబున్ దెచ్చియున్, నాతికిన్ ప్రీతిగా నిచ్చు కాలంబునందా సుమంబందునం గల్గు బీజంబు లుర్విస్థలిన్ రాలియున్ లోకభేదంబుచే గాఫీ  భూజంబుగా బుట్టియున్, గొమ్మలన్, రెమ్మలన్, బూవులన్, దావులన్, జక్కనౌ పిందెలన్, జిక్కనౌగాయలన్, జొక్కమౌ పండ్ల భాసిల్ల దద్బీజజాలంబు నైర్లండు, నింగ్లండు, హాలెండు, పోలెండు, రష్యా, జపాన్, జర్మనీ, గ్రీకు దేశంబులన్ నాటి పెన్ మ్రాకులై ఇండియన్ దోటలై విత్తనాలిచ్చుచున్నావటంచున్ మదిన్ దోచెనే , బాపురే, తీపిలో, నీరమున్, క్షీరమున్, జెక్కెరన్, మించిటంగాదే నీ బీజ చూర్ణంబు, నా మూటిలో జేర్చి సేవించుటన్ నీదు బీజంబులన్ బెంచులో మాడ్చి చూర్ణమ్ము గావించినన్ దీపిపోదాయె నీ మాధురీ శక్తి, నీ యింపు, నీ సొంపు, నీ పెంపు వర్ణింప నేనెంతవాడన్ ధనాకర్షిణీ, ప్రాణ సంరక్షిణీ, ధాత్రి నెవ్వారలేన్ వేకువన్ లేచియున్ నిత్యకృత్యంబులన్ దీర్చి, మున్ ముందుగా నిన్ను బానంబు గావింపకున్నన్ ద్విజుల్ వేదమంత్రంబులన్ బల్కగాలేరు, ప్రాంచత్కవుల్ పద్యముల్ హృద్యమౌరీతి నిర్మింపగాలేరు, శ్రావ్యంబుగా శౌరిదాసుల్ గళం బెత్తుయున్ బాడి నృత్యంబులన్ సేయగాలేరు, శిల్పుల్ మనస్పూర్తిగా సుత్తి చేపట్టగాలేరు, వైశ్యోత్తముల్ కొట్ల తాళంబులన్ దీయగాలేరు,   డ్రైవర్లు మోటార్ల స్టీరింగులన్ బట్టగాలేరు, టిచర్లు పాఠంబులన్ జెప్పగాలేరు,    డాక్టర్లు నింజక్షనులన్ జేయగాలేరు, ప్లీడర్లు నోరెత్తి వాదింపగాలేరు, జడ్జీలు నానల్పమౌరీతి తీర్పులన్ వ్రాయగాలేరు, దిట్టంబుగ బాలసుల్ కూట సాక్ష్యంబులం జెప్పగా లేరు, వారాంగనల్ కోడెగాండ్రన్ వెనస్ గేళిలో నోలలాడింపగా లేరు, ముప్పూటలన్ నిన్నొగిన్ గ్రోలకున్నన్ శిరోభారమై నాల్క ఎండున్, మనంబెంతో చాంచల్యముంబొందుచున్ గుండియల తల్లడంబందుచున్, మేను కంపించుగాదే, కటాక్షంబుతో నిత్యమున్ వేకువన్ దర్శనమ్మిచ్చి నిన్ బాగుగం త్రాగు సౌభాగ్యమున్ గూర్చి రక్షింపవే సారెకున్ గొల్చెదన్ విశ్వకర్మాన్యంబందునన్ సత్కవీంద్రుడనన్, పోకూరి కాశీపతి స్వాంత రాజీవ సంవాసినీ నీకికన్ మంగళంబౌ మహా కాఫీ దేవీ నమస్తే నమస్తే నమస్తే నమో నమః 

Tuesday, December 6, 2011

పురాణవైర గ్రంధమాల

 కవిసామ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు రచించిన పురాణవైర గ్రంధమాలలో మొత్తం పన్నెండు నవలలున్నాయి. అవి వరుసగా...
1. భగవంతునిమీద పగ2. నాస్తికధూమము3. దూమమరేఖ4. నందోరాజా భవిష్యతి
5. చంద్రగుప్తుని స్వప్నము6. అశ్వమేధము7. అమృతవల్లి8. పులిమ్రుగ్గు
9. నాగసేనుడు10. హెలీనా11. వేదవతి12. నివేదిత

        వీరి ఈ నవలలకు ప్రేరణ ఏమిటో వారి సొంత భాషలోనే తెలుసుకుందాము.

        "అనాదినుండి, అనగా నా చిన్నప్పటినుండి, ఇంగ్లీషువాడు నేర్పెడి వాని చరిత్ర మనచరిత్రలో పాఠ్యగ్రంధములుగా చదివినప్పటినుండి, Hindu Period అను పాఠ్యగ్రంధాలలో చెప్పబడే పరిమితపుటలు గల చరిత్ర చదివినప్పటినుండి, మన పురాణములు పుక్కిటికథలని మొదలైన ఎన్నో అబద్ధములు చరిత్రలో చదివి చదివి నాకు విసుగెట్టినది. తరువాత శ్రీ చిలుకూరు వీరభద్రరావుగారు, మల్లంపల్లి సోమశేఖరశర్మ గారు, భావరాజు కృష్ణారావు గారు, నేలటూరి వెంకటరమణయ్యగారు, ఈ మొదలైన చరిత్రపరిశోధకులతో నాకు మిక్కిలి దగ్గర తనమేర్పడినది. ఈ చరిత్ర గురించి నేనెంతయో నేర్చుకొంటిని. భారతయుద్ధము రెండువేల యేడ్లక్రింద జరిగినదనీ, రామాయణము కోంచమించు మించుగా జరిగినదని చదువలేక , వినలేక నా బొమికెలు చిట్టెము కట్టెను. ఇట్లుండగా నేబదిఏండ్ల క్రిందనూ, అంతకుముందును, నర్సారావుపేటలో నడింపల్లి జగన్నాధరావుగారని ఒక వకీలు ' మహాభారత యుద్ధకాలము ' అను ఒక చిన్న గ్రంధము వ్రాసినాడు. అందులో సంస్కృత మహాభారతములో భీష్మ నిర్యాణ దినము - మకర సంక్రమణ దినము - విస్పష్టముగా చెప్పబడియున్నది. ఈ సంక్రాంతి ప్రతి సంవత్సరమును వచ్చును. అచ్చటినుండి లెక్క వేయబడినది.

ఒక పాతికేండ్ల క్రిందవరకు ఫ్రాన్సు దేశపు రాజధానియైన పారీస్ నగరములో నుండెడి గణిత శాస్త్రజ్ఞులు అఖండులు. వాళ్ళు లెక్కలు తేల్చి చూచిరి. విషయము రుజువు చేయబడినది. ఐదేండ్లకొకసారి సంవత్సర పరిమితి కొన్ని సెకండ్లో, ఒకటి రెండు నిముషాలో తగ్గుట ఖండకాల ప్రమాణస్వరూపము. ఒక ముప్పది ఏండ్లక్రిందినాటి ఈ లెక్క ప్రకారము చూడగా భీష్మ నిర్యాణ సమయమున మకరసంక్రమణమెప్పుడయినది?, 1937 సం||న మకర సంక్రమణ మెప్పుడు జరిగినది? ఈ జరిగిన దానికిని దానికిని మధ్య కాలమెంత ఉండినది? ఆకాలమును ఐదైదేండ్లకు కొన్ని కొన్ని సెకండ్లకు తగ్గెడికాలముతో విభజించెడిచో, భీష్మ నిర్యాణము జరిగి, మన పంచాంగములలో వ్రాయబడుచున్న మకర ప్రవేశమునకు, తత్పూర్యము నలుబది ఏండ్లకు పూర్వము మహాభారత యుధము జరిగినదనుటకు సరిపోవుచున్నది. దీనిని పారీస్ లోని మహాగణితశాస్త్రజ్ఞులంగీకరించిరి.



  ఈ విషయమును గురించి తత్పూర్యమే మద్రాసులోని ఒక తమిళ పండితుడు, ప్లీడరు - ఆయనపేరు నారాయణయ్యర్ అనుకొందును - ఆయన ' శంకరుని కాలనిర్ణయ ' మను నొక గ్రంధము వ్రాసెను.

పాశ్చత్య చరిత్రకారులు మన పురాణములందున్న విషయములన్నియు వాళ్ళ ఇష్టమువచ్చినట్లు మార్చివేసిరి. వారి మార్చినదానికి కారణములతో మనకవసరములేదు. ఈ పైన చెప్పిన లెక్కల ప్రకారము మనపురాణములలోనున్న రాజవంశములయొక్క కులములు సరిపోవుచున్నవి. ఇవికాక, మనదేశములోనే' మగధ రాజ వంశావళి '' నేపాళరాజ వంశావళి ' మొదలైన పూర్వ గ్రంధములు కలవు. ఇవికాక కల్హణుని ' రాజతరంగిణి ' కలదు. మనకే చరిత్ర గ్రంధములు చాలాకలవు. విజయవాడలో శ్రీ కోట వెంకటాచలం గారని ఒక మహాపురుషుడు ఈ మహాపరిశోధన అంతయూ జేసి, ఆ నారయణయ్యర్ గారు ఈ జగన్నాధం పంతులుగారు చేసిన పరిశోధనలకు చెట్లు కట్టించి, పూయించి, కాయించి పండించిరి. ఆయన చాలా గొప్ప గ్రంధమ్ములు వ్రాసెను. వానికి ప్రశస్తి ఎందుకు రాలేదనిన మనము బానిస జాతి ఐపోయినాము గనుక.

ఈ మహావిషయాన్ని పురస్కరించుకొని ' పురాణవైర గ్రంధమాల ' అని పండ్రెండు నవలలు వ్రాసాను. నేటి ఆంధ్ర చరిత్రనుబట్టి చూస్తే ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండినులు, ఇటువంటి పేర్లు, వాళ్ళు పాలించిన కొద్ది కొద్ది భూభాగాలు, శాసనములు --- ఈ రీతిగా మన యాంధ్ర చరిత్ర ధ్వంసమైపోయింది.

 భారతయుద్ధమైన తరవాత మగధ సామ్రాజ్యమున్నది. జరాసంధుని వంశమున్నది. గిరివ్రజము రాజధానిగా రెండువేల యేండ్లు మహాప్రభువులు భారతదేశమును సామ్రాజ్యముగా పరిపాలించిరి. అందులో ఆరువందల ఏండ్లు, ఆంధ్రులైన శాతవాహనులు గిరివ్రజము నుండి భారతదేశ సామ్రాజ్యమును నేలిరి. ' ద్రావిడభాషలయొక్క తరతమభేద నిరూపక వ్యాకరణ ' మని కార్డ్వెల్ దొర ఒక గ్రంధాన్ని వ్రాసాడు. పాపమా కార్డ్వెల్ శాసించలేదు. పండితులను విచారించమన్నాడు. మనదేశములో అది ప్రమాణగ్రంధమై పోయినది. పరిశోధనలు దానిమీదనే జరుగుచున్నవి. ఇట్టివి ఎన్నియున్నవి? అది వదలివేద్దాము. ఆ కార్డ్వెల్ ఆఫ్ఘన్ స్థానములో బ్రాహూయీ అను ఒక భాష ఉన్నదనీ, ఆ భాషకు మన తెలుగు భాషకు పలువిషయములయందు సామ్యమున్నదని వ్రాసినాడు. శాతవాహనులాంధ్రులు. వారు భారత సామ్రాజ్యమును పాలించినప్పుడు ఆయాప్రాంతములందరు ఆంధ్రులై ఉందురు. ఆనాటి ఆఫ్ఘన్ స్థానములో నెవ్వడో ఆంధ్రుడు అధిపతి ఐ, ఆ ఆటవికులచేత మన భాష చదివించియుండును. దీని లక్షణములు అక్కడ పాతుకు పోయినవి.



 మన చరిత్ర వేరే యున్నది. ఈ మగధరాజ్యము, మౌర్య చంద్రగుప్తుడు, తరవాత గుప్త రాజ్యము, గుప్త చంద్రగుప్తుడు, అలెగ్జాండర్ మనదేశము మీదికి దండెత్తివచ్చినది గుప్త చంద్రగుప్తుని కాలములో. మౌర్య చంద్రగుప్తుని కాలములో కాదు. మౌర్య చంద్రగుప్తునికాలములో నని 1200 ఏండ్లు పాశ్చాత్య చరిత్రకారులు మన చరిత్రను వెనుకకుతోసిరి. అంతదూరము పోనక్కరలేదు. శివాజీగురించి ఎన్ని అబద్ధములు వ్రాసిరి? కలకత్తా బ్లాక్ హోల్ అన్నది జరుగలేదని మనచరిత్ర కారులు రుజువు చేయగా, పాఠ్యగ్రంధముల నుండి తొలగించలేదు.

        మన చరిత్ర విస్పష్టముగానున్నది. మన పురాణములయందలి మగధరాజ వంశాదులయందలి యధార్ధచరిత్ర ననుసంధించి నేను పురాణవైర గ్రంధమాలను పండెండ్రు నవలలను వ్రాసితిని. అందులో ' చంద్రగుప్తుని స్వప్న ' మన్న నవల గుప్త చంద్రగుప్త, మౌర్య చంద్రగుప్తుల భేదమును చెప్పును."

        (ఈ భాగము శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు వ్రాసిన ' నేను - నా సాహిత్య రచనలు ' అనే వ్యాసం యువభారతి వారి ప్రచురణ, ' మహతి ' స్వతంత్ర్య యుగోదయం (1947-1972) లో తెలుగు తీరుతెన్నులు సమీక్ష వ్యాస సంకలనం నుండి గ్రహించబడినది)

Monday, November 21, 2011

కల్యాణ ప్రదమైన కల్యాణి రాగం


కర్నాటక సంగీతంలో ప్రసిద్ధరాగాలలో కల్యాణి రాగం ఒకటి. ఈ రాగం 65వ మేళకర్త ప్రతిమధ్యమ రాగం.సంపూర్ణ రాగం. కటపయాది సూత్ర ప్రకారం 11వ చక్రమైన ఆదిత్య చక్రంలో 5వరాగం, మేచకల్యాణి గా వ్యవహరిస్తారు. శుద్ధమధ్యమ రాగాల్లో శంకరాభరణం ఈ రాగానికి సమానం. అంటే ప్రతిమధ్యం బదులు శుద్ధమధ్యమం వాడితే శంకరాభరణరాగం అవుతుంది. ఈ రాగం హిందుస్థానీ సంగీతంలో యమన్ గా ప్రసిద్ధి చెందింది.
ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు ఈ ప్రకారంగా ఉంటాయి.


సడ్జమము(స), చతుశ్రుతి రిషభము(చ.రి), అంతర గాంధారం(అం.గా), ప్రతి మధ్యమం(ప్ర.మ), పంచమం(ప),చతుశ్రుతి ధైవతం(చ.ధై), కాకలి నిషాదం(కా.ని).


దక్షిణ భారతదేశంలో పెళ్ళిళ్ళు మెదలైన శుభకార్యాలలో ఈ రాగం చాలా తరచుగా వినిపిస్తుంది.  కల్యాణప్రదమైన ఈ రాగంలో అందరు వాగ్గేయకారులు రచనలు చేసారు. వాటిలోకొన్ని:


1. వనాజాక్షీరో - అట తాళ వర్ణం - పల్లవి గోపాల అయ్యార్
2. నిధిచాలా సుఖమా - త్యాగరాజు
3. ఏ తావునరా నిలకడ నీకు -త్యాగరాజు
4. సుందరినీ దివ్య రూపమును చూడ - త్యాగరాజు
5. అమ్మ రావమ్మ తులసమ్మ - త్యాగరాజు
6. వాసుదేవయని వెడలిన - త్యాగరాజు
7. కమలాంబాం భజరే - ముత్తుస్వామి దీక్షితార్
8. హిమాద్రి సుతే పాహిమాం - శ్యామశాస్త్రి


ఇలాంటి ఎన్నో ప్రసిద్ధ రచనలు వాగ్గేయకారులచే చేయబడ్డాయి. 


కర్నాటక సంగీతంలోనే కాక చలన చిత్రసంగీతంలో కూడా ఈ రాగాం చాలా ప్రసిద్ధి కెక్కింది. ఇళయరాజా గారు ఈ రాగంలో ఎన్నో తమిళ పాటలకు సంగీతం కూర్చారు. హింది చలన చిత్రాలలో కూడా ఈ రాగలోని పాటలు అత్యంత ప్రసిద్ధి చందాయి. వాటిలో కొన్ని:


1. మన్ రే, తుకాహె న ధీర్ ధరే - చిత్రలేఖ
2. జిందగీ భర్ నహీ భూలేగి బర్సాత్ కి రాత్ - బర్సాత్ కి రాత్
3. ఆసూ భరీ హై  యే జీవన్ కి రాహే - పర్వరిష్


ఇక తెలుగులో ఈ రాగంలో అత్యంత జనరంజకమైన పాటలు ఉన్నాయి: వాటిలో కొన్ని:


1. మనసున మల్లెల మాలలూగెనే (మల్లీశ్వరి)(ఇక్కడ వినండి)
2. సావిరహే తవదీనా రాధ (విప్రనారాయణ) (ఇక్కడ వినండి)
3. జగమే మారినది మధురముగా ఈ వేళ (దేశద్రోహులు) (ఇక్కడ వినండి)
4. మది శారదా దేవి మందిరమే (జయభేరి) (క్కడ వినండి)
5. తోటలో నారాజు (ఏకవీర) (ఇక్కడ వినండి)
6. సలలిత రాగ సుధా రస సారం (నర్తనశాల) (ఇక్కడ వినండి)
7. ఎప్పటి వలే కాదురా నా స్వామి (అభిమానవంతుడు) 
8. జోరుమీదున్నావు తుమ్మెదా (శివరంజని) (ఇక్కడ వినండి)
9. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ (దేవదాసు) (ఇక్కడ వినండి)
10. చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో (సంతానం) (ఇక్కడ వినండి)
11. తొలివలపే పదే పదే పిలిచే (దేవత) 
12. పూచే పూలలోనా (గీత) 
13. రావే నా చెలియా ..చెలియా (మంచిమనసుకు మంచిరోజులు) (ఇక్కడ వినండి)
14. దొరకునా ఇటువంటి సేవ (శంకరాభరణం) (ఇక్కడ వినండి)
15. పూవై విరిసిన పున్నమి వేళ (తిరుపతమ్మ కథ) (ఇక్కడ వినండి)
16. ఎవరివో నీవెవరివో (పునర్జన్మ) ()
17. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా (దళపతి) (ఇక్కడ వినండి)
18. ఏదో తెలియని బంధమిది ఎదలో ఒదిగిన రాగమిదీ (నాయకుడు) (ఇక్కడ వినండి)
19. నా ఊపిరీ నీవేనులే దేవదేవా (పోలీస్ డైరీ) 
20. ఈనాడే ఎదో అయ్యిందీ ఏనాడూ నాలో జరగనిదీ (ప్రేమ) (ఇక్కడ వినండి)
21. హాయి హాయి హాయి వెన్నెలమ్మ హాయి ...(తారకరాముడు) 
22. సుందరి నేనే నువ్వంట (దళపతి) (ఇక్కడ వినండి)
23. రారా నా సామి రారా (విప్రనారాయణ) (ఇక్కడ వినండి)
24. మనసే కోవెలగా మమతలు మల్లెలుగా (మాతృదేవత) (ఇక్కడ వినండి)
25. పెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకుని (పెళ్ళిచేసి చూడు) (ఇక్కడ వినండి)
26. పాడనా వాణి కళ్యాణి గా (మేఘసందేశం) (ఇక్కడ వినండి)
27. మాణిక్యవీణాం ముఫలాలయంతీం (మహాకవి కాళిదాసు)


ఇలా చెప్పుకొంటూపోతే అంతే ఉండదు. ఈ రాగానికి ఇది చిన్న ఉపోద్ఘాతం మాత్రమే. 
(తప్పులుంటే మన్నించండి)